శ్రీలంకలో ఘనంగా పెరహెర వేడుకలు.. ఎందుకు జరుపుతారంటే? | Funday Special Story On Kandy Esala Perahera Sri Lanka Grand Festival | Sakshi
Sakshi News home page

శ్రీలంకలో ఘనంగా పెరహెర వేడుకలు.. ఎందుకు జరుపుతారంటే?

Aug 23 2026 2:09 PM | Updated on Aug 23 2026 2:09 PM

Funday Special Story On Kandy Esala Perahera Sri Lanka Grand Festival

అగడం బగడం..

సంస్కృతి, ఆధ్యాత్మికతతో ముడిపడినటువంటి ‘కాండీ ఎసల పెరహెర వేడుకలు’ శ్రీలంకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 18 నుంచి 28 వరకు సాగే ఈ వేడుకలను మొత్తం 10 రాత్రులు, 11 రోజులు పాటు అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఊరేగింపులు, కళాకారుల ప్రదర్శనలు, అలంకరణలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో తుది ఘట్టమైన ‘రాందోళి పెరహెర’ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

కాండీ ఎసల పెరహెర ఉత్సవాల తేదీలు ప్రతి సంవత్సరం మారుతున్నప్పటికీ, ఈ పండుగ నిర్వహణ ఎప్పుడూ ఒకేలా సాగుతుంది. ఈ సంబరాలు ప్రధానంగా మూడు ఘట్టాలుగా కొనసాగుతాయి.

ఉత్సవాల్లో ప్రారంభ క్రతువు కప్‌ సిటువీమ. ఈ వేడుకలు శ్రీ దళదా మాలిగావా (బుద్ధుని పవిత్ర దంత అవశేషం ఉన్న దేవాలయం) ప్రాంగణంలో ప్రారంభమవుతాయి. ఉత్సవ ప్రారంభానికి సూచికగా ఆలయ ప్రాంగణంలో ఒక పవిత్ర వృక్షాన్ని నాటుతారు. ఇది ప్రధానంగా మతపరమైన ఆచారం అయినప్పటికీ, పెరహెర సీజన్‌ కు ఇది అధికారిక ప్రారంభ ఘట్టంగా నిలుస్తుంది.

ఉత్సవాల్లో రెండో ఘట్టం కుంభాల్‌ పెరహెర. పండుగ మొదటి ఐదు రాత్రులను ‘కుంభాల్‌ పెరహెర’ అని పిలుస్తారు. ఈ ప్రారంభ ఊరేగింపులు పరిమాణంలో కాస్త చిన్నవిగా, సంప్రదాయబద్ధంగా సాగుతాయి. ఎక్కువ రద్దీ లేకుండా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా ఆస్వాదించడానికి ఇవి చక్కటి అవకాశం. ఈ రాత్రులలో సంప్రదాయ కాండియన్‌ నృత్యకారులు, కొరడా ఝళిపించే ప్రదర్శకులు, మేళతాళాల వాయిద్యకారులు, అలంకరించిన ఏనుగులు, దివిటీలు పట్టిన సేవకులు పాల్గొంటారు.

మూడో ఘట్టం రాందోళి పెరహెర. అంటే మహా ఊరేగింపులు. ఆఖరి ఐదు రాత్రులను ‘రాందోళి పెరహెర’ అని పిలుస్తారు. పండుగ మొత్తంలోనే అత్యంత అద్భుతంగా, వైభవంగా సాగే రాత్రులు ఇవే! ఈ ఊరేగింపులు జరిగేటప్పుడు కాండీ నగర వీథులు వేలాదిమంది భక్తులతో, పర్యాటకులతో నిండిపోతాయి. వందలాది మంది నృత్యకారులు, కళాకారులు, వాద్యకారుల బృందాలు, రాత్రి ఆకాశాన్ని కాంతులతో నింపే అగ్ని విన్యాసకులు, విద్యుత్‌ దీపాలతో ప్రకాశించే వస్త్రాలు ధరించిన గజరాజులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి కాండీ పెరహెరకే అత్యంత ముఖ్యమైన ఘట్టాలు కావడంతో అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ఈ ఉత్సవాల్లో చివరి ఊరేగింపు రాత్రి వేకువ జామున జరిగే వేడుక దహవల్‌ పెరహెర. ఇందులో భాగంగా మహావలి నది ఒడ్డున జరిగే ‘దియా–కెపీమ’ అంటే ‘జలఖండన’ కార్యక్రమంతో ఎసల పెరహెర ముగుస్తుంది. ఇందులో భాగంగా నదీ జలాలను లాంఛనప్రాయంగా ఖండించినట్లు నీళ్లల్లో కత్తులను తాటిస్తారు. ఈ క్రతువును వీక్షించేందుకు సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు.

శ్రీలంకలో జరిగే ప్రసిద్ధ ‘కాండీ ఎసల పెరహెర’ ఉత్సవం కేవలం ఒక సాంస్కృతిక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. గౌతమ బుద్ధుని పవిత్ర దంత అవశేషానికి అత్యంత భక్తిశ్రద్ధలతో గౌరవం అర్పిస్తూ, దేశానికి సమృద్ధిగా, సమయానుకూల వర్షాలు, ప్రజలకు శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ చారిత్రాత్మక వేడుక శ్రీలంక బౌద్ధ సంస్కృతి విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతోంది.
- రమా జంబుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement