● 8 మంది కూలీలకు గాయాలు
● చరకుంట సమీపంలో ఘటన
సాక్షి, బళ్లారి/బొమ్మనహాళ్: పనులు ముగించుకొని కూలీలతో తిరిగి వస్తున్న ఆటో బళ్లారి హైవేపైకి చేరుకోగానే టైరు పగిలి.. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటన బళ్లారి తాలూకా చరకుంట గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్‌కు చెందిన 26 మంది వ్యవసాయ కూలీలు గ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తికి చెందిన మహేంద్ర జీతో ఆటోలో బళ్లారి హైవే సమీపంలో వరినాట్లు వేయడానికి ఉదయం వెళ్లారు. పనులు ముగించుకొని మధ్యాహ్నం ఇమరాపురం వద్ద హైవేపై ఆటోలో వస్తుండగా, ఒక్కసారిగా ఆటో టైర్ పగిలిపోయి అదుపుతప్పి హైవేపై బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న కూలీలందరూ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో శివమ్మ, చిట్టి, గంగమ్మ, అక్కమ్మ, లక్ష్మీ, గోవిందు, కోక్కమ్మ, శివమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కూలీలను అంబులెన్స్‌లో బళ్లారి విమ్స్‌కు తరలించారు. 8 మంది కూలీలకు కాళ్లు, చేతులకు బలమైన గాయాలు కాగా.. బళ్లారి విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన కూలీలకు స్వల్ప గాయలయ్యాయి. ఈ ఘటనపై బళ్లారి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


