పత్రికా స్వేచ్ఛ లేకుంటే ప్రజాస్వామ్య సారానికే విఘాతం | Federation of Press Clubs conference concludes | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛ లేకుంటే ప్రజాస్వామ్య సారానికే విఘాతం

Aug 24 2026 5:39 AM | Updated on Aug 24 2026 5:39 AM

Federation of Press Clubs conference concludes

జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం: జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి

డిజిటల్‌ విప్లవమొచ్చినా సంప్రదాయ జర్నలిజానికి మనుగడ ఉంటుంది: ఎన్‌.రామ్‌

ముగిసిన ఫెడరేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌క్లబ్స్‌ సదస్సు

హైదరాబాద్‌ డిక్లరేషన్‌కు ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో పాత్రికేయుల రక్షణ కోసం సమగ్రమైన వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టం, పటిష్టమైన చట్టపర రక్షణ వ్యవస్థలు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోకపోవడంపట్ల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ వేదికగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ క్లబ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛకు, భావప్రకటన స్వేచ్ఛకు ఎదురవుతున్న అడ్డంకులపై జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్న తీరుపై ఆయన మాట్లాడారు. 

క్షేత్రస్థాయిలో నిజాలను వెలికితీసే జర్నలిస్టులకు భద్రత కల్పించేలా సమర్థవంతమైన చట్టాలు, కార్మిక భద్రతా నిబంధనలు అమలులోకి రాకపోవడం వల్ల జర్నలిస్టులు తీవ్రమైన ఒత్తిళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులు చట్టబద్ధంగా పనిచేస్తున్న క్రమంలో, ప్రభుత్వాలు, కార్పొరేట్‌ శక్తులు, ఇతర వర్గాల నుంచి వారిపై జరుగుతున్న దాడులు, అణచివేత చర్యలను అడ్డుకోవడానికి జర్నలిస్ట్‌ సంçఘాలు, ఫెడరేషన్లు సమష్టిగా చట్టపరమైన వేదికలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే భావప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని, ఇవి లేకపోతే ప్రజాస్వామ్యం తన సారాన్ని కోల్పోతుందని చెప్పారు. వర్తమాన మీడియా రంగంలో వస్తున్న మార్పులను ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో నిబద్ధత కలిగిన పాత్రికేయుల పాత్ర ఎప్పటికీ ఎంతో విలువైనదని పేర్కొన్నారు. 

సంప్రదాయ జర్నలిజం ప్రాధాన్యానికి ఢోకా ఉండదు: ఎన్‌.రామ్‌
డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు, యూట్యూబ్‌ చానెళ్లు ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సంప్రదాయ జర్నలిజం ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదని, డిజిటల్‌ కాలంలో రిపోర్టింగ్‌ ప్రాథమిక సూత్రాలను పాటించడం మరింత అవసరమని ‘ది హిందూ’ గ్రూప్‌ డైరెక్టర్, ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎన్‌.రామ్‌ స్పష్టం చేశారు. మీడియాపై ప్రజలకు విశ్వసనీ యత పెరగాలంటే జర్నలిజం తన మూలాలైన క్షేత్రస్థాయి వార్తల కవరేజి, పరిశోధనాత్మక వార్తలు, వివరణాత్మక వార్తల వైపు మళ్లాల్సిందేనని హితవు పలికారు. 

మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ వ్యవస్థలను మరింత బలోపే తం చేసుకోవాలని, జర్నలిస్టుల కోసం పారదర్శకమైన ప్రవ ర్తనా నియమావళిని పాటించాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే మీడియాపై అవగాహన కల్పించాలని, దీనివల్ల విద్యార్థులు వార్తలను, సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసు కుని, విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలరని అభి ప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను బలోపేతం చేయడానికి, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడానికి, వృత్తిగత ప్రమాణాలను పెంపొందించడానికి ఫెడరేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ క్లబ్స్‌ ’హైదరాబాద్‌ డిక్లరేషన్‌’ను ఆమోదించింది. 

కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస రెడ్డి, ‘ది కారవాన్‌’ మేగజైన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ హర్తోష్‌ సింగ్‌ బాల్, ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షురాలు సంగీతా బరూహ్‌ పిషారోటి, ఫెడరేషన్‌ అధ్యక్షుడు గౌతమ్‌ లహరి, ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు సంగీత, దేశంలోని వివిధ ప్రెస్‌క్లబ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్‌ వరికుప్పల, ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement