సరిగమల్లో నవ మాసాలు | Carnatic vocalist Divyalakshmi Explanations of Music lessons for expectant moms | Sakshi
Sakshi News home page

సరిగమల్లో నవ మాసాలు

Nov 6 2025 3:30 AM | Updated on Nov 6 2025 4:48 AM

 Carnatic vocalist Divyalakshmi Explanations of Music lessons for expectant moms

ట్రెండ్‌

స్త్రీ గర్భం దాల్చాక శిశు జననం వరకూ  ఎన్నో ఆనంద ఘడియలు, అన్నే ఆందోళనలు. తల్లి ఆరోగ్యమూ, బిడ్డ ఆరోగ్యమూ కాపాడుకోవాలి. తల్లితో లోపలి బిడ్డ బంధం బలపడాలి. ఇవన్నీ సంగీతం వల్ల సాధ్యమవుతాయంటోంది చెన్నైకి చెందిన మ్యూజిక్‌ టీచర్‌ దివ్యలక్ష్మి. గర్భం దాల్చిన తల్లులకు శాస్త్రీయ సంగీతం నేర్పేందుకు దివ్య తయారు చేసిన ఆరు నెలల కోర్సుకు కాబోయే తల్లులు సరిగమలతో బదులిస్తున్నారు. వివరాలు...

దివ్యలక్ష్మి కమలాకన్నన్‌కు ఈ ఐడియా తన కూతురిని చూశాక వచ్చింది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో బీటెక్‌ చదివి ఆ తర్వాత బాల్యం నుంచి నేర్చుకుంటున్న కర్నాటక సంగీతంలోనే తన జీవితాన్ని నిమగ్నం చేయాలని నిశ్చయించుకున్న దివ్య లక్ష్మి మెడ్రాస్‌ యూనివర్సిటీ నుంచి సంగీతంలో పట్టా తీసుకుంది. ఆ తర్వాత సౌత్‌ చెన్నైలో ఆమె ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇవ్వడమే కాక అక్కడి కిల్‌పార్క్‌ గార్డెన్‌లో ‘ఆరోహణ’ పేరుతో సంగీత పాఠశాల నెలకొల్పింది. కర్నాటక, హిందూస్తాని, ఇన్‌స్ట్రుమెంటల్‌ సంగీతాలలో ఇక్కడ శిక్షణ ఇస్తూ గుర్తింపు పొందిన దివ్యలక్ష్మి లాక్‌డౌన్‌ రావడంతో డీలా పడింది. ఇన్‌స్టిట్యూట్‌ మూసేసింది. ఆ సమయానికి ఆమె గర్భంతో ఉంది. ఇంట్లో తనే సంగీత సాధన చేస్తూ వెళ్లింది.

కుమార్తె ఆరోహి పుట్టాక ఆ పాప ఒకటిన్నర సంవత్సరాల వయసుకే విపరీతంగా జ్ఞాపకశక్తి ప్రదర్శించడం దివ్యలక్ష్మికి ఆశ్చర్యం కలిగించింది. మూడున్నరేళ్లు వచ్చేసరికి ఆరోహి వయొలిన్‌ చేత పట్టుకుని సరిగమలు పలికించడం ఇంకా సంతోషపెట్టింది. ఆరోహి తన కడుపులో ఉన్నప్పుడు తాను సాధన చేసిన శాస్త్రీయ సంగీతం పాప తెలివితేటల ఎదుగుదలకు ఉపయోగపడిందని దివ్యలక్ష్మికి అనిపించింది. గర్భవతులకు శాస్త్రీయ సంగీతం నేర్పిస్తే, వారు డెలివరీ అయ్యేంత వరకు శాస్త్రీయ సంగీతం వింటూ ఉంటే పుట్టబోయే బిడ్డకు అన్ని విధాలా ఉపయోగమని అర్థం చేసుకుంది. ఈ విషయాన్ని మరింతగా నిర్థారించుకోవాలని నిశ్చయించుకుంది.

మ్యూజిక్‌ థెరపీ
కొన్ని అధ్యయనాల ప్రకారం మ్యూజిక్‌ థెరపీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి, గుండె స్పందనలకు బాగా పని చేస్తుందని నిర్థారితమైంది. సంగీతం గర్భిణుల్లో ఉండే యాంగ్జయిటీ, లో–బీపీ వంటి సమస్యలను దూరం చేయగలదని స్వీయ పరిశీలన ద్వారా అర్థం చేసుకున్న దివ్యలక్ష్మి తమ కాలనీలో ఉన్న నలుగురైదుగురు గర్భవతులకు ప్రయోగాత్మకంగా శాస్త్రీయ సంగీతం నేర్పించసాగింది. వారికి ఆ పాఠాలు ఆహ్లాదం కలిగించడమే కాదు ప్రసవాలు కూడా కాంప్లికేషన్స్‌ ఎదురవకుండా జరిగాయి. దాంతో ఆరునెలల కోర్సు తయారు చేసిన దివ్యలక్ష్మి మళ్లీ సంగీత పాఠశాల తెరిచి ఇప్పుడు గర్భిణులకు సంగీత పాఠాలు చెబుతోంది.
ఆమె దగ్గర నేర్చుకోలేకపోయినా, ఉన్నచోట నేర్చుకోలేకపోయినా, గర్భిణులు తరచూ ఆహ్లాదపరిచే సంగీతం వినడం, మంచి పాటలు హమ్‌ చేసుకుంటూ ప్రశాంతంగా గడపడం వల్ల మాత్రం కచ్చితంగా మేలు జరుగుతుంది.

నాదమే వైద్యం
‘సంగీతంలో నాదం ఉంటుంది. ఆ నాదం గర్భిణీ స్త్రీ శరీరంలోని నీటిలో అనునాదం పుట్టిస్తుంది. ఆమె ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడమే కాకుండా పిండస్థ శిశువు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతే కాదు... ఇలా సంగీత పాఠాల కోసం వచ్చే గర్భిణుల మధ్య ఒక స్నేహం ఏర్పడి ఒకరికొకరు అన్నట్టుగా ఉండటంతో ఆందోళనలు పూర్తిగా పోతాయి’ అంటోంది దివ్యలక్ష్మి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement