వాషింగ్టన్: అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా కెనడాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెనడా అతిగా డిమాండ్ చేస్తోందని ఆరోపిస్తూ.. గతంలో తాను చేసిన ‘51వ రాష్ట్రం’ వ్యాఖ్యలను ట్రంప్ మరోసారి తెరపైకి తెచ్చారు.
కెనడా అమెరికా రాష్ట్ర అయ్యేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ అమెరికాలోని రాష్ట్రాలు పొందుతున్న ప్రయోజనాలన్నింటినీ తాను పొందాలని కోరుకుంటోంది. అంతేకాకుండా వారు అమెరికా రైతులపై గత అనేక సంవత్సరాలుగా భారీ మొత్తంలో సుంకాలు విధిస్తున్నారు. ఇకపై అది కుదరదు. అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లకు ప్రతిగా తాము కూడా డాలర్‌కు డాలర్ పద్ధతిలో దీటుగా స్పందిస్తామని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ప్రకటించారు. టారిఫ్‌ల విధింపు అనేది కెనడాపై జరిగిన దాడిగా అభివర్ణించిన మార్క్ కార్నీ, దేశ ఆర్థిక వ్యవస్థను, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విఫలమవడంతో అమెరికా ప్రభుత్వం కెనడా దిగుమతులపై 50 శాతం టారిఫ్‌ను ప్రకటించింది. ముందస్తుగా కుదిరిన ఒప్పంద నిబంధనల ప్రకారం వాణిజ్య వ్యాపారాన్ని ఖరారు చేయడానికి కెనడా నిరాకరించిందని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. ఉక్కు, అల్యూమినియం వంటి రంగాలపై సుంకాలు తగ్గించేందుకు అమెరికా ముందుకు వచ్చినప్పటికీ కెనడా వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
అయితే, అమెరికా చివరి నిమిషంలో నిబంధనలను మార్చడం అన్యాయమని, ఆర్థికంగా అవి సరిపడేలా లేవని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తిప్పికొట్టారు. అమెరికా చర్యల వల్ల ఏ ఒప్పందంపైనైనా నమ్మకం సడలిపోతోందని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందు నెలకొన్న ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. కెనడా తన చర్చల బృందాన్ని వెనక్కి పిలవగా, అమెరికా విధించిన సుంకాలకు వ్యతిరేకంగా కెనడా కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది.


