అంతులేని.. భర్తల క్రూరత్వం | Techie Dies by Suicide After Husband Mother-in-Law Demand More Dowry | Sakshi
Sakshi News home page

అంతులేని.. భర్తల క్రూరత్వం

Aug 24 2026 8:25 AM | Updated on Aug 24 2026 8:48 AM

Techie Dies by Suicide After Husband Mother-in-Law Demand More Dowry

పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని భర్త, అత్త వేధింపులు.. టెక్కీ ఆత్మహత్య. కేజీ బంగారం, రూ.కోటికి పైగా నగదు, వైభవంగా పెళ్లి చేశారు, వారం తిరక్కుండానే వధువు బలవన్మరణం.. ఇలాంటి విషాద ఘటనలు తరచూ  సంభవిస్తున్నాయి. కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని చట్టం చెబుతున్నా ఎవరూ   పాటించడం లేదు. పైగా మరింత డబ్బు, బంగారం కావాలని  సతాయిస్తూ ఆడపిల్లల ఉసురుతీసే భర్తల అఘాయిత్యాలు పెరిగిపోయాయి.

బెంగుళూరు: గత నాలుగేళ్లలో రాష్ట్రంలో బెంగళూరుతో సహా వివిధ జిల్లాల్లో 617 మంది మహిళలు వరకట్న భూతానికి బలయ్యారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ 2022 నుంచి 2026 జూన్‌ వరకు రాష్ట్రంలో మహిళలపై సంభవించిన  నేరాల గురించి విడుదల చేసిన నివేదికలో ధనదాహపు భర్తలు, అత్తమామల హింసోన్మాదం పెల్లుబికింది.  

శిక్ష 7 మందికి మాత్రమే  
వరకట్న వేధింపులతో మహిళల మృతి, అత్యాచారం, లైంగిక దాడులు, మహిళలపై భర్తల హింస తదితరాలను నివేదికలో ప్రస్తావించారు. మెట్టినింట కట్న వేధింపులతో 617 మంది మరణించారు. కానీ ఇందులో 7 మందికి శిక్ష పడింది. 467 కేసులు ఇంకా కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. సుదీర్ఘమైన దర్యాప్తు, సాక్ష్యాల సేకరణ ప్రక్రియ, సాక్షులకు భద్రత కల్పించడం, న్యాయప్రక్రియ అంశాల వల్ల కేసుల విచారణ సవాళ్లు ఎదుర్కొంటోంది.  

లైంగిక వేధింపులు..  
మహిళలపై లైంగిక వేధింపుల కేసులు 2022లో 5,857 నమోదుకాగా, 54 మందికి శిక్షలు పడ్డాయి.  559 నకిలీ ఆరోపణలని తెలిసింది. 2023లో 6,489 కేసులు నమోదుకాగా 651 నకిలీ కేసులుగా వెల్లడైంది. 2024లో 6335 కేసులు నమోదుకాగా ఇందులో 722 నకిలీ కేసులున్నాయి. 2025లో 5843 కేసులు నమోదు కాగా 610 నకిలీ కేసులు. నాలుగేళ్లలో 27,828 లైంగిక వేధింపుల ఘటనలు సంభవించాయి.   

అత్యాచారం కేసులు....  
రాష్ట్రంలో గత నాలుగేళ్లలో మొత్తం 2,527 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. 2022లో 537, 2023లో 600, 2024లో 623, 2025లో 550 కేసులు, 2026లో 262 కేసులు వచ్చాయి.  

అంతులేని.. భర్తల క్రూరత్వం  
 భర్తల క్రూరత్వ ప్రవర్తనపై 2022లో 2,779 కేసులు నమోదు కాగా ఇందులో 2,467 కేసుల్లో నేరం రుజువైంది.  
2023లో 2,946 దౌర్జన్యం కేసుల్లో 329 నకిలీవని తేలింది. 2,556 కేసుల్లో వేధింపులు నిజమేనని నిర్ధారణ అయ్యింది.  
2024లో 2,894 కేసులు నమోదు కాగా, ఇందులో 2,566 కేసుల్లో భర్తల దాషీ్టకాలు రుజువయ్యాయి. 2025లో 2,744 కేసులు నమోదుకాగా 231 నకిలీ కేసులున్నాయి.  
2026 జూన్‌ వరకు 1,534 దౌర్జన్యం కేసులు నమోదయ్యాయి.  

ఏటా 2 వేల కేసులు
వివాహం, ఆ తరువాత వరకట్న వేధింపుల నియంత్రణ చట్టం కింద 2022లో 2,245 కేసులు నమోదు కాగా, 2023లో 2,348 కేసులు, 2024లో 1,999 కేసులు, 2025లో 2,110, 2026 జూన్‌ వరకు 1,039 కేసులు నమోదయ్యాయి. తమ వద్ద నమోదైన కేసులను పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌  అధ్యక్షురాలు డా.నాగలక్ష్మీ చౌదరి తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement