మదీనాకు 34 మంది బాధిత కుటుంబ సభ్యులు, నలుగురు అధికారులు...
ఇప్పటికే అక్కడకు చేరుకున్న మంత్రి అజహర్, ఎమ్మెల్యే మాజీద్
డీఎన్‌ఏ టెస్టుల అనంతరం మదీనాలోనే మృతదేహాల ఖననం
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ/ముషీరాబాద్/ నాంపల్లి: కడసారి తమ వారిని చూసుకునేందుకు, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 38 మంది మదీనాకు బయలుదేరారు. మంగళవారం రాత్రి 8 గంటలకు నాంపల్లిలోని హజ్ భవన్‌కు వారంతా వచ్చారు. శంషాబాద్‌ఎయిర్‌పోర్ట్ నుంచి రాత్రి ఒంటి గంటకు విమానంలో బయలుదేరారు. వీరంతా బుధవారం ఉదయం మదీనాకు చేరుకుంటారు.
సోమవారమే అక్కడకు వెళ్లిన మంత్రి అజహరుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.షఫీవుల్లా, ఇతర ప్రభుత్వ అధికారులు మదీనాకు వచ్చేవారికి దగ్గరుండి ఏర్పాట్లు చేస్తారు. అయితే ప్రమాదం జరిగి 30 గంటలు దాటుతున్నా, బంధువులను ఎంత మందిని మదీనాకు తీసుకువెళ్లాలి అనేదానిపై హజ్ కమిటీ జాప్యం చేస్తుందని బాధిత కుటుంబాల బంధువులు మంగళవారం ఉదయం మాజీ హోంమంత్రి మహమూద్ ఆలీ, ఎమ్మెల్యే తనయుడు ముఠా జైసింహ దృష్టికి తీసుకువెళ్లారు.
వారు వెంటనే విద్యానగర్ నుంచి నేరుగా నాంపల్లిలోని హజ్ భవన్‌కు చేరుకొని హజ్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హజ్ కమిటీ సభ్యులు, బంధువుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒక దశలో బంధువులు ధర్నాకు దిగారు. దీంతో స్పందించిన ప్రతినిధులు ఎంత మంది వెళతారో జాబితా ఇవ్వాలని కోరగా బంధువుల లిస్టును వారికి సమర్పించారు. అందులో 34 మందిని ఎంపిక చేశారు.
వీరితోపాటు నలుగురు అధికా రులు కూడా వెళుతున్నారు. విద్యానగర్ నుంచి మహ్మద్ సోహెబ్, ఇబ్రహీం షరీఫ్, సాదిజ్‌పాషా, షేక్ రషీద్, మునీర్ అహ్మద్, ఇర్ఫాన్ షరీఫ్, గౌస్ షేక్, అబ్దుల్ ఇర్షాద్, అబ్దుల్ వహిద్, అబ్దుల్ రషీద్‌లు మదీనాకు వెళ్లినవారిలో ఉన్నారు. వీరంతా రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో వెళుతున్నారని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ బియబానీ ఖుస్రోపాషా ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.
ప్రభుత్వ ఖర్చులతో బాధిత కుటుంబాలు మదీనాకు వెళుతున్నాయని, సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని పబ్లిక్ గార్డెన్స్‌లోని రాయల్ మసీదులో ప్రత్యేక దువా చేశామని చెప్పారు.
నేడు, లేదా రేపు అంత్యక్రియలు
బస్సులో సజీవ దహనమైన వారి అంత్య క్రియలు బుధ లేదా గురువారాల్లో జరిగే అవకాశముంది. ఈ మేరకు సౌదీ ప్రభుత్వం ఢిలీలోని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇచ్చింది. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం ఆయా కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తారు. వారి సమక్షంలోనే ఖననం చేసేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్కడే ఖననం: హజ్, ఉమ్రా యాత్ర సమయంలో యాత్రికులు విమానం లేదా రైలు, రోడ్డు ప్రమాదంలో ఒకవేళ మరణిస్తే.. మృతదేహాలను సౌదీ అరేబియాలోనే ఖననం చేయడానికి వారు, వారి కుటుంబ సభ్యులు అంగీకరించినట్టు యాత్రకు వెళ్లే ముందు దరఖాస్తు ఫారమ్‌లో స్పష్టంగా పేర్కొంటారు.
