Louise Gluck: ఆమె కవిత్వంలో అంతటి ప్రత్యేకత ఏమిటి?! | Louise Gluck Nobel Prize Winning American Poet Life And Poetry | Sakshi
Sakshi News home page

Louise Gluck: ఆమె కవిత్వంలో అంతటి ప్రత్యేకత ఏమిటి?!

Aug 23 2026 12:19 PM | Updated on Aug 23 2026 12:19 PM

Louise Gluck Nobel Prize Winning American Poet Life And Poetry

లిట్‌వరల్డ్‌

‘ఆకసాన నాకంటూ ఓ దేవుడున్నాడు అతగాణ్ణి సూర్యుడంటార్లే! అతనికి నా మనసు విప్పి చెప్పుకున్నానోసారి, మనసులో రగిలే మంటను అతని ముందుంచా, అది నా దేవుడి సన్నిధిలా భగ్గుమంది! అయినా, మనసుకు మించిన వైభోగం మరేముందని?’ అడిగిన బేల ఆ ‘గసగసాల పువ్వు‘ (రెడ్‌ పాపీ). మన–సుకవి మనకున్నట్లే, అమెరికన్ల సుకవయిత్రి వాళ్ళకూ ఉన్నారు. ఆమె పేరు లూయీజ్‌ గ్లూక్‌ (1943–2023).

బేలలూ, బాలలూ అలాగే వుండిపోతారా? కాలంతో పాటు కరకుతేరరూ? మన వాడుక భాషలో చెప్పుకుంటే గ్లూక్‌ భావకవయిత్రిగా మొదలై, క్రమంగా స్త్రీవాద కవయిత్రిగా ఎదిగారు. భావకవిత్వమంటే ఏమిటో మనకు– తెలుగువాళ్ళకు– తెలియనిదేం కాదు. 1910 మొదలుకొని ’40 దశకాంతం వరకూ తెలుగునాట కలంపట్టిన కవిగణమంతా అరగదీసి విరగదీసిన ధోరణే అది! దేవులపల్లి మొదలుకొని దేవరకొండ వరకూ ఎందరో భావుకులైన భావకవుల్లో ఇలాంటి లక్షణాలు ప్రతి అక్షరంలోనూ గోచరిస్తాయి. కృష్ణశాస్త్రి ‘ఏల ప్రేమింతు?’ లాంటి చిరుకవితల్లో మనసుకవిత్వమే నాలుగుపాదాలతో నాట్యం చేసింది.

అయితే ఆత్రేయ ఈ పలుకుబడిని సినిమాలకెక్కించి ‘మనసుకవి’ అనిపించుకున్నారు. అమెరికన్‌ కవుల్లో లూయీజ్‌ గ్లూక్‌ అదే ఘనకార్యం చేశారు. మనకి ఆత్రేయ తొలి మనసుకవి కానట్లే అమెరికన్‌ కవితలో కూడా ఈ పోకడ లూయీజ్‌ గ్లూక్‌ తోనే మొదలుకాలేదు. అయితే, కాలానుగుణమైన మార్పు కవుల స్వరంలో కన్నా శ్రుతిలో– ‘టోన్‌’లో– ఎక్కువ ప్రతిధ్వనిస్తుంది. ఇది గ్లూక్‌ ‘టోన్‌’కు సైతం వర్తిస్తుంది. ఆమెది ఇరవయ్యో శతాబ్ది ఉత్తరార్ధంలో పదునెక్కిన ఆత్మాశ్రయ శ్రుతి. ఆమె కవితలో భావకవితా ధోరణి మాత్రమే కాదు– స్త్రీవాద వైఖరి కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చదువుకున్నవారికి తెలుసు!

గ్లూక్‌ గురించి మాట్లాడే వాళ్ళెవరూ ఆమె స్వరం గురించీ, శ్రుతి గురించీ ప్రస్తావించకుండా ఉండలేరు. అందుకే 2020లో ఆమె నోబెల్‌ సాహిత్యపురస్కారం గెల్చుకున్నట్లు ప్రకటిస్తూ స్వీడిష్‌ ఎకాడెమీ ప్రతినిధులు చెప్పిన మాటల్లోనూ వాటి ప్రస్తావన ప్రముఖంగానే వుంది. ‘అసందిగ్ధమైన ఆమె కవితాత్మక స్వరమూ, దాని సరళ శ్రుతీ వ్యక్తిగత సౌందర్యాన్ని విశ్వజనీనంగా మారుస్తాయ’ని ప్రశంసించారు. నోబెల్‌ సాహిత్యపురస్కారం సాధించడానికి ముందే ఆమె పులిట్జర్‌ పురస్కారం (1993), బాలింజెన్‌ పురస్కారం (2001), జాతీయ పుస్తక పురస్కారం (2014), జాతీయ సామాజికశాస్త్ర పురస్కారం (2015) గెల్చుకునివున్నారు. 2003–04 సంవత్సరాల మధ్యకాలంలో లూయీజ్‌ గ్లూక్‌ అమెరికా ఆస్థాన కవయిత్రిగా కూడా వున్నారు.

