భక‍్త విజయం
పూర్వం సౌరాష్ట్ర రాజ్యాన్ని సోమకాంతుడు సర్వసుభిక్షంగా పరిపాలించేవాడు. అతడి భార్య సుధర్మ. ఆ దంపతులకు హేమకంఠుడు అనే పుత్రుడు కలిగాడు. హేమకంఠుడు దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి, సకల విద్యలూ అభ్యసించి, యువరాజు అయ్యాడు.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! సర్వసౌఖ్యాలూ అనుభవిస్తూ, సమస్త వైభోగాలతో తులతూగుతూ ఉన్న సోమకాంతుడు జన్మాంతర పాపఫలితంగా కుష్టువ్యాధి బారిన పడ్డాడు. శరీరమంతా వ్రణాలు ఏర్పడి, నిరంతరం చీము కారుతూ, దుర్గంధభూయిష్టంగా మారింది. వ్యాధి నివారణ కోసం సోమకాంతుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవీ ఫలించలేదు. చివరకు సోమకాంతుడు వానప్రస్థానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. సమస్త పరివారాన్నీ పిలిచి, తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అతడి నిర్ణయానికి అంతఃపుర కాంతలు, అమాత్యులు, భృత్యులు పెద్దపెట్టున రోదించారు. తాము కూడా వానప్రస్థానికి వస్తామని అన్నారు.
సోమకాంతుడు వారికి నచ్చజెబుతూ, ‘నా కుమారుడు హేమకంఠుడికి రాజ్యాన్ని అప్పగిస్తున్నాను. అతడికి పట్టాభిషేకం చేయండి. మీరంతా నన్ను సేవించుకున్నట్లే, అతడిని సేవించండి’ అని పలికాడు.
మహారాణి సుధర్మ ‘భర్తను అనుసరించడమే పతివ్రతా ధర్మం’ అని చెప్పి, సోమకాంతుడితో పాటు తాను కూడా వానప్రస్థానికి సిద్ధపడింది. కొద్దిమంది పరివారం వెంటరాగా రాజ దంపతులు వానప్రస్థానికి బయలుదేరారు. సోమకాంతుడు, సుధర్మ తమ పరివారం వెంటరాగా అడవుల్లో అక్కడక్కడా మజిలీలతో కొన్నాళ్ల ప్రయాణం తర్వాత వారంతా ఒక దుర్గమారణ్యానికి చేరుకున్నారు. అక్కడ ఒక సరోవరం కనిపించింది. రాజ పరివారం ఆ సరోవరంలో స్నానాలు చేసి, అందులోని నీళ్లు తాగి, అక్కడి చెట్ల నుంచి కోసుకున్న పండ్లు ఆరగించి, వాటి నీడలో సేదదీరసాగారు. సోమకాంతుడి కోరికపై అతడి పరివారం అడవిలోని కందమూలాలు, తామరతూళ్లు సేకరించుకుని రావడానికి వెళ్లారు.
కొద్దిసేపటికి దివ్యతేజస్సు ఉట్టిపడుతున్న ఒక బాలకుడు కలశం చేతపట్టుకుని సరోవరం వద్దకు వచ్చాడు. సుధర్మ అతడిని చూసి ముచ్చట పడింది. అతడి వద్దకు వెళ్లి, ‘అబ్బాయి! నువ్వు ఎవరివి? నీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని ప్రశ్నించింది.
‘అమ్మా! నా పేరు చ్యవనుడు. నా తండ్రి భృగుమహర్షి, తల్లి పులోమ. ఆశ్రమానికి నీళ్లు తీసుకువెళ్లడానికి ఇక్కడకు వచ్చాను. ఇంతకీ మీరెవరు? మీ సేవలు పొందుతున్న ఆ పురుషుడు ఎవరు? ఆయన శరీరమంతా వ్రణాలతో నిండి ఉందేమి?’ అని అడిగాడు.
సుధర్మ దుఃఖాశ్రువులతో తమ వృత్తాంతమంతా అతడికి చెప్పింది. చ్యవనుడు సరోవరంలోని నీళ్లు తీసుకుని, ఆశ్రమానికి వెళ్లిపోయాడు. నీటికుండతో ఆశ్రమానికి చేరుకున్న కొడుకు ముఖం దిగులుగా ఉండటం గమనించాడు భృగుమహర్షి.
