అప్పటి హౌస్ మ్యాపింగ్ ఆదేశాలు రద్దుచేయండి
కుటుంబం యూనిట్‌గా మ్యాపింగ్ చేయండి
లబ్ధిదారుల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా కలెక్టర్ల సదస్సులో సీఎం ఎత్తుగడ
పేదలను పెద్ద, చిన్న కుటుంబాలుగా వర్గీకరణ
పెద్ద కుటుంబాలకే సంక్షేమంలో ప్రాధాన్యత
రేషన్, పెన్షన్ల కోసం కుటుంబాలను విభజించడం సరికాదు
లబ్ధిదారులు తాగుడుకు అలవాటుపడుతున్నారేమో చూడండి
ప్రజా సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది
అధికారులు గైర్హాజరవడానికి ఎంత ధైర్యం?
వాట్సాప్ మెసేజ్‌లు చూస్తారుగానీ ఫైళ్లు చూడరా?
విద్యారంగంపై ప్రభుత్వ వ్యయం తగ్గించాలి
అలాగే, వైద్యరంగం బడ్జెట్‌లో రూ.5,000 కోట్లు తగ్గించాలి
సాక్షి, అమరావతి: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హౌస్ మ్యాపింగ్ పేరుతో పేదలకు ఇష్టానుసారం పెన్షన్లు, ఇళ్లు ఇచ్చేసిందని, డబ్బులు కూడా అలాగే ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. నాటి సర్కారు ఇచ్చిన హౌస్ మ్యాపింగ్ ఆదేశాలను వెంటనే రద్దుచేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త పెన్షన్ల జారీకి ముందే కుటుంబం యూనిట్‌గా మ్యాపింగ్ చేయాలన్నారు. తమ ప్రభుత్వం ఉమ్మడి, పెద్ద కుటుంబాలకే సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తుందని, చిన్న కుటుంబాలను వారి ఆర్థిక స్థితిని బట్టి మెరిట్ ఆధారంగా చూస్తామని ఆయన చెప్పారు. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆ కుటుంబానికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇదే ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగానే పాలసీలు, కార్యాచరణ ఉండాలని సీఎం తేల్చిచెప్పారు. రెండో రోజు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సునుద్దేశించి ముఖ్యమంత్రి వివిధ అంశాలపై మాట్లాడుతూ.. రేషన్, పెన్షన్లు, ఇళ్ల కోసం కుటుంబాలను చిన్న కుటుంబాలుగా విభజించడం సరికాదన్నారు. (అంటే.. పేద వర్గాలను పెద్ద, చిన్న కుటుంబాలుగా వర్గీకరిస్తూ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయాలనే ఎత్తుగడ సీఎం మాటల్లో స్పష్టంగా కనిపించింది). ఈ సమయంలో ఐఏఎస్ అధికారి కె. భాస్కర్ జోక్యం చేసుకుని ఒకే వ్యక్తి ఉన్న కుటుంబాలు 30 లక్షల యూనిట్లున్నాయని, వారికి ఇచ్చే ప్రయోజనాలకు హాని కలగకుండా చూడాలన్నారు.
దీనిపై సీఎం స్పందిస్తూ.. ఉన్న వారిని కొనసాగిస్తూనే కుటుంబం యూనిట్‌గా మ్యాపింగ్‌తో హేతుబద్దీకరణ చేయాలన్నారు. పెళ్లి చేసుకున్న జంటలకు రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రి నాదెండ్ల కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘రేషన్ కార్డులివ్వండి, అంతేగానీ.. దానికోసం కుటుంబాలను విడదీయవద్దని సూచించారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందించేలా చూడాలన్నారు. అవసరమైతే పది మంది గల పెద్ద కుటుంబాలకు ఒక కేజీ రేషన్ ఎక్కువ ఇవ్వాలన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
లబ్దిదారులు తాగుడుకు అలవాటుపడుతున్నారేమో చూడండి..
ప్రతీనెలా 1వ తేదీన పేదల సేవలో భాగంగా అందిస్తున్న డబ్బులను లబ్ధిదారులు సది్వనియోగం చేసుకుంటున్నారా లేక తాగుడుకు అలవాటు పడుతున్నారా చూడండి. గ్రామ, వార్డు సచివాలయాలకు ఒక్కో ఈవీ సైకిల్ ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది విధుల స్పష్టత కోసం జాబ్ ఛార్ట్ రూపొందించాలి. పీ–4 కార్యక్రమం మొక్కుబడిగా చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. సరిగ్గా పనిచేయని వారిని పక్కన పెట్టాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో అధికారులు నెలలో నాలుగుసార్లు గ్రామాలకు వెళ్లాలి. ఇంకా కొంతమంది కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడంలేదు. ఇందులో ఎవ్వరికీ మినహాయింపులేదు. దీనిని తేలికగా తీసుకుంటే కఠినంగా ఉంటాం. ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్నారు.
ఫోన్ లేకుండా రాలేరా?
ఏసీ రూమ్‌ల్లో కూర్చుని ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోకపోతే జెన్‌జీకే కాదు అందరికీ కడుపు మండుతుంది. అప్పుడు జెన్‌జీ లాంటి ఉద్యమాలు వస్తాయి. సరైన న్యాయం జరగలేదనిపిస్తే ఎవరైనా ప్రశ్నిస్తారు. ఫైళ్ల పరిష్కారంలో కొంతమంది మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు మూడ్రోజులకు పైగా సమయం తీసుకుంటున్నారు. వాట్సాప్ మెసేజ్‌లు చూస్తారు గానీ ఫైళ్లు చూడలేరా? ఫైళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలి. నెలరోజుల్లో భౌతిక ఫైళ్లకు ముగింపు పలకాలి. కొంతమంది శాఖాధిపతులు సమావేశానికి గైర్హాజరయ్యారు. వారికెంత ధైర్యం? ఫోన్ లేకుండా 12 గంటలు సమావేశానికి హాజరుకాలేరా? గైర్హాజరైన వారి నుంచి వివరణ తీసుకోండి. చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటా. ఇక ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలి.
విద్యారంగంపై ప్రభుత్వ వ్యయం తగ్గించాలి..
నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన అంతా కాగితాలకే పరిమితమైంది. విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలి. అలాగే, వైద్య రంగంలో సంజీవని పథకాన్ని అమలుచేయడం ద్వారా ఆ రంగం బడ్జెట్‌లో రూ.5,000 కోట్లు తగ్గించాలి. జిల్లా కలెక్టర్లు సోలార్‌రూఫ్ టాప్ పథకం ‘సూర్యఘర్’ ద్వారా ఎన్ని ఎక్కువ ఇన్‌స్టలేషన్లు చేయిస్తే విద్యుదుత్పత్తిపై అంత ఒత్తిడి తగ్గుతుంది.


