పెట్టుబడులు, విద్యారంగ బలోపేతం, తెలంగాణ అభివృద్ధిపై చర్చలు
ఎన్నారైలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, నిపుణులతో సీఎం ముఖాముఖి
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్నారై కన్వీనర్ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులు బలమైన మద్దతుదారులు, రాయబారులుగా ఉండాలని సీఎం పిలుపు
లండన్: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లండన్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులు, ఇండియన్, తెలుగు కమ్యూనిటీ ప్రతినిధులతో ప్రత్యేక ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లండన్‌లోని ప్రముఖ తాజ్ హోటల్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్నారై కన్వీనర్, ఇండియన్ కమ్యూనిటీ నాయకుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూకేలోని తెలుగు కమ్యూనిటీ నాయకులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రవాస తెలంగాణ సమాజంతో ప్రభుత్వ అనుసంధానం, భవిష్యత్ కార్యాచరణ వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవాసులతో ముఖాముఖిగా చర్చించారు. రాష్ట్ర ప్రగతికి ప్రవాసుల అనుభవం, నైపుణ్యం, పెట్టుబడులు, ఆలోచనలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్‌కు ప్రవాసులు భాగస్వాములు కావాలి
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైజింగ్’కు ప్రవాస భారతీయులు బలమైన మద్దతుదారులుగా, రాయబారులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక, ఆవిష్కరణల శక్తి కేంద్రంగా తెలంగాణ ఎదుగుతున్న ప్రయాణంలో ప్రవాసులు చురుకైన భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు.
ఎన్నారైలు, పెట్టుబడిదారులు, వివిధ రంగాల నిపుణులతో స్వయంగా మమేకమైన సీఎం.. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే కొత్త ఆలోచనలు, సూచనలు అందించాలని కోరారు. ప్రవాస తెలంగాణ సమాజం మధ్య నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడం ద్వారా తెలంగాణలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు కలిసి పనిచేయాలని సూచించారు.
పెట్టుబడులు, విద్యపై ప్రత్యేక దృష్టి
కార్యక్రమంలో పెట్టుబడులు, విద్యారంగం, ఎన్నారైలతో తెలంగాణ ప్రభుత్వ అనుసంధానం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. యూకే, యూరప్‌లో ఉన్న పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా మరింత అనుకూల వాతావరణం కల్పించడం, విద్యారంగంలో అంతర్జాతీయ అనుభవాన్ని రాష్ట్రానికి అనుసంధానం చేయడం, ప్రవాస నిపుణుల సేవలను తెలంగాణ అభివృద్ధికి వినియోగించుకోవడం వంటి అంశాలపై చర్చ జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డిపై సుధాకర్ గౌడ్ ప్రశంసలు
కార్యక్రమ నిర్వాహకుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్నారై కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి లండన్‌తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. గతంలో లండన్ పర్యటన సందర్భంగా గల్ఫ్ ఎన్నారైలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన విషయాన్ని ప్రస్తావించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని, ఆయనకు లండన్‌లోనే కాకుండా యూకేలోని ప్రవాస భారతీయులు, తెలంగాణ సమాజంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఆయనకు అండగా నిలిచే అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని అన్నారు.
ఎన్నారైలకు తెలంగాణ ప్రభుత్వంతో మరింత బలమైన కనెక్టివిటీ
యూకేలో ఉన్న పెట్టుబడులు, విద్యా అవకాశాలు, ఎన్నారైల అవసరాలకు తెలంగాణ ప్రభుత్వంతో నేరుగా అనుసంధానం కల్పించేలా ఒక బలమైన వారధి ఉండాలని సుధాకర్ గౌడ్ కోరారు. యూకేలోని తెలంగాణ సమాజం, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు రాష్ట్ర ప్రభుత్వంతో మరింత సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థ అవసరమని సూచించారు.
ఈ ప్రతిపాదనపై మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సుధాకర్ గౌడ్ తెలిపారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న తదుపరి గ్లోబల్ సమ్మిట్ బిజినెస్ మీట్‌కు యూకేలోని పెట్టుబడిదారులు, నిపుణులను ఆహ్వానిస్తామని వారు వెల్లడించినట్లు చెప్పారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎన్నారై పాలసీ, ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ గురించి సవివరంగా వివరించారు. అలాగే యూకే, యూరప్‌కు భారత్‌తో వేగవంతమైన కనెక్టివిటీ ఉన్నందున, అక్కడి ఎన్నారైలు, పెట్టుబడిదారులు, నిపుణులకు అనుకూలంగా ప్రత్యేక విధివిధానాలను రూపొందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.
విద్యారంగంపై ప్రశ్నోత్తరాల సెషన్
కార్యక్రమంలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల సెషన్‌లో తెలంగాణ విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నారైలు, విద్యావేత్తలతో సుదీర్ఘంగా చర్చించారు.
విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నిపుణుల అనుభవం, జ్ఞానం, ఆలోచనలను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకునేలా ప్రభుత్వం, ప్రవాస తెలంగాణ సమాజం మధ్య మరింత సమన్వయం అవసరమని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
‘లెట్స్ యునైట్.. లెట్స్ ఎంగేజ్.. లెట్స్ బిల్డ్ ఎ బెటర్ తెలంగాణ’
“Let’s Unite. Let’s Engage. Let’s Build a Better Telangana” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రవాస తెలుగువారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, విదేశాల్లోని నిపుణుల అనుభవాన్ని తెలంగాణ ప్రగతికి వినియోగించుకోవడం, ప్రభుత్వంతో ప్రవాస సమాజానికి మరింత బలమైన అనుసంధానం కల్పించడం వంటి అంశాలపై సమావేశం ద్వారా స్పష్టమైన దిశ ఏర్పడింది.
సుధాకర్ గౌడ్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ‘లండన్ మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ప్రవాస తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు పెట్టుబడులు, విద్య, నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవాలను రాష్ట్ర ప్రగతికి అనుసంధానం చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా మారింది.


