కాలేజ్ రోజుల్లో సరదాగా చేసిన వ్యాపారమే తనకు జీవనోపాధిగా మారుతుందని అస్సలు ఊహించలేదామె. ఓ హాబీలా చేసిందే..వ్యాపారంగా మారి కోట్లు కొల్లగొట్టే రేంజ్‌కి తీసుకువెళ్లింది. ఇదంతా రాత్రికి రాత్రికి సాధించిన విజయం కాదు. వ్యాపారం మొదలు పెట్టగానే ఆమెకు వచ్చిన అవరోధాలు అన్నీ ఇన్నీ కావు. నిలదొక్కుకుంది అనేలోపు ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉండేది. ఎంతలా అంటే వద్దురా వ్యాపారం అని దుకాణం సర్దుసుకుని పోదాం అనేలా వచ్చిపడ్డాయి. అయినాసరే ఉక్కుసంకల్పంతో ముందుకు సాగి విజయం సాధించింది ఈ వనిత.
ఆ అమ్మాయే బెంగళూరుకి చెందిన మేఘనా జైన్. ఆమెకు బేకింగ్‌కి సంబంధించిన వంటకాలు చేయడం ఓ హాబీ. ఆమె ఒకప్పుడు యూనివర్సిటీలో సరదాగా కప్‌కేక్‌లు, ఇతర వస్తువులు తయారు చేసి అమ్ముతుండేది. అప్పుడామెకు 18 ఏళ్లు. తన విరామ సమయాల్లో ఇలా డెజర్ట్‌లను కాలేజ్‌కి తీసుకువచ్చి అమ్ముతుండేది. వాటిని ఫ్రాస్టింగ్‌తో అలంకరించి తినాలనిపించేలా అందంగా సర్వ్ చేసేది.
ఇలా కప్‌కేక్‌లు కాలేజ్‌కి తీసుకువచ్చి అమ్మడాన్ని ఒక ప్రొఫెసర్ వ్యతిరేకించినప్పటికీ..తన క్లాస్‌మేట్స్ వ్యాపారానికి ఎంతగానో మద్దతిచ్చినట్లు తెలిపింది. అయితే మేఘనాకి ఇతర ప్రొఫసర్‌లు దీన్నే సొంతం వ్యాపారంగా ప్రారంభించమని ప్రోత్సహించారు. దాంతో కాలేజ్ చదువు అనంతరం ఇన్నర్‌చెఫ్ కేక్‌వాలాలో పనిచేసి కొంత అనుభవం గడించింది. ఆ తర్వాత బేకింగ్‌పై ఉన్న అభిరుచితో 2018లో డ్రీమ్ ఎ డజన్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది.
ఆదిలోనే చాలా అడ్డంకులు..
మొదట వ్యాపారం పెడుతున్న బిల్డింగ్ యజమాని నానా ఇబ్బందులకు గురిచేశాడు. దాంతో తక్షణమే మరో ప్రదేశానికి మారింది. ఆ తర్వాతే మహమ్మారి వచ్చింది. దాంతో డ్రీమ్ ఎ డజన్ షాప్‌ని ఆరు వారాల పాటు మూసివేయక తప్పలేదు. ఆ తర్వాత ఆన్‌లైన్ విధానానికి మారింది. ఇక లాభం లేదనుకుని దీపావళికి ముందు భారతదేశం అంతటా తమ వినియోగదారులకు, సిబ్బందికి బహుమతిగా స్వీట్ బాక్స్‌లు పంపించే కార్పొరేట్‌లను సంప్రదించింది.
అలా ప్యాకేజింగ్ డెలివరీ ప్రక్రియలను త్వరగా అర్థం చేసుకుని సుమారు 1500 గిఫ్ట్ బాక్సులను డెలివరీ చేసి నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం చేసింది. గతంలో వచ్చిన నష్టాలకు రెట్టింపు లాభాలు వచ్చేలా తర్వాత ఏడాది ఎక్కువ అమ్మకాలు దక్కించుకుంది మేఘన. దాంతో మేఘన వెంచర్ త్వరలోనే యాహు! యాక్సెంచర్‌లను క్లయింట్లుగా చేర్చుకుంది.
ఆ తర్వాత 20021లో మేఘన ఐఐఎం బెంగళూరులో గోల్డ్‌మన్ సాక్స్ స్పాన్సర్ చేసిన 'పదివేల ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్' ప్రోగ్రామ్‌ను పూర్తి చేసింది. అలా తన వెంచర్‌ని మంచి లాభాల బాట పట్టేలా అన్ని విధాలుగా కృషి చేసింది. దాంతో ఇవాళ అది ఏడాదికి రూ. 1.2 కోట్ల ఆదాయన్ని ఆర్జించే రేంజ్‌కి చేరుకుంది. జస్ట్ రూ. 5 వేలుతో మొదలు పెట్టి కోట్లు ఆదాయన్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది మేఘన. అంతేగాదు ఆమె బ్రాండ్ కుకీలు, గౌర్మెట్ టీలు, క్రాకర్లు, వివిధ గిఫ్ట్ హ్యాంపర్లను విక్రయిస్తుంది. ఆమె కథ వ్యాపారం మొదలు పెట్టడమే కాదు..ఆర్డర్లు ఎలా సంపాదించుకుని బిజినెస్‌ని నిలుపుకోవాలో వివిరించే గొప్ప బిజినెస్ పాఠం కదూ..!.
ఇదీ చదవండి: శాకాహరం అందించే కేఎఫ్‌సీ గురించి తెలుసా..!