తూర్పు యూరప్‌ దేశాల నుంచి– ఇరవయ్యో శతాబ్దంతో పాటే– అమెరికాకు వలస వచ్చింది గ్లూక్‌ కుటుంబం. ఆమెను తీర్చిదిద్దిన అంశాల్లో కుటుంబ నేపథ్యం ప్రముఖమైంది. న్యూయార్క్‌ సమీపంలోని లాంగ్‌ ఐలండ్‌ సంపన్న కుటుంబాలకు నెలవు. పుట్టింది అక్కడ కాకపోయినా, గ్లూక్‌ పెరిగింది మాత్రం అక్కడే! బాల్యం నుంచీ గ్రీకు పురాగాథలు వింటూ పెరిగిన గ్లూక్‌ కవిపండితురాలిగా ఎదగడంలో వింతేముంది? ఆత్మాశ్రయ మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలామందిలో కనిపించే ఎనరెక్సియా నెర్వోజా అనే మానసిక రుగ్మత గ్లూక్‌ కు కౌమారదశలో సంక్రమించింది. ‘బరువు పెరిగిపోతామేమో!’ అనే భయంతో ఈ రోగులు బొత్తిగా తిండితినరు. అది వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

అయితే, ఆమె త్వరలోనే ఈ రుగ్మతను అదుపు చేసుకోగలగడం విశేషం. ఇరవైమూడేళ్ళ ప్రాయంలో గ్లూక్‌ తొలి కవిత ‘మదాంవజెల్‌’ అనే అమెరికన్‌ ఫ్యాషన్‌ పత్రికలో ప్రచురించారు. త్వరలోనే ఆమె కవితలు అమెరికాలోని ప్రముఖ పత్రికలన్నింట్లోనూ అచ్చవుతూ పోయాయి. రెండేళ్ళలోనే ఆమె తొలి కవితా సంకలనం కూడా వెలువడింది. అప్పట్లో, ఆమె కవిత్వంపై అమెరికన్‌ కవయిత్రి సిల్వియా ప్లాథ్‌ ప్రభావం గాఢంగా వుందనే విమర్శ వినిపించింది. నడివయసుకు చేరువయ్యే కొద్దీ, క్రమంగా గ్లూక్‌ స్వరమూ– శ్రుతీ స్థిమితత్వాన్నీ, స్వతంత్ర మూర్తిమత్వాన్నీ సంతరించుకున్నాయి. అవే మనకు తెలిసిన మనసు కవయిత్రిని ప్రపంచం ముందు ఆవిష్కరించాయి.

‘మహాప్రస్థానం’ సంకలనానికి ‘యోగ్యతాపత్రం’ దయశాయిస్తూ చెలం గొప్ప విషయాలు ఎన్నో అలవోకగా చెప్పారు. కవి తాను చెప్పదల్చుకున్నదేదో ‘సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధినివ్వరాదా అని చెలం కోర్కె. ఆ పని స్త్రీలూ చెయ్యరు; దేశనాయకులూ చెయ్యరు; కవులూ చెయ్యర’న్నారాయన. కానీ ఆయన ‘కోర్కె’ తీర్చిన కొద్దిమంది స్త్రీలూ, కవుల్లో లూయీజ్‌ గ్లూక్‌ ఒకరు. ఇక్కడే ఓ చిత్రమైన విషయం చెప్పుకోవాలి– ప్రగాఢమైన ప్రేమ తత్త్వం గురించీ, దిగజారిన వివాహ వ్యవస్థ గురించీ 1996లో గ్లూక్‌ ఓ కవితా సంకలనం వెలువరించారు. దాని పేరు ‘మెడోల్యాండ్స్‌’– అంటే (పచ్చిక) మైదానాలు! చెలం కన్నుమూసిన 17 యేళ్ళకు, ఓ అమెరికన్‌ కవయిత్రి వెలువరించిన పుస్తకమిది!

1985లో వచ్చిన గ్లూక్‌ కవితాసంకలనం ‘ఎఖిలిస్‌ ఘనవిజయం’లో ‘మాక్‌ ఆరెంజ్‌’ అనే కవిత వుంది. (మాక్‌ ఆరెంజ్‌ అంటే ‘అడవి కరివేపాకు’, ‘కుంతి పువ్వు’, ‘నాగ గొలంగ’ లాంటి అర్థాలు కనిపిస్తున్నాయి నిఘంటువుల్లో. విషయమేమిటంటే, ఇది నారింజ మాత్రం కాదు– సువాసన కోసం పెంచే పూలమొక్క!) స్త్రీ శరీరాన్ని భోగవస్తువుగా పరిగణించడాన్ని గ్లూక్‌ ఈ కవితలో తీవ్రంగా నిరసించారు. దాన్ని ‘ఆధునిక స్త్రీవాద అధికార గీతం’గా పరిగణిస్తారట. ఇలాంటి కవితలే ఈ కవయిత్రికి అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలు సంపాదించిపెట్టాయి. 2023లో కన్నుమూసే వరకూ కలం దించని కవయిత్రి, వ్యాసకర్త, బోధకురాలిగా లూయీజ్‌ గ్లూక్‌ నిలిచిపోయారు.
- మందలపర్తి కిషోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement