ఐఏఎస్ అధికారికి మార్కెటింగ్ శాఖ పగ్గాలు
డైరెక్టర్‌గా రాహుల్‌రాజ్ నియామకం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెటింగ్ శాఖను గాడిన పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఈ శాఖకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని డైరెక్టర్‌గా నియమించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మార్కెటింగ్ శాఖలో కొన్నేళ్లుగా వెలుగుచూస్తు న్న కార్యదర్శుల అవినీతి, అక్రమాలు.. ముఖ్యంగా పత్తి కొనుగోళ్లలో బయటపడిన అక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్‌గా ఐఏఎస్ అధికారి రాహుల్‌రాజ్‌ను నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు నెలల క్రితం వరకు డైరెక్టర్ (ఎఫ్‌ఏసీ)గా కొనసాగిన జి.లక్ష్మీబా యి బదిలీ అనంతరం ఇన్‌చార్జ్ డైరెక్టర్‌గా కొనసాగిన డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణుడును ఆ బాధ్యతల నుంచి తప్పించి, పూర్తి అదనపు బాధ్యతల్లో రాహుల్‌రాజ్‌ను నియమించింది. సాధారణంగా వ్యవసాయశాఖ కార్యదర్శే ఎక్స్‌అఫీషియోగా వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం వ్యవసాయశాఖ కార్యదర్శిగా సురేంద్రమోహన్ కొనసాగుతున్నా, మార్కెటింగ్ డైరెక్టర్‌గా రాహుల్‌రాజ్‌ను ప్రత్యేకంగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా..?
2024–25 ఖరీఫ్ పత్తి కొనుగోళ్లలో రైతుల పేర్లతో తప్పుడు తాత్కాలిక నమోదు పత్రాలు జారీ చేసి, అసలు రైతుల వద్ద కాకుండా దళారుల నుంచి పత్తి కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. వ్యవసాయశాఖ వద్ద ఉన్న తాత్కాలిక నమోదులకు, మార్కెటింగ్ శాఖ రికార్డులకు మధ్య కూడా వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఈ మేరకు మార్కెటింగ్ శాఖకు చెందిన ఏడుగురు కార్యదర్శులను 2025 ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారు. ఈ విషయంలో మొత్తంగా 21 మందిని దోషులుగా గుర్తించినా, మార్కెటింగ్ శాఖ పరువు బజారున పడకుండా ఏడుగురితో సరిపెట్టారని మార్కెటింగ్ శాఖ సర్కిళ్లలో ప్రచారం జరిగింది.
2026 జనవరిలో ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. 2024 అక్టోబర్ నుంచి పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలను సీఐడీ కోరినట్లు వెల్లడైంది. పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 2025 డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 65కుపైగా జిన్నింగ్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. తూకం యంత్రాల ప్రమాణాలు, తేమ కొలిచే పరికరాలు, పత్తి నాణ్యతను నిర్ధారించే శాస్త్రీయ పరికరాలు, సీసీ కెమెరాల నిర్వహణ తదితర అంశాల్లో లోపాలను గుర్తించారు. కొన్ని మిల్లులపై చట్టపరమైన కేసులు కూడా నమోదు చేశారు.
పత్తి సీజన్ ముందే కీలక బాధ్యత
ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్‌రాజ్‌కు మార్కెటింగ్ శాఖ పగ్గాలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సహకారశాఖ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ వంటి వ్యవసాయ అనుబంధ సంస్థలతో పని అనుభవం ఉంది. గతంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ముందున్న పత్తి కొనుగోళ్ల సీజన్ మార్కెటింగ్ శాఖకు అత్యంత కీలకం. గత సీజన్‌లో బయటపడిన లోపాలు పునరావృతం కాకుండా రైతుల నిజమైన నమోదు, పంట విస్తీర్ణం–దిగుబడి ఆధారంగా కొనుగోలు పరిమితుల నిర్ధారణ, దళారుల ప్రవేశానికి అడ్డుకట్ట, తూకాల్లో పారదర్శకత, నాణ్యత పరీక్షలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలపై కొత్త డైరెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


