ఛిద్రమైన కూలీల బతుకులు | - | Sakshi
Sakshi News home page

ఛిద్రమైన కూలీల బతుకులు

Aug 24 2026 7:21 AM | Updated on Aug 24 2026 7:21 AM

యంత్రం దూసుకెళ్లి మహిళ మృతి

యంత్రం దూసుకెళ్లి మహిళ మృతి

చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో దెబ్బతిన్న బొలెరో

ఆస్పత్రి వద్ద బోరున విలపిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

సాక్షి, బళ్లారి: వారంతా వ్యవసాయ కూలీలు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు వారివి. రోజూ కూలి పనులకు వెళ్తే కాని కుటుంబ పోషణ సాగదు. రోజు మాదిరిగానే కూలి పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా మృత్యువు కబళించింది. బొలెరో వాహనం అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన యాదగిరి జిల్లా షాపూర్‌ తాలూకా మడ్నాల్‌ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. మడ్నాల్‌కు చెందిన దాదాపు 30 మంది కూలీలు పత్తి పంటలో కలుపు తొలగించే పనులకు వెళ్లారు. పని ముగించుకుని బొలెరోలో ఇంటికి బయలుదేరారు. మడ్నాల్‌ గ్రామం సమీపంలో డ్రైవర్‌ అతివేగం వల్ల నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భాగ్యశ్రీ (22), సత్యమ్మ (20), హొన్నింగమ్మ (30) అక్కడక్కడే మృతి చెందారు. 21 మందికి గాయాలయ్యాయి. చికిత్సల నిమిత్తం 14 మందిని కలబురిగి ఆస్పత్రికి, ఏడుగురిని షాపూర్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బొలెరో డ్రైవర్‌ షేకప్ప గాయపడగా.. అతడి భార్య మరణించింది. ప్రమాద తీవ్రతకు బొలెరో ముందుభాగం దెబ్బతింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే కూలీల కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు తరలివచ్చారు. ఎంత పని చేశావు దేవుడా అని బోరున విలపించారు.

ప్రాణాలు హరిస్తున్న వాహనాలు

కూలీలను పొలాల్లోకి తీసుకెళ్తున్న ఆటోలు, బొలెరో, టాటాఏస్‌ వాహనాలు ప్రాణాలు హరిస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా వాహనాల్లో 20 నుంచి 50 మంది దాకా కూలీలను తరలిస్తున్నారు. ప్రమాదవశాత్తూ ప్రమాదాలు జరిగనప్పుడు ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కుటుంబ పోషణ చూసుకునే మహిళా కూలీలు ఏటా ఈ ప్రమాదాల్లో మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కూలీలను తరలించే వాహనాలకు బీమా చేయించకపోవడంతో మృతుల కుటుంబాలకు మరింత శాపంగా మారుతోంది. రవాణా శాఖ సిబ్బంది పర్యవేక్షణ కొరవడటంతో ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. యాదగిరి, బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయగనగర తదితర జిల్లాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

విద్యుత్‌ స్తంంభాన్ని ఢీకొన్న బొలెరో

ముగ్గురు మహిళా కూలీల మృతి

మరో 21 మందికి గాయాలు

చికిత్సల కోసం కలబురిగి,

షాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలింపు

యాదగిరి జిల్లా షాపూర్‌ తాలూకాలో విషాదఛాయలు

హుబ్లీ:పెసరకాయలను విడిపించేందుకు కూలి పనికి వెళ్లిన మహిళపై పెసలను విడిపించే యంత్రం దూసుకెళ్లింది. ఆదివారం దార్వాడా తాలూకా ఆరోబెళవడి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో యల్లవ్వ (47) మృతి చెందింది. మృతురాలికి అంధుడైన భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న యల్వవ్వ మృతి చెందడంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మాకు దిక్కెవరు దేవుడా అంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. దార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement