ఫ్యాషన్
అబ్బాయిల కోసం... పెళ్లి వస్తే షేర్వానీ, పండగ వస్తే కుర్తా! అంతే... కథ క్లోజ్! అనుకుంటే మీ పొరపాటే! ఇప్పుడు మెన్స్ ఫ్యాషన్ బాగా మారింది. సంప్రదాయానికి కాస్త స్టయిల్ జతచేస్తే ఫ్యాషన్ తో పోటీపడే సంప్రదాయ రాయలు మీరే అవుతారు! అయితే, ముందు మీరు ఈ టిప్స్ తెలుసుకోండి!
పెళ్లికి వచ్చిన హీరో!
పెళ్లి వేడుకలో అందరి చూపు మీవైపు ఉండాలంటే షేర్వానీకి మించిన ఆప్షన్ కష్టం. అయితే, అదే షేర్వానీని సిల్క్, బ్రొకేడ్ వంటి రిచ్ ఫ్యాబ్రిక్స్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో రాయల్ లుక్ కనిపిస్తుంది. దీనికి ధోతీ ప్యాంట్ జత చేస్తే లుక్ పూర్తవుతుంది. అయితే ఎంబ్రాయిడరీ ఎక్కువగా ఉన్న షేర్వానీ అయితే మిగతా యాక్సెసరీస్‌ను కాస్త సింపుల్‌గా ఉంచండి.
కూల్ కజిన్!
షేర్వానీ రిచ్‌గా అనిపిస్తుంది... కుర్తా కాస్త క్యాజువల్‌గా అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్యలో చక్కగా బ్యాలెన్స్ చేసేది యాచ్కన్ . పొడవు కాస్త తక్కువగా ఉండటంతో ఇది సంప్రదాయంగానూ, సౌకర్యంగానూ ఉంటుంది. ఎంగేజ్‌మెంట్, పండగ, పెళ్లి వేడుక... సందర్భాన్ని బట్టి చుడీదార్ లేదా ధోతీ ప్యాంట్‌తో జత చేసుకోవచ్చు.
ఫెయిల్ కాని బ్యాక్‌బెంచర్!
మెన్స్ ఎథ్నిక్ వేర్‌లో కుర్తా అంటే... టాప్‌బ్యాక్‌బెంచర్. కుర్తా ఒకసారి వార్డ్‌రోబ్‌లోకి వచ్చిందంటే చాలు. ఇక మిమ్మల్ని ఏ అకేషన్‌లోనూ ఫెయిల్ కానివ్వదు. ఆ ఒక్క డ్రెస్‌తో ఎన్నో అవతారాలు! కాటన్ కుర్తా అయితే సింపుల్ అండ్ కూల్. సిల్క్ లేదా ఎంబ్రాయిడరీ కుర్తా అయితే పండగ లుక్. ప్యాంట్‌తో వేసుకుంటే క్లాసీ... జీన్స్‌తో వేసుకుంటే యూత్‌ఫుల్! అయితే, కుర్తా రంగుకి కాస్త కాంట్రాస్ట్‌లో రంగులో జాకెట్ ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
సూట్ కాస్త స్టయిల్‌గా!
సంప్రదాయంగా కనిపించాలి... కానీ మరీ పెళ్లి కొడుకులా కాకూడదు అనుకుంటే జోధ్‌పురి లేదా బంధ్‌గలా బెస్ట్. సాధారణ సూట్‌కి, కాస్త ఇండియన్ స్టయిల్ కలిస్తే అదే జోధ్‌పురి మ్యాజిక్! హై నెక్ కాలర్, స్ట్రక్చర్డ్ ఫిట్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. రిసెప్షన్ , ఫార్మల్ ఫంక్షన్ , కల్చరల్ ఈవెంట్... ఎక్కడైనా ఇది చాలా క్లాసీగా ఉంటుంది.
మూలాలు మర్చిపోకుండా!
ధోతీ అంటే పెద్దల డ్రెస్ అనుకునే రోజులు పోయాయి. సరైన కుర్తా, జాకెట్, ఫుట్‌వేర్‌తో ధోతీని కూడా చాలా స్టైలిష్‌గా క్యారీ చేయొచ్చు. పండగలు, దేవాలయ వేడుకలు, సంప్రదాయ కార్యక్రమాలకు ఇది ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. ట్రెండ్ మారొచ్చు... కానీ కొన్ని స్టయిల్స్ మన రూట్స్‌ను ఎప్పటికీ మర్చిపోనివ్వవు!
చివరిగా... ఎథ్నిక్ అంటే పాతకాలం కాదు! డ్రెస్ ఏదైనా... దాన్ని ఎలా క్యారీ చేస్తున్నారన్నదే అసలైన ఫ్యాషన్! కాబట్టి ఈసారి ఎథ్నిక్ వేర్ వేసుకునేటప్పుడు సంప్రదాయాన్ని మాత్రమే కాదు, మీ స్టయిల్‌ను కూడా వెంట తీసుకెళ్లండి!
- కొండి దీపిక