ఒకవేళ ప్రమాదం జరిగిన తర్వాత వారి కుటుంబ సభ్యులు తమ వారి మృతదేహాలు అప్పగించాలని అభ్యంతరం తెలిపినా, యాత్రికులు ముందే అనుమతి ఇచ్చినందున మృతదేహాలను వెనక్కి పంపించడం చట్టపరంగా సాధ్యం కాదని కేంద్ర హజ్ కమిటీ అధికారులు చెబుతున్నారు. మక్కా, మదీనా వంటి తీర్థయాత్రలకు వెళ్లే ముందు యాత్రికులు నింపే అధికారిక ఫారంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంటారు.
ఒకవేళ యాత్ర సమయంలో యాత్రికుడు మరణిస్తే.. మృతదేహాన్ని సౌదీ అరేబియాలోనే ఖననం చేయడానికి అంగీకరిస్తూ ఆ ఫారంలో వారు సంతకం చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను భారత్‌కు తీసుకురావడం చట్టపరంగా సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నష్టపరిహారంపై నిబంధన
సౌదీ హజ్ చట్టం ప్రకారం.. హజ్, ఉమ్రా మతపరమైన యాత్రలు కాబట్టి వాటికి.. ప్రభుత్వపరంగా ఎలాంటి బీమా ఆధారిత సౌకర్యాలు ఉండవు. హజ్ యాత్ర సమయంలో ఎవరైనా మరణిస్తే.. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం చెల్లించదు.
హజ్ యాత్రికులు భారత్‌లో ప్రైవేట్ బీమా తీసుకొని ఉంటే.. వారి పాలసీ ప్రకారం ఆర్థిక సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియను సౌదీ అరేబియా ప్రభుత్వం కాకుండా, సంబంధిత యాత్రికుడి దేశం, వారి బీమా సంస్థ ద్వారా మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది.
కాలిపోయిన ముద్దలు చూసి ఏం చేస్తారు
అవమానకర వ్యాఖ్యలు చేసిన ఉర్దూ అకాడమీ డైరెక్టర్
అభ్యంతరం తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు..హజ్ హౌస్‌లో వాగ్వాదం..తక్షణమే డిప్యుటేషన్ రద్దు.. తిరిగి మాతృ సంస్థకు మహమ్మద్ షఫియుల్లా
సాక్షి, హైదరాబాద్: ఉమ్రా యాత్రలో మృతి చెందిన వారిపై అవమానకర వ్యాఖ్యలు చేసిన మహమ్మద్ షఫియుల్లాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఏకంగా డిప్యుటేషన్ రద్దు చేస్తూ సొంత శాఖకు వెనక్కి పంపించింది. ఉమ్రా యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి అంత్యక్రియలు మక్కాలో ఇస్లాం సంప్రదాయం ప్రకారం నిర్వహించేందుకు ఒక్కో బాధిత కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున బంధువులను అక్కడకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.
అయితే బాధిత కుటుంబాలు మంగళవారం హైదరాబాద్ హజ్ హౌస్‌కు రాగా, వారితో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్, హజ్ కమిటీ ఇన్‌చార్జ్ ఈఓ మహమ్మద్ షఫియుల్లా మృతులను అవమానించే విధంగా వాఖ్యలు చేశారు. ‘బస్సు ప్రమాదంలో మొత్తం కాలిపోయారు... అక్కడకు వెళ్లి కాలిపోయిన ముద్దలు చూసి ఏం చేస్తారు’అంటూ నోరుపారేసుకున్నారు. దీంతో బాధిత కుటుంబాల సభ్యులు ఆయన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ప్రమాదంలో మీ కుటుంబ సభ్యులుంటే ఇలాగే వ్యాఖ్యలు చేస్తారా? వారి అంత్యక్రియలకు హాజరుకారా? అంటూ విరుచుకుపడ్డారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావారణం నెలకొంది. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, సత్వరమే సర్కార్ చర్యలకు ఉప్రకమించింది.
ఆయన్ను ఉర్దూ అకాడమీ డైరెక్టర్, హజ్ కమిటీ ఇన్‌చార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవుల నుంచి తప్పించి డిప్యుటేషన్ రద్దు చేస్తూ మాతృ సంస్థ టీజీ జెన్‌కోకు పంపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ (మైనారిటీ) కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వక్ఫ్ సర్వే కమిషనర్ అసదుల్లాకు బాధ్యతలు అప్పగించారు.