‘కుమారా! ఎందుకలా దిగులుగా ఉన్నావు? కారణమేమిటి?’ అని అడిగాడు.
అప్పుడు చ్యవనుడు తండ్రికి రాజదంపతులైన సోమకాంతుడు, సుధర్మల వృత్తాంతం చెప్పాడు.
‘రాజదంపతులను, వారి పరివారాన్ని మన ఆశ్రమానికి పిలుచుకునిరా! నేను ఆహ్వానిస్తున్నానని చెప్పు’ అని కొడుకును తిరిగి అడవికి పంపాడు. చ్యవనుడు వచ్చి పిలవడంతో సోమకాంతుడు, సుధర్మ దంపతులు పరివారంతో పాటు భృగు ఆశ్రమానికి చేరుకున్నారు. భృగు మహర్షికి వారంతా నమస్కరించారు. భృగు మహర్షి వారికి షడ్రసోపేతమైన విందుతో ఆతిథ్యమిచ్చి, వారి విశ్రాంతికి తగిన ఏర్పాట్లు చేయించాడు. సోమకాంతుడు భృగుమహర్షి వద్ద తన బాధ చెప్పుకున్నాడు. భృగుమహర్షి దివ్యదృష్టితో చూసి, ‘రాజా! ఇదంతా పూర్వజన్మ పాపం వల్ల సంప్రాప్తించిన బాధ’ అని చెప్పి, అతడి పూర్వజన్మ వృత్తాంతమంతా తెలిపాడు. సోమకాంతుడు అంతా విని కూడా, మనసులో ఒక క్షణం భృగుమహర్షిని సందేహించాడు. వెంటనే అతడి శరీరం నుంచి పక్షులు పుట్టుకొచ్చి, వాడి ముక్కులతో అతడి దేహంపై వ్రణాలను పొడవసాగాయి. ‘మహర్షీ! మీరే నన్ను కాపాడాలి’ అంటూ ఆర్తనాదాలు చేశాడు.
‘రాజా! నువ్వు నన్ను సంశయించావు. అందుకు ఫలితమే ఇది’ అంటూ భృగువు ఒక్క హుంకారం చేయడంతో ఆ పక్షులన్నీ మాయమయ్యాయి.
‘నీ వ్యాధినివారణకు తరుణోపాయం చెబుతాను విను. నువ్వు గణేశపురాణ శ్రవణం చేసినట్లయితే, పాప విమోచన జరిగి, వ్యాధి నుంచి బయటపడగలవు’ అని చెప్పాడు. గణేశ స్తోత్రాన్ని పఠించి, మంత్రజలాన్ని సోమకాంతుడిపై ప్రోక్షించాడు. వెంటనే సోమకాంతుడి ముక్కు నుంచి ఒక క్రిమిలాంటి నల్లని పురుషుడు బయటపడ్డాడు. చూస్తుండగానే అతడు పర్వతమంత పెరిగాడు. తనను తాను ‘పాప పురుషుడు’ అని చెప్పుకున్న ఆ భీకరాకారుడిని భృగుమహర్షి తన తపోబలంతో భస్మీపటలం చేశాడు. సోమకాంతుడి ప్రార్థన మేరకు భృగుమహర్షి అతడికి గణేశపురాణం చెప్పి, కొద్దిరోజుల్లోనే అతడికి రోగవిముక్తి కలిగించాడు.
- సాంఖ్యాయన
పురావిశేషం..
శ్రావణ పూర్ణిమను దేశవ్యాప్తంగా చాలా చోట్ల రాఖీ పండుగ జరుపుకొంటారు. ఇదేరోజు బలరామ జయంతి కూడా. దేశంలో కొద్దిసంఖ్యలో మాత్రమే ఉన్న బలరామ ఆలయాల్లోను, శ్రీకృష్ణ దేవాలయాల్లోను శ్రావణ పూర్ణిమ రోజున బలరామ జయంతి వేడుకలు కూడా ఘనంగా జరుపుతారు. ఒడిశాలోని ఢంకనాల్, కేంద్రపడా జిల్లాల్లోను, పశ్చిమబెంగాల్లో ని ఖొయిరాసోల్, కోల్కతాలలోను, కేరళలోని నెన్మినిలోను, ఉత్తరప్రదేశ్లోని గోవర్ధన్లోను, గుజరాత్లోని చిత్రసానిలోను బలరాముడికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి.


