ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోరం జరిగింది. ఆ దేశంలో నివసిస్తున్న రిటైర్డ్ హిందూ టీచర్ కుటుంబంతో సహా అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలు నివాసంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే వీరిని ఎవరూ హత్యచేశారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
మృతులు విశ్రాంత ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), అతని భార్య ప్రీతిలత చక్రవర్తి (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియం చక్రవర్తి (12)గా పోలీసులు గుర్తించారు. దాస్పరా ప్రాంతంలోని తాళం వేసి ఉన్న ఇంట్లో శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో పోలీసులు ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ ఉద్యోగి గణపతి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. అయితే వారి బంధువులు ఇటీవల తరచుగా ఫోన్లు చేశారు. అయితే వారి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో వారి ఉనికిపై బంధువులకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫోన్లు గురువారం రాత్రి నుంచి స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన చెందిన బంధువులు శనివారం రాత్రి వారి ఇంటికి వచ్చి చూశారు. ఇల్లు బయటి నుంచి తాళం వేసి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించగా, ఇంట్లో నలుగురి మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.
తల్లీకూతుళ్ల మృతదేహాలు మెట్లపై లభించగా, గణపతి మృతదేహం పైకప్పుపై, కుమారుడి మృతదేహం మంచం కింద లభించాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ), డిటెక్టివ్ బ్రాంచ్ (డీబీ) అధికారులు సంయుృతంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే వీరిని ఎవరూ హత్య చేశారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ హత్యలపై గణపతి చక్రవర్తి కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. నలుగురినీ ఎవరు చంపి ఉంటారో, వారి వెనుక ఉద్దేశ్యం ఏమిటో తమ కుటుంబానికి అర్థం కావడం లేదు. నా సోదరిని, ఆమె కుటుంబం మొత్తాన్ని ఎవరు చంపారో, అది ఎందుకు, ఎప్పుడు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నా సోదరి భర్త చాలా మంచివాడు. అతనికి శత్రువులు లేరు. వారు దాస్‌పారాలో ఒక కొత్త ఇల్లు కట్టుకుని అక్కడ నివసిస్తున్నారు." అని అన్నారు.
కాగా బంగ్లాదేశ్‌లో తారిఖ్ రహమాన్ ప్రభుత్వం ఏర్పడక ముందు తీవ్ర స్థాయిలో మత ఘర్షణలు చెలరేగాయి. అక్కడి మత ఛాందసవాదులు పెద్దఎత్తున హిందు కుటుంబాలపై దాడులకు తెగబడ్డారు.కాగా ప్రస్తుతం జరిగిన హత్యల వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.



