ప్రియాంక చోప్రా మెచ్చిన పల్లెటూరి యశోద | Village Fields to Priyanka Chopras Instagram: Inspiring Story Dehati Madam Yashoda | Sakshi
Sakshi News home page

ప్రియాంక చోప్రా మెచ్చిన పల్లెటూరి యశోద

Oct 7 2026 9:21 AM | Updated on Oct 7 2026 9:28 AM

Village Fields to Priyanka Chopras Instagram: Inspiring Story Dehati Madam Yashoda

తలపై కొంగు.. పక్కా పల్లెటూరి మనిషి.. పొలాల్లో పని చేస్తూ వీడియోలు చేస్తుంటుంది. మాములుగా అయితే ఆమె గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటాం. ఆమె వీడియోను నటి ప్రియాంక చోప్రా  తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. ఎందుకంత ప్రత్యేకంగా ప్రియాంక పోస్ట్‌ చేసింది అంటారా?. ఆమె టాలెంట్‌ అలాంటిది కాబట్టి!.

ప్రియాంక చోప్రా తన వీడియోను షేర్‌ చేయడం యశోదాకు ఊహించని ఆనందాన్ని ఇచ్చింది. ఆ విషయాన్ని ఆమె మరో వీడియో ద్వారా తన ఫాలోవర్లతో పంచుకున్నారు. అంతేకాదు.. అదే రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె 4 లక్షల మంది ఫాలోవర్ల మైలురాయిని కూడా అందుకున్నారు. ‘‘చాలామందికి ఇది ఒక ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ మాత్రమే కావచ్చు. కానీ నాకు మాత్రం ఎంతో ప్రత్యేకమైన క్షణం’’ అంటూ యశోదా ఆనందం వ్యక్తం చేశారు.

యశోదా లోధి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా సిరతు ప్రాంతం. యశోదకు ఏడాది వయసున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు బంధువులకు అప్పగించారు. పిల్లలు లేని బువా, ఫూఫా ఆమెను పంజాబ్‌లోని లుధియానాకు తీసుకెళ్లి పెంచారు. 12వ తరగతి వరకు హిందీ మీడియంలోనే చదువుకున్న ఆమె.. ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. కానీ, ఇతరులు ఇంగ్లిష్‌లో మాట్లాడే వీడియోలను పదేపదే వింటూ.. వారిని అనుకరిస్తూ సొంతంగా సాధన చేశారు. క్రమంగా మాట్లాడటంలో పట్టు సాధించారు. ఆ తర్వాత తాను నేర్చుకున్నదాన్ని ఇతరులకు కూడా నేర్పించాలని నిర్ణయించుకున్నారు.

గ్రామీణ మహిళలు, విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా రోజువారీ జీవితానికి సంబంధించిన ఉదాహరణలతో ఇంగ్లిష్‌ పదాలు, వాక్యాలు, గ్రామర్‌ నేర్పడం మొదలుపెట్టారు. పొలంలో పని చేయడం, ఇంటి పనులు చేసుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం.. ఇలా తన చుట్టూ జరిగే విషయాలనే పాఠాలుగా మార్చుకున్నారు.

‘దేహాతీ’ అనే పేరే బ్రాండ్‌గా..
యశోదా తన గ్రామీణ నేపథ్యాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. చీర, కొంగుతోనే ఎక్కువ వీడియోల్లో కనిపిస్తూ.. ‘‘పల్లెటూరిలో పుట్టాం.. ఇంగ్లిష్‌ మాట్లాడకూడదా? మళ్లీ పుడతామా ఏంటి?’’ అన్నట్టుగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. అందుకే ‘దేహాతీ మేడమ్‌’(పల్లెటూరి మేడమ్‌)కు ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఆమె వీడియోలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిష్‌ నేర్చుకోవాలనుకునే వారిలో మంచి ఆదరణ పొందాయి.

యూట్యూబ్‌తో మొదలై..
యశోదా ఇంగ్లీష్‌ విత్‌ దెహతీ మేడమ్‌ ‘English With Dehati Madam’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి స్పోకెన్‌ ఇంగ్లిష్‌, గ్రామర్‌, రోజువారీ సంభాషణలకు సంబంధించిన వీడియోలు చేయడం మొదలుపెట్టారు. తొలినాళ్లలో పెద్దగా స్పందన లేకపోయినా.. క్రమంగా ఆమె వీడియోలకు ఆదరణ పెరిగింది. కొద్దికాలంలోనే లక్షల మంది ఆమెను ఫాలో చేయడం మొదలుపెట్టారు. 2023 నాటికే ఆమె ఛానెల్‌కు సుమారు 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా.. ఆమెకు యూట్యూబ్‌ సిల్వర్‌ ప్లే బటన్‌ కూడా లభించింది. ఆమె ప్రత్యేకత పుస్తకాల్లోని ఇంగ్లిష్‌ను చెప్పడం కంటే.. సాధారణ జీవితంలో ఎలా మాట్లాడాలో నేర్పడమే. అందుకే గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి ఆమె వీడియోలు సులభంగా కనెక్ట్‌ అయ్యాయి.

భర్త నుంచి విమర్శలు.. 
యశోదా ప్రయాణం మొదట్లో అంత సులభంగా సాగలేదు. తాను యూట్యూబ్‌ ద్వారా ఏదైనా సాధించగలనని చెప్పినప్పుడు కుటుంబం నుంచి కూడా వెంటనే ప్రోత్సాహం లభించలేదట. భర్త నుంచే ఆమెకు తిట్లు పడ్డాయట. పనులు మానేసి అవేం వీడియోలు అంటూ ఆయన నిరుత్సాహపరిచేవారని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. అయినా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. వినడం, మాట్లాడటం, తప్పులు సరిదిద్దుకోవడం.. ఇదే తన ఇంగ్లిష్‌ నేర్చుకునే మార్గమని ఆమె చెబుతుంటారు. ఇప్పుడు ఆయనే ఆమె భుజం తట్టి అభినందిస్తున్నారట. 

ఇప్పుడు గ్లోబల్‌ వైడ్‌.. 
గ్రామీణ ప్రాంతంలో సాధారణ జీవితాన్ని గడుపుతూ తనకు తానే ఇంగ్లిష్‌ నేర్చుకున్న యశోదా.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ప్రభుత్వం,ఎన్జీవోల తరఫున పలు ఈవెంట్లలో పాల్గొని మరికొందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తి వీడియోను ప్రియాంక చోప్రా షేర్‌ చేయడంతో.. పల్లెటూరి మేడమ్‌ పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది.

ఇదీ చదవండి: వారెవ్వా.. చీరలో ఆమె పరుగులు! వెనక ఎమోషనల్‌ కథ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement