ప్రకాశం జిల్లా: లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి రూ.లక్షల్లో వసూలు చేసి మోసగించిన వ్యవహారంలో యూట్యూబర్ రమానందనపై ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. మండలంలోని పేరాయిపాలేనికి చెందిన యు.శ్రీనివాసరావు కోడలికి లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని, ఇప్పటికే ఎంతోమందికి ఇప్పించానని యూట్యూబర్ రమానందన నమ్మబలికారు.
ఇందుకు రూ.10.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు తొలుత ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.లక్ష, అనంతరం రూ.9.50 లక్షల నగదు జమ చేశారు. ఎంతకాలమైనా ఉద్యోగం ఇప్పించకపోగా, కనీసం నగదు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో మోసపోయామని గ్రహించిన బాధితురాలి మామ శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు జూలై 4న ఆమెపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో యూట్యూబర్ రమానందనకు అద్దంకి పోలీసుస్టేషన్‌లో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలంటూ శుక్రవారం పోలీసులు నోటీస్ జారీ చేశారు.


