క్లూషియల్
ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు దేశ్‌పాండే ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఆర్ట్ గ్యాలరీ ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉన్నా, అక్కడ ఉత్కంఠ గాల్లో తేలుతోంది. మరుసటి రోజు ఉదయం భారత ప్రధాని ఆ గ్యాలరీని సందర్శించనున్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన, చరిత్రాత్మకమైన ఒక అరుదైన చిత్రపటాన్ని ప్రధానికి కానుకగా ఇవ్వడానికి దేశ్‌పాండే అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆ చిత్రపటం చుట్టూ లేజర్ కిరణాలు, బయోమెట్రిక్ లాకులు, నిరంతరం నిఘా ఉంచే సీసీటీవీ కెమెరాలతో కూడిన పటిష్ఠమైన సెక్యూరిటీ ఉంది.
కానీ, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో హఠాత్తుగా గ్యాలరీలో పవర్ కట్ అయ్యింది. కేవలం ముప్పై సెకన్లలోనే బ్యాకప్ సిస్టమ్ ఆన్ అయ్యింది. కానీ, ఆ ముప్పై సెకన్ల చీకట్లోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. లేజర్ వలయాన్ని ఛేదించి, ఆ కీలకమైన చిత్రపటం మాయమైంది! దేశ్‌పాండే గుండె ఆగినంత పనైంది. తెల్లవారితే ప్రధాని వస్తారు. ఈలోగా చిత్రపటం దొరకకపోతే, దేశవ్యాప్తంగా తన ప్రతిష్ఠ గంగలో కలిసిపోతుంది. ఆయన వెంటనే సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి అత్యవసర సహాయం కోరారు. కేసు తీవ్రతను బట్టి కమిషనర్, క్రైమ్ బ్రాంచ్ నెంబర్ వన్ ఇన్వెస్టిగేటివ్ ఇన్‌స్పెక్టర్ అభిమన్యును రంగంలోకి దించారు. తెల్లవారేలోగా, అంటే కేవలం ఐదు గంటల్లో ఈ మిస్టరీని ఛేదించాల్సిన బాధ్యత అభిమన్యుపై పడింది.
∙∙
గ్యాలరీకి చేరుకున్న అభిమన్యు చురుకైన కళ్లతో క్రైమ్ సీ¯Œ ను పరిశీలించాడు. అక్కడ ఎలాంటి బలాత్కారపు గుర్తులు లేవు. అంటే, లోపలి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఈ దొంగతనం అసాధ్యం. అభిమన్యు వెంటనే సెక్యూరిటీ చీఫ్ సాహూ, అసిస్టెంట్ మేనేజర్ రాహుల్, ఐటీ హెడ్ కిరణ్, ఎగ్జిబిషన్ డిజైనర్ శ్రుతిలను ఒకే గదిలో కూర్చోబెట్టాడు. ఇక్కడే అభిమన్యు అసలైన మైండ్ గేమ్ ప్రారంభమైంది.
‘‘సార్, పవర్ కట్ కాగానే మెయిన్ సర్వర్ హ్యాక్ అయ్యింది. డిజిటల్ లాక్ ఎలా ఓపెన్ అయ్యిందో మాకే అర్థం కావడం లేదు. బహుశా అంతర్జాతీయ దొంగల ముఠా పని అయి ఉంటుంది.’’ అని సాహూ చాలా కంగారుగా, ఆవేదనగా వివరించాడు.
సమయం తెల్లవారుజామున మూడు గంటలు అవుతోంది. అతను అందరి ముఖాల్లోని హావభావాలను గమనిస్తూ, ‘‘దొంగ ఎవరో నాకు తెలిసిపోయింది. చిత్రపటం గ్యాలరీ దాటి బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే పవర్ పోయిన వెంటనే గ్యాలరీ చుట్టూ ఉన్న ఆటోమేటిక్ గేట్లు లాక్ అయిపోయాయి. దొంగ ఆ పెయింటింగ్‌ను ఇక్కడే ఎక్కడో దాచాడు. నేను గ్యాలరీ మొత్తం సెర్చ్ చేయిస్తున్నాను.
అప్పుడే ఒక ఇన్‌స్పెక్టర్ వచ్చి, అభిమన్యు వైపు చూసి, ‘‘సర్... ఆ చిత్రపటం ఎక్కడ ఉందో ట్రేస్ చేశాం...’’ అంటూ చెవిలో ఏదో చెప్పాడు.
