యూకే మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్.. భారతదేశంలో తయారైన మోటార్‌సైకిల్ రైడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు.
బోరిస్ జాన్సన్ రైడ్ చేసిన బైక్ బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్ (BSA) బాంటమ్ మోటార్‌సైకిల్. ఒక విశాలమైన మైదానంలో ఆ మోటార్‌సైకిల్‌ను నడపడానికి ముందు, బీఎస్ఏ బాంటమ్‌ను ఆంగ్లో-ఇండియన్ సాంకేతిక సహకారానికి ఒక బలమైన ఉదాహరణగా అభివర్ణించారు.
ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. జాన్సన్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో తయారు చేస్తున్న బైక్‌ను.. ఆస్వాదిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బోరిస్ జాన్సన్ పేరులో, బీఎస్ఏలో మొదటి అక్షరాలు కలిసినట్లు ఉన్నాయని అన్నారు.
నిజానికి బీఎస్ఏ ఒక బ్రిటిష్ తయారీ సంస్థ. కానీ ప్రస్తుతం మహీంద్రా గ్రూప్ ఈ బ్రాండ్‌ను సొంతం చేసుకుని, జావా అండ్ యెజ్డీ మోటార్‌సైకిళ్లను కూడా తయారుచేసే క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీ ద్వారా నిర్వహిస్తోంది.
బీఎస్ఏ బాంటమ్ చరిత్ర
యూకేలో బీఎస్ఏ బాంటమ్ పేరుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అసలు మోటార్‌సైకిల్ 1948-1971 మధ్య తయారైంది. ఇది 123 సీసీ నుంచి 173 సీసీ వరకు ఇంజన్‌లతో లభించే తేలికపాటి టూ-స్ట్రోక్ మెషీన్‌గా ప్రసిద్ధి చెందింది.
అయితే.. బాంటమ్ బైక్ లేటెస్ట్ రోడ్‌స్టర్ మోడల్. ఇది 29 హార్స్ పవర్, 29 న్యూటన్ మీటర్ టార్క్ అందించే.. 344 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను పొందుతుంది. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడి.. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, ఏబీఎస్ వంటివి ఉన్నాయి. యూకేలో దీని ధర 3,499 పౌండ్ల (రూ.4.5 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది.
మేడ్ ఇన్ ఇండియా
BSAకు బ్రిటిష్ మూలాలు ఉన్నప్పటికీ, బాంటమ్ భారతదేశంలో తయారై అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతోంది. ఈ మోడల్ యూకే, యూరోపియన్ మార్కెట్లలో అమ్ముడవుతోంది, కానీ ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో లేదు. ఎందుకంటే.. ఇండియాలో BSA శ్రేణి మరింత పరిమితంగా ఉంది. ఇందులో గోల్డ్ స్టార్, 650 స్క్రాంబ్లర్ ఉన్నాయి. BSA యూకే, టర్కీ, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి మార్కెట్లలో కూడా తన ఉనికిని కలిగి ఉంది.
Thank you for the plug Mr. Johnson
We’re delighted to see you enjoying the bike we’ve resurrected & now build in India…
As long as you don’t want us to rechristen BSA as the ‘Boris Small Arms’ company…
🙂 pic.twitter.com/5GRLBmyD6K— anand mahindra (@anandmahindra) August 31, 2026


