పిల్లల కథ
కంచిపేటలో భీమరాజు అనే వస్తాదు ఉండేవాడు. అతని ఆకారం కండలు తిరిగిన దేహంతో భారీగా బలిష్టంగా ఉండేది. కానీ స్వతహాగా అతను చాలా పిరికివాడు. దానికితోడు అతని గొంతు కూడా ఆకారానికి సంబంధం లేకుండా పీలగా ఉండేది.
దాంతో భీమరాజు వీలైనంత తక్కువగా మాట్లాడుతూ న్యూనతతో ఉండేవాడు. కానీ చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే కుస్తీ పోటీల్లో మాత్రం చురుగ్గా పాల్గొని తప్పనిసరిగా బహుమతులు గెలుచుకునేవాడు.
ఒకసారి రాజధానిలో భారీఎత్తున కుస్తీపోటీలు నిర్వహిస్తున్నట్టు, బహుమతి కూడా చాలా అధిక మొత్తంగా ఉంటుందనీ రాజుగారు చాటింపు వేయించారు.
ఆ పోటీల్లో గెలిస్తే బహుమతితో పాటు పేరుప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి కాబట్టి పోటీలో పాల్గొనడానికి రాజధానికి బయలుదేరేందుకు సిద్ధపడ్డాడు భీమరాజు. కానీ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే, కంచిపేటకు రాజధానికి మధ్య ఒకరోజు ప్రయాణదూరం, అదీ చిక్కని అడవిమార్గం గుండా. స్వతహాగా పిరికివాడైన భీమరాజు ఈ సమస్యని అధిగమించి రాజధాని చేరడమెలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే అతనికి జాలయ్య తనకి సహాయపడగలడని అనిపించింది.
జాలయ్య శారీరకంగా భీమరాజుకి భిన్నంగా బక్కపల్చగా ఉన్నా చాలా ధైర్యశాలి. అతని గొంతు కూడా గంభీరంగా ఉండి ఊళ్లో చాలా చురుకైనవాడిగా పేరు ఉంది. జాలయ్యని కలిసి భీమరాజు రాజధాని వరకు తనకు తోడుగా వచ్చి సహాయపడమని కోరాడు. జాలయ్యకి కూడా ఎప్పటినుంచో రాజధానికి వెళ్లి ఏదైనా ఉద్యోగం సంపాదించి స్థిరపడాలని ఉంది. అందుకే జాలయ్య వెంటనే భీమరాజు ప్రతిపాదనని అంగీకరించాడు.
పోటీలకు రెండు రోజుల ముందు భీమరాజు, జాలయ్య కంచిపేట నుండి రాజధానికి బయలుదేరారు. ఎంత ప్రయత్నించినా చీకటి పడేసరికి అడవిని దాటలేక మార్గమధ్యంలోనే రాత్రి బస చేయవలసివచ్చింది. అడవిలో ఒక పాడుబడ్డ ఆలయం ఆవరణలో ఇద్దరూ విశ్రమించారు. భయంతో భీమరాజుకి నిద్ర పట్టలేదు.
అర్ధరాత్రి సమయంలో ఏదో అలికిడికి జాలయ్యకి కూడా మెలకువ వచ్చింది.
కొందరు బందిపోటు దొంగలు అటువేపుగా వస్తున్నట్టు ఇద్దరికీ అర్థమైంది. ఇద్దరూ ఒక స్తంభం చాటుగా ఉండి గమనించసాగారు. ఓ నలుగురు దొంగలు పెద్ద పెద్ద నగల మూటలతో ఆ ఆవరణలోకి వచ్చారు.
భీమరాజుని ఆ దొంగలమీదికి ఉసిగొల్పి వాళ్లని కాళ్లకి బుద్ధి చెప్పేలా చేస్తే ఆ నగలు తామిద్దరూ చెరిసగం పంచుకోవచ్చన్న ఉపాయం జాలయ్యకి తట్టింది. అదే విషయం భీమరాజుకి చెప్పగా భయంతో అతనికి నోట మాట పెగల్లేదు. కానీ జాలయ్య అతనికి ధైర్యాన్ని నూరిపోసి, కేవలం తన ఆకారాన్ని మాత్రమే వాళ్ల ముందు ప్రదర్శించమనీ, వెనుకనుండి తాను తన గొంతుతో మాట్లాడి మిగతా తంతు నడిపిస్తాననీ చెప్పి ఒప్పించాడు. తన గొంతుపై కాకపోయినా, భుజబలం మీద అమితమైన నమ్మకమున్న భీమరాజు అయిష్టంగానైనా జాలయ్య ఉపాయానికి తలొగ్గక తప్పలేదు.
జాలయ్య తన గొంతుతో ‘‘ఎవడ్రా అక్కడ! ప్రాణాల మీద తీపి ఉంటే వెంటనే పారిపోండి!’’ అంటూ భీకరంగా హుంకరిస్తుంటే, మహాకాయుడైన భీమరాజు నీడ ఆ దొంగలపై పడుతుండగా కాస్త దూరంగా నిల్చున్నాడు. నలుగురు దొంగలూ ఆ మహాకాయాన్ని చూసి అతనితో బాహాబాహీకి దిగితే సున్నంలోకి ఎముకలు కూడా మిగలవని తలచి ఆ నగల మూటలు అక్కడే పడేసి కాళ్లకి బుద్ధి చెప్పారు.
జాలయ్య ఉపాయం పారింది. ఆ నగల మూటలతో ఉదయానికి వాళ్లిద్దరూ రాజధానికి చేరుకున్నారు.
తన భుజబలంతో భీమరాజు పోటీలన్నిటిలోనూ నెగ్గి, బహుమతి పైకంతో పాటు రాజుగారి అభిమానాన్నీ పొందాడు.
తమవికాని నగలు రాజుగారికి అప్పగించేద్దామని భీమరాజు జాలయ్యని కోరాడు. ఉపాయం తనదే అయినా భీమరాజు వల్లే తమకి ఆ నగలు దక్కాయి కాబట్టి జాలయ్య కూడా భీమరాజు కోరికని అంగీకరించాడు. అలా దొంగలనుండి తమకి దొరికిన నగల మూటల్ని రాజుగారికి అందిస్తూ తాను అక్కడి వరకు చేరుకునేందుకు జాలయ్య ఎలా సహాయపడ్డాడో పూసగుచ్చినట్టు వివరించాడు భీమరాజు.
గత కొద్దిరోజులుగా రాజ్యంలో జరిగిన దొంగతనాల్లో పోయిన నగలు ఈవిధంగా తమకి తిరిగి అప్పగించిన భీమరాజునీ, జాలయ్యనీ మెచ్చుకుని, వాళ్లిద్దరికీ తగిన ఉద్యోగాలిచ్చి తన కొలువులోనే ఉంచుకున్నారు రాజుగారు.
అలా అప్పటినుండీ అందరూ ‘అసలైన వస్తాదు’గా భీమరాజునీ, ‘గొంతు వస్తాదు’గా జాలయ్యనీ పిలవసాగారు.
- మల్లారెడ్డి మురళీ మోహన్
హితవచనం..
అనాహూతః ప్రవిశతి అపృష్టో బహు భాషతే
అవిశ్వస్తే విశ్వసితి మూఢచేతా నరాధమః
- మూఢులైన నరాధములు ఆహ్వానం లేకుండానే లోపలకు ప్రవేశిస్తారు. ఏమీ అడగకపోయినా అనవసరంగా అతిగా మాట్లాడతారు. తమను నమ్మనివాళ్లను నమ్ముతారు.


