భూమి లేకపోయినా వ్యవసాయంలో పనిచేసే మహిళలను రైతులుగా గుర్తించడం అవసరం
ఈ దిశగా తొలి చట్టం తెచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి మహిళలే వెన్నెముక. విత్తనం నాటడం మొదలుకొని పంట కోత, నిల్వ వరకు దాదాపు అన్ని పనుల్లోనూ స్త్రీల శ్రమే అధికం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్ ఎస్) తాజా గణాంకాల ప్రకారం.. దేశ వ్యవసాయ రంగంలో పనిచేసే వారిలో మహిళల వాటా దాదాపు 60 శాతానికి చేరింది. పురుషులు ఉపాధి కోసం ఇతర రంగాల వైపు లేదా పట్టణాల వైపు వలస వెళ్తుండడంతో వ్యవసాయ రంగం క్రమంగా మహిళామయం అవుతోంది. దీన్నే ‘ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్’అంటారు. బాధ్యతలు పెరుగుతున్నప్పటికీ, భూమిపై యాజమాన్య హక్కులు, నిర్ణయాధికారాల్లో మాత్రం మహిళలకు నేటికీ తీవ్ర అన్యాయమే జరుగుతోంది.
భూమి పట్టాలున్న మహిళలు 15%
దేశంలో వ్యవసాయం కోసం పనిచేస్తున్న మహిళల్లో 15 శాతం కంటే తక్కువ మంది పేరిట మాత్రమే భూమి యాజమాన్య పత్రాలు (పట్టాదార్ పాస్ పుస్తకాలు) ఉన్నాయని కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు. మిగిలిన 85 శాతానికి పైగా మహిళలు తమ కుటుంబ పొలం పనుల్లోనో లేక కౌలుదారులుగానో శ్రమిస్తూ కేవలం వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోతున్నారు. మన దేశంలో వ్యవసాయ పథకాలు, సబ్సిడీలు, ప్రయోజనాలు పొందాలంటే భూమి పట్టా వారి పేరుతో ఉండడం తప్పనిసరి అనే నిబంధన అమల్లో ఉంది. భూమి పాస్‌బుక్ తన పేరుతో లేని మహిళా రైతులకు బ్యాంకు రుణాలు, పంట బీమా, పీఎం–కిసాన్ వంటి నగదు బదిలీలు, రాయితీ ఎరువులు, సాగునీటి సౌకర్యాలు, ఆధునిక యంత్రాలు ఏవీ అందడం లేదు.
మహిళలకు రైతుగా గుర్తింపు లేకపోవటం కేవలం వారి ఆర్థిక భద్రతను మాత్రమే కాకుండా సామాజిక స్థాయిని కూడా దెబ్బతీస్తోంది. వ్యవసాయంలో సమగ్ర సంస్కరణలు రావాలంటే క్షేత్రస్థాయిలో చెమటోడ్చే ప్రతి మహిళను రైతుగా గుర్తించడం, వారికి సంస్థాగత సహాయం అందించడం తక్షణావసరం. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు జరుపుకుంటున్న ఈ ‘అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం’లోనైనా మహిళా రైతులకు హక్కులు ఇవ్వడం సమంజసమని పాలకులు గుర్తించాలి.
మహారాష్ట్రలో మహిళా రైతులకు సర్టిఫికెట్లు!
మహిళా రైతుల చిరకాల స్వప్నాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ‘ఉమెన్ ఫార్మర్స్ ఎంపవర్‌మెంట్ యాక్ట్ 2026’ను ఇటీవలే తీసుకొచ్చింది. దీని ద్వారా సొంత భూమి లేకపోయినా వ్యవసాయం, పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాలపై ఆధారపడిన మహిళలను అధికారికంగా రైతులుగా గుర్తిస్తూ ‘మహిళా రైతు సర్టిఫికెట్ల’ను జారీ చేయటం చరిత్రాత్మక ముందడుగు.
ఇదీ చదవండి: కుక్కల బరువు పెంచుతున్న మన ఆహారం
మహారాష్ట్ర గ్రామీణ మహిళా శ్రామికశక్తిలో 82% వ్యవసాయంలో ఉండగా, భూమి హక్కులు కేవలం 15.5% మందికే ఉన్నాయి. ఈ సర్టిఫికెట్ల జారీతో లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది. భూమి పట్టా లేకపోయినా ప్రభుత్వ పథకాలు, విత్తన సబ్సిడీలు, సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకింగ్ తోడ్పాటు వంటి సదుపాయాలు ఈ సర్టిఫికెట్ ద్వారా మహిళా రైతులకు నేరుగా అందుతాయి. ఈ చట్టం చెయ్యడంలోనే కాదు అమలులో అవాంతరాలను అధిగమించడంలోనూ దేశంలో ఇతర రాష్ట్రాలకు మహారాష్ట్ర ఆదర్శంగా నిలవాలి.
- సాక్షి, స్పెషల్ డెస్క్
ఇదీ చదవండి: ప్రియాంక చోప్రా మెచ్చిన పల్లెటూరి యశోద!


