బనశంకరి: చలిస్తున్న కారులో మంటలు చెలరేగిన ఘటన శనివారం రాత్రి కోరమంగల వద్ద జరిగింది. శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో కోరమంగల వాటర్‌ట్యాంక్ జంక్షన్ వద్ద వస్తుండగా కారు ఇంజిన్ నుంచి పొగ రావడంతో డ్రైవరు రోడ్డు పక్కన నిలిపి కిందికి దిగాడు. ఇంతలో మంటలు లేచి కారును చుట్టుముట్టాయి. స్థానికులు ఆర్పివేయడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో కారు పూర్తిగా కాలిపోయింది. కొంతసేపటికి ఫైర్ సిబ్బంది, పోలీసులు వచ్చి మంటలను అర్పివేశారు. కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనతో అగర–సర్జాపుర రోడ్డులో కొద్దిసేపుట్రాపిక్ జాం ఏర్పడింది.
జిరాక్స్ గొడవ..
పుత్తూరులో ఉద్రిక్తత
యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులో చిన్న గొడవ పట్టణంలో మత ఘర్షణల వరకూ వెళ్లింది. జిరాక్స్ షాపులో రగడ జరిగింది. వివరాలు.. ఓ వ్యక్తి పత్రాన్ని ల్యామినేషన్ చేయించడానికి షాపునకు వెళ్లాడు. అక్కడ ల్యామినేషన్ చేస్తుండగా మంటలు చెలరేగి పత్రం, యంత్రం కాలిపోయాయి. దీంతో ఆ వ్యక్తి దుకాణదారును ప్రశ్నించగా ఇరువురి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారు కాగా వారి బంధుమిత్రులు కూడా గొడవలోకి దిగడంతో రభస అధికమైంది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, నాయకులు ఈ రభసపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఖండించారు. ఈ నేపథ్యంలో పోలీసులు దుకాణదారు, బీజేపీ ఎమ్మెల్యే, మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వదంతులను వ్యాపింపచేయరాదని ఎస్పీ అరుణ్‌కుమార్ తెలిపారు. పుత్తూరు బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ నేత దనేశ్ పంజిగైపె కూడా కేసు నమోదు చేశారు. సున్నిత ప్రాంతాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.
మునిగిన పడవ
యశవంతపుర: చేపలు పట్టడానికి వెళ్లిన పడవ సముద్రంలో మునిగిపోయిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు పాత బందర్ దగ్గర జరిగింది. స్థానిక మత్స్యకారుల బోటులోని ఆరుమందిని రక్షించి ఒడ్డుకు తెచ్చారు. అయాన్ అనే పేరున్న బోటులో ఆరుమంది జాలర్లు సముద్రంలోకి వెళ్లారు. జోరుగా వీస్తున్న గాలి, ఎత్తైన అలలతో పడవ బోల్తా పడి మునిగిపోయింది. స్థానిక జాలర్లు వెంటనే వారిని కాపాడడంతో ప్రాణనష్టం తప్పింది.
కొత్తింటిలో నగలు మాయం
మైసూరు: గృహ ప్రవేశం సందర్భంగా కొత్త ఇంటిలో అల్మరాలో ఉంచిన రూ. 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయి. ఈ ఘటన మైసూరు కనకదాస నగరలోని నివాసి సివిల్ ఇంజనీర్ జగదీశ్ ఇంటిలో జరిగింది. వివరాలు.. తన ఇంటిపైన కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశాన్ని ఆగస్టు 18న నిర్వహించాడు. 14న బ్యాంకులో నుంచి నగలను విడిపించి తీసుకొచ్చి ఉంచాడు. 17న సాయంత్రం పూజలో ధరించేందుకు భార్యకు 20 గ్రాముల నెక్లెస్‌ను ఇచ్చాడు. మిగిలిన నగలను అల్మరాలో ఉంచాడు. పూజ ముగిసిన తరువాత చూడగా నగలు కనిపించలేదు. గృహప్రవేశానికి వచ్చిన ఎవరో ఒకరు కొట్టేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోకిరీ స్వామి
యశవంతపుర: పట్టిన దయ్యాన్ని విడిపిస్తానంటూ మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న నకిలీ స్వామి ఉదంతమిది. చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా మేకనహుడ్లు గ్రామంలో సతీశ్ పత్రి అనే వ్యక్తి స్వామీజీ వేషమెత్తి దయ్యం, భూతం విడిపిస్తానని చెప్పుకుంటున్నాడు. దీంతో కొందరు అతనిని ఆశ్రయించగా, పూజల పేరుతో యువతితో కలిసి చిందులేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. దయ్యం వీడాలంటే కోడిని కొరికి రక్తం తాగాలని ఆమెను ఒత్తిడి చేశాడు. ఈ వీడియో ప్రచారంలోకి వచ్చింది. కొందరు గ్రామస్థులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


