కోలారు: తాలూకాలోని తల్లీపిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా అత్యాధునిక హంగులతో కూడిన ఆస్పత్రిని నిర్మించి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. తాలూకా ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కె.వై.నంజేగౌడ తెలిపారు. ఆదివారం నగరంలో డాక్టర్ రమేష్ నిర్మించిన తల్లీపిల్లల ఆస్పత్రిని ప్రారంభించారు. నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయడానికి రూ.40 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.మంజునాథ్, హూడి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి
కోలారు: ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ నుంచి ఉద్యమ శీల కౌశల్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఎలాంటి షరతులు లేకుండా రుణ సౌలభ్యం అందింస్తాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ నామినీ డైరెక్టర్ డాక్టర్ నాగరాజ్ తెలిపారు. ఆదివారం నగరంలోని మారుతీ కాలనీలో శ్రీ సాయి ఆస్పత్రి వద్ద నాగరాజ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ శాఖ ద్వారా నిరుద్యోగ విద్యావంత యువతీ యువకులకు స్వయం ఉద్యోగం కల్పించడానికి కౌశల్యాభివృద్ది శిక్షణ ఇచ్చి ఉద్యమ శీల ప్రమాణ పత్రాలు అందజేస్తోందని పేర్కొన్నారు. సర్టిఫికెట్లు పొందిన యువతీ యువకులకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తబలా నారాయణప్ప, భైరేగౌడ, అంబరీష్, మంజునాథ్, సుబ్రమణి తదితరులు పాల్గొన్నారు.
పోలీసు ఇంట్లో చోరీ, దొంగల అరెస్టు
కెలమంగలం: డెంకణీకోటలో పోలీసు ఇంట్లో దోపిడీకి పాల్పడి కర్ణాటకలో దాగి ఉన్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టి సమీపంలోని పుదుపట్టి గ్రామానికి చెందిన ఉదయవాణన్, తళి పోలీస్‌స్టేషన్‌లో పోలీసుగా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులు ఇంటికి తాళాలు వేసి తాళం చెవిని ఇంటి వద్ద ఉంచి స్వగ్రామానికెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చిన ఉదయవాణన్‌కు బీరువాలో ఉన్న 6.5 పౌన్ల బంగారు నగలు, రూ. 23 వేలు నగదు కనిపించలేదు. డెంకణీకోట పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా డెంకణీకోట గిద్వాయ్ వీధికి చెందిన నవాస్, ప్రసాద్ వీధికి చెందిన యునేష్ నిందితులుగా గుర్తించారు. కర్ణాటకలో దాగి ఉన్నట్లు తెలుసుకొన్న పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు.


