ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? రెజ్యూమ్ సిద్ధం చేసుకున్నారు.. డ్రెస్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై కూడా ఫోకస్ పెట్టారు. కానీ ఇంటర్వ్యూలో ‘మీ ప్రస్తుత జీతం ఎంత?’ అని అడిగితే మాత్రం ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతారు. నిజం చెబితే తక్కువ ప్యాకేజీ వస్తుందేమో.. ఎక్కువ చెబితే ఇబ్బంది అవుతుందేమోననే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం తప్పనిసరి కాదని ఉద్యోగ నియామక రంగ నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్వ్యూలో ప్రస్తుత జీతం ఎంత? కొత్త ఉద్యోగంలో ఎంత ఆశిస్తున్నారు? వంటి ప్రశ్నలు సాధారణంగా ఎదురవుతుంటాయి. అయితే ప్రస్తుత జీతాన్ని తప్పనిసరిగా వెల్లడించాల్సిన అవసరం లేదని Acas సీనియర్ అడ్వైజర్ లూయిస్ రడ్ చెబుతున్నారు. అభ్యర్థికి ఇష్టం ఉంటే చెప్పొచ్చని.. లేదంటే కొత్త ఉద్యోగంలో తన అంచనాలను వివరించవచ్చని సూచిస్తున్నారు. ఉదాహరణకు.. ‘నా అనుభవం, నైపుణ్యాలు, ఈ ఉద్యోగానికి ఉన్న మార్కెట్ రేటుకు తగిన జీతాన్ని ఆశిస్తున్నాను’ అని చెప్పొచ్చు.
గత జీతం కంటే నైపుణ్యాలే ముఖ్యం..
ఉద్యోగార్థి గతంలో ఎంత జీతం తీసుకున్నారనే దాని ఆధారంగా కొత్త జీతాన్ని నిర్ణయించడం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థి నైపుణ్యాలు, అనుభవం, పనితీరు, సంస్థకు అందించగల విలువ ఆధారంగా ప్యాకేజీని నిర్ణయించడం మంచిదని సూచిస్తున్నారు. గత జీతాల గురించి అడగడం వల్ల ఇప్పటికే ఉన్న వేతన వ్యత్యాసాలు కూడా కొనసాగిపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జీతం ఎక్కువగా చెప్పడం మంచిదేనా?
ప్రస్తుత జీతం అడిగినప్పుడు.. కొత్త ఉద్యోగంలో ఎక్కువ జీతం పొందాలనే ఉద్దేశంతో కొందరు ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పాలని అనుకుంటారు. కానీ ఇలా అబద్ధం చెప్పడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తర్వాత ఆ విషయం బయటపడితే ఉద్యోగ అవకాశానికే ఇబ్బంది కలగొచ్చని సూచిస్తున్నారు. అందుకే నిజాయితీగా ఉండటంతో పాటు.. మీకు ఉన్న నైపుణ్యాలు, అనుభవం, సంస్థకు మీరు అందించే ప్రయోజనాల గురించి వివరించడం మంచిదని చెబుతున్నారు.
‘మార్కెట్ రేట్’ తెలుసుకోండి..
ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఆ ఉద్యోగానికి మార్కెట్‌లో సాధారణంగా ఎంత జీతం ఇస్తున్నారో తెలుసుకోవడం చాలా ఉపయోగపడుతుందని Recruitment and Employment Confederation క్యాంపెయిన్స్ డైరెక్టర్ షాజియా ఎజాజ్ చెబుతున్నారు. జీతాలపై ముందుగానే అవగాహన ఉంటే.. ఇంటర్వ్యూలో మీ అంచనాలను ధైర్యంగా చెప్పొచ్చని సూచిస్తున్నారు. దీంతో గతంలో తీసుకున్న జీతం కాకుండా.. ప్రస్తుతం మీ నైపుణ్యాలకు ఎంత విలువ ఉందనే దానిపై చర్చ జరిపే అవకాశం ఉంటుంది.
ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడండి..
జీతం గురించి అడిగినప్పుడు భయపడకుండా.. వాస్తవికతతో పాటు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలని షాజియా ఎజాజ్ సూచిస్తున్నారు. ‘నా అనుభవం, నైపుణ్యాలకు తగ్గట్టుగా, ఈ ఉద్యోగానికి ఉన్న మార్కెట్ రేటు ప్రకారం మంచి ప్యాకేజీని ఆశిస్తున్నాను’ అని చెప్పొచ్చు. అలాగే సంస్థకు తాము అందించగల విలువ, గతంలో సాధించిన ఫలితాలు, తమకు ముఖ్యమైన ఉద్యోగ ప్రయోజనాల గురించి కూడా వివరించవచ్చని చెబుతున్నారు. ముందుగానే జీతాలపై పరిశోధన చేసి, తాము సంస్థకు అందించే విలువను స్పష్టంగా వివరించగలిగిన ఉద్యోగార్థులు సరైన ప్యాకేజీని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: తెలుగు మీడియం బ్యాగ్రౌండ్ నుంచి దుబాయ్ వరకు..!


