హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్య నగర్‌కు జంబో మిషన్ చేరుకుంది. ప‍్రమాదకర భవనాలను కూల్చనున్న జంబో మిషన్ ద్వారా సిబ్బంది కూల్చివేయనున్నారు. పక్క భవనాలకు ప్రమాదం జరగకుండా బాహుబలి మిషన్ వాడి, చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పరిసరాల్లోని 5 భవనాలను అధికారులు ఖాళీ చేయించారు. భారీ యంత్రాలతో కూల్చివేత పనులకు రంగం సిద్ధమైంది.
కాగా, అంజయ్య నగర్‌లో 50 గజాల స్థలంలో ఆ ఏడంతస్తుల భవనాన్ని నిర్మించాలనుకున్నారు. కుప్పకూలిన ఈ భవనం శిథిలాలు దాని పక్కనే ఉన్న నివాస భవనాలపై పడ్డాయి. దీంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వారు మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో ఇతర భవనాల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ప్రత్యేక పరికరాలతో శిథిలాలను తొలగించారు.
అక్కడ ఏడంతస్తుల ఈ భవనాన్ని నిర్మిస్తున్న బిల్డర్ సాజిద్ ఖాన్ పరారీలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో అతడు నిర్మిస్తున్న భవనాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. చిన్న స్థలాల్లో అధిక అంతస్తులు నిర్మించి, వాటిని హాస్టళ్లుగా వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అంజయ్యనగర్‌లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు మరిన్ని ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ప్రపంచం ముందు భారత్ తలెత్తుకు నిలబడేలా.. 4 నెలల్లో..


