సురేఖ (ఫైల్ ఫొటో)
సాక్షి, సంగారెడ్డి: ఆరు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితురాలు సురేఖ బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా శాంతినగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆదివారం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. తన ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారనే కోపంతో తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఆమె హతమార్చింది.
ఈ ఏడాది జనవరి చివర్లో వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ.. తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిని హత్య చేయాలని పథకం వేసింది. ఒళ్లునొప్పులకు మందు ఇస్తున్నానంటూ అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒకరి తర్వాత ఒకరిని హతమార్చింది. అయితే ఈ కేసులో ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. ఏ ఉద్యోగమూ దొరక్కపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
యాచారానికి చెందిన నక్కలి దశరథం(58), లక్ష్మి(54) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడో కుమార్తె సురేఖ(25) సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన ఓ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పిన సురేఖకు వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించడమే కాకుండా.. మరో సంబంధం చూడటం ప్రారంభించారు. దీంతో ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను తొలగించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వైద్య రంగంలో తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్న సురేఖ.. తాను పనిచేస్తున్న ఆస్పత్రి నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మత్తు మందును తీసుకొచ్చింది. అనంతరం ఓ మెడికల్ షాపులో మూడు సిరంజీలు కొనుగోలు చేసింది. జనవరి చివర్లో ఓ రోజు రాత్రి సెలవుపై ఇంటికి వచ్చిన సురేఖ.. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసింది. అనంతరం పెళ్లి విషయం మరోసారి ప్రస్తావనకు రావడంతో వారు ఆమెను మందలించారు. అప్పటికే వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్న ఆమె.. ముందుగా తల్లి లక్ష్మికి ఒళ్లునొప్పులకు మందు ఇస్తున్నానంటూ మత్తు మందును అధిక మోతాదులో ఇచ్చింది.
కొద్దిసేపటికే లక్ష్మి మృతి చెందగా.. ఆమెను నిద్రిస్తున్నట్లు పడుకోబెట్టింది. అనంతరం ఇంటి బయట ఉన్న తండ్రి దశరథం వద్దకు వెళ్లి ఆయనకూ ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
అన్నకు ఫోన్ చేసి.. కన్నీటి నాటకం
తల్లిదండ్రుల మరణాలను సహజంగా చూపించేందుకు సురేఖ ప్రయత్నించింది. అన్న అశోక్‌కు ఫోన్ చేసి.. ‘‘అమ్మా నాన్న చనిపోయారు.. భయంగా ఉంది.. త్వరగా రండి’’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. అన్న వచ్చాక.. తండ్రి అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని, తల్లి షాక్‌కు గురై గుండెపోటుతో స్పృహ కోల్పోయిందని నమ్మించే ప్రయత్నం చేసింది. సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయిందంటూ కన్నీరు పెట్టుకుంది.
అలా బయటపడిన నిజం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో లభించిన సిరంజీలను పరిశీలించారు. సురేఖ చెప్పిన వివరాల్లో అనుమానాలు రావడంతో ఆమెను ప్రశ్నించారు. మొదట అవి మూడు నెలల కిందటివని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె సంచిలో దొరికిన ఉపయోగించని మూడో సిరంజీ, ఖాళీ ఇంజెక్షన్ సీసాలు, వాడిన సిరంజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరకు విచారణలో తల్లిదండ్రులను తానే హత్య చేసినట్లు సురేఖ అంగీకరించింది. ప్రేమ వివాహానికి అడ్డుపడటమే కారణమని వెల్లడించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికే సురేఖ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ, కుటుంబ వ్యతిరేకత నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు.