అది అభిమన్యు మైండ్ గేమ్‌లో ఒక భాగం అని వాళ్లకు తెలియదు.
అభిమన్యు కావాలనే ఆ గదిలో ఒక నకిలీ వైర్‌లెస్ స్పీకర్‌ను వదిలి, బయటకు వచ్చి సీసీటీవీ కంట్రోల్ రూమ్ నుంచి వారిని గమనించసాగాడు. ఇది అతను ఆడిన మైండ్ గేమ్. దొంగతనం చేసిన వ్యక్తి కచ్చితంగా భయపడి, పెయింటింగ్ దాచిన చోటు మార్చడానికి ప్రయత్నిస్తాడని అభిమన్యు వ్యూహం. గదిలో ఉన్న నలుగురిలో టెన్షన్ పెరిగింది. సమయం నాలుగు దాటింది. హఠాత్తుగా సెక్యూరిటీ చీఫ్ సాహూ వాష్‌రూమ్‌కి వెళ్తానని చెప్పి బయటకు వచ్చాడు. అతను నేరుగా గ్యాలరీ బేస్‌మెంట్‌లోని ఏసీ డక్ట్ పైపుల వైపు వెళ్లాడు. సాహూ నేరుగా గ్యాలరీ బేస్‌మెంట్‌లోని ఏసీ డక్ట్ పైపుల వైపు వెళ్లి, అక్కడ దాచిన రోల్ చేసిన చిత్రపటాన్ని తీస్తుండగా, ఒక్కసారిగా లైట్లు ఆన్ అయ్యాయి. ఎదురుగా ఇన్‌స్పెక్టర్ అభిమన్యు నిలబడి ఉన్నాడు! సాహూ షాక్ తిన్నాడు.
‘‘కంచె చేను మేసినట్టుంది మిస్టర్ సాహూ! నమ్మకద్రోహానికి నువ్వే బెస్ట్ ఉదాహరణ’’ అన్నాడు అభిమన్యు.
‘‘ఇది నమ్మకద్రోహం కాదు, ప్రతీకారం...’’ సాహూ ముఖంలో పశ్చాత్తాపం లేదు, కేవలం కసి మాత్రమే ఉంది. ‘‘నమ్మాడా? అందరిముందు నన్ను అవమానించాడు. ఒక చిన్న పొరపాటుకు నా ముప్పై ఏళ్ల సర్వీసును మరిచిపోయి నన్ను చెంపదెబ్బ కొట్టాడు. అందుకే అతని ప్రతిష్ఠను ప్రధాని ముందు దెబ్బతీయాలని అనుకున్నాను.’’ అన్నాడు సాహూ.
‘‘వ్యక్తిగతమైన ప్రతీకారాన్ని అతని ప్రతిష్ఠ దెబ్బ తీయడానికి వాడావు. ముఖ్యంగా నీ వృత్తికి అన్యాయం చేశావ్..‘నువ్వు ఐటీ రూమ్ పాస్‌వర్డ్ వాడి పవర్ కట్ చేశావు కానీ, ఏసీ డక్ట్ లోపల ఉన్న డస్ట్ సెన్సర్స్ నీ షూస్ గుర్తులను రికార్డ్ చేస్తాయని మర్చిపోయావు...’’ నేరం చేసినవాడు ఎప్పటికైనా సాక్ష్యానికి దొరుకుతాడు. నీ వృత్తికి కళంకం తెచ్చావు. నీలాంటివాళ్ళకి ఇదొక గుణపాఠం కావాలి’’ చెప్పాడు అభిమన్యు.
సెక్యూరిటీ చీఫ్æ సాహూ పోలీసుల మధ్య సంకెళ్లతో...
∙∙
‘‘ఇచ్చిన మాట ప్రకారం తెల్లవారేలోగా కేసును సాల్వ్ చేశారు. చిన్న రిక్వెస్ట్. ప్రధానికి చిత్రపటం బçహూకరిస్తున్నప్పుడు మీరు నా పక్కన ఉండాలి.’’ అభిమన్యుతో అన్నాడు దేశ్‌పాండే కృతజ్ఞతా పూర్వకంగా.
- శ్రీసుధామయి


