జూడో అసోసియేషన్ మాజీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కిరణ్ వెల్లడి
దీనిపై ఏడాది క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
తిరుపతి ఎడ్యుకేషన్: మెగా డీఎస్సీ 2025లో నకిలీ సర్టిఫికెట్ల స్కామ్ గురించి ఏడాది క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి హెచ్చరించినట్లు రాష్ట్ర జూడో సంఘం మాజీ జాయింట్ సెక్రటరీ చీనేపల్లి కిరణ్ ‘సాక్షి’కి వెల్లడించారు. అనుమానాస్పదంగా ఉండటంతో పలువురు అభ్యర్థుల పత్రాలను పరిశీలించగా నిర్ఘాంతపోయే వాస్తవాలు గుర్తించామన్నారు. జూడోతోపాటు ఇతర క్రీడలకు సంబంధించి పలువురు మెగా డీఎస్సీ అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లను సమర్పించారని గుర్తించడంతో గత ఏడాది సెప్టెంబరు 16న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
నకిలీ సర్టిఫికెట్ల బాగోతంపై జూడో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆనం రామకిషోర్‌రెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. జూడో సర్టిఫికెట్లు ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? మెరిట్ జాబితా ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద కోరినప్పటికి వెల్లడించేందుకు ‘శాప్’ నిరాకరించిందని, పైగా మెరిట్ జాబితాను వెబ్‌సైట్ నుంచి తొలగించిందని పేర్కొన్నారు.
నకిలీ సర్టిఫికెట్లు గుర్తించామని శాప్ చైర్మనే చెప్పారు
మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న వారిలో 880 మంది నకిలీ సర్టిఫికెట్లను గుర్తించామని శాప్ చైర్మన్ రవినాయుడు గతంలో మీడియాకు చెప్పారని కిరణ్ గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సమాచార హక్కు చట్టం ద్వారా ఆ నకిలీ సర్టిఫికెట్ల వివరాలను తాము కోరామన్నారు. శాప్ అధికారులు కేవలం 32 మాత్రమే నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారన్నారు. అభ్యర్థులు కరిష్మ, షేక్ ఇమామ్ హుస్సేన్, సూర్యానాయక్, శ్వేతారాణి జూడో నకిలీ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయగా మరో 28 మంది వివిధ క్రీడలకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేశారన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో విచారిస్తే పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

2014లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్
చాంపియన్‌షిప్‌లో విజేతలకు అందజేసిన ఒరిజినల్ పార్టిసిపేట్ అండ్ మెరిట్ సర్టిఫికెట్లు
శాప్ ఎండీ అవాస్తవాలు చెప్పారు..
శాప్ ఎండీ భరణి ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి జూడోకు సంబంధించి ఫేక్ సర్టిఫికెట్ల అంశంపై తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. జూడో నకిలీ సర్టిఫికెట్లతో పలువురు ఉద్యోగాలు పొందారని గత ఏడాది సెప్టెంబరు 16న లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు శాప్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫేక్ సర్టిఫికెట్ల రాకెట్‌ను ఛేదించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తేదీలు మార్చి ఫేక్ సర్టిఫికెట్లు..!
రాష్ట్రం విడిపోయాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్‌షిప్ పోటీలను 2014 నవంబరు 28, 29వ తేదీల్లో విజయవాడలో నిర్వహించారు. దీనికి సంబంధించి ఇచ్చిన సర్టిఫికెట్లు ఒరిజినల్ అని తెలిపారు. అయితే అదే వేదికపై 2014 నవంబరు 11 నుంచి 13వతేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించినట్లు నకిలీ సర్టిఫికెట్లను ప్రింట్ చేసి అప్పటి జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ నామిశెట్టి అమ్ముకున్నారని, ఇవే సర్టిఫికెట్లతో డీఎస్సీలో 28 మంది ఉద్యోగాలు సాధించారని ఆయన చెప్పారు.


