కోలారు: తాలూకాలోని అమ్మనల్లూరు గ్రామంలో ఆదివారం వివిధ సముదాయాల ప్రజలు పార్టీలకతీతంగా అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు,. క్యాలనూరు సొసైటీ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సమస్యలను గ్రామస్థాయిలోనే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుని విగ్రహ ఏర్పాటు పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జాతి మత భేధాలను మరచి అందరు విగ్రహ ప్రతిష్టానకు సహకారం అందించాలని కోరారు. విగ్రహ ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎం.ఎల్.అనిల్ కుమార్ తమ నిధుల నుంచి రూ.10 లక్షలు అందించారన్నారు. దమనితుల సేవా సమితి సంస్థాపక అధ్యక్షుడు మేడిహాళ అంజినప్ప, నాగేష్, ప్రసన్న, మహేష్, అంబరీష్ పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి
కోలారు: కోలారు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం.నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి, కుమార స్వామిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమని కోముల్ డైరెక్టర్ చలువనహళ్లి నాగరాజ్ తెలిపారు. ఆదివారం తాలూకాలోని నరసాపురం పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన ఫిర్కా స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ సూచన మేరకు తాలూకాలోని అన్ని గ్రామాలకు వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఏపీఎంసీ మాజీ అధ్యక్షురాలు కుర్కి రాజుశ్వరి, వక్కలేరి సొసైటీ అధ్యక్షుడు పాలాక్షగౌడ, ఖాజి హరీష్ పాల్గొన్నారు.
లారీ డ్రైవర్ హత్య?
హోసూరు: బాగలూరు సమీపంలో లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా మరణించాడు. వివరాల మేరకు హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని బెళ్తూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ శివప్ప (40), ఇతనికి తాగుడు అలవాటుండేది. రెండు రోజుల క్రితం అతని మిత్రులు తేజు (32), దేవీరపల్లికి చెందిన రాజేష్ (35)లు కలిసి దేవీరపల్లి సమీపంలోని లేఔట్‌లో మద్యం తాగారు. శివప్ప ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతగ్గా, దేవీరపల్లి వద్ద తీవ్ర గాయాలతో శవమై కనిపించాడు. బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పరిశీలించి శవాన్ని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శివప్ప మిత్రుడు రాజేష్ పరారీలో ఉండడంతో మిత్రులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.


