శ్వాస తీరుకు, మెదడు తరంగాలకు మధ్య బలమైన అనుసంధానం
జ్ఞాపకశక్తి, భావోద్వేగాలపై ఉచ్ఛా్వస–నిశ్వాసాల ప్రత్యక్ష ప్రభావం
ప్రాణాయామం లేదా శ్వాస నియంత్రణకు రుజువులు వెతికిన పరిశోధకులు
యూసీ శాన్ డియాగో పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి
మనం శ్వాస ద్వారా పీల్చుకునే గాలి ప్రాణాన్ని నిలబెట్టటమే కాకుండా, మెదడు పనితీరును అనుక్షణం నియంత్రిస్తుందని సరికొత్త శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైంది. తీసుకునే ప్రతి శ్వాసకూ మెదడులోని విద్యుత్ తరంగాల రూపకల్పనతో విడదీయరాని అనుబంధం ఉంటుందని, ప్రతి శ్వాస మెదడుపై ఒక ప్రత్యేక ముద్రను (న్యూరల్ సిగ్నేచర్) వేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయా శాన్ డియాగో పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు ప్రతిష్టాత్మక ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్’లో ప్రచురితమయ్యాయి.
శ్వాస తరంగాల రూపమే కీలకం
సాధారణంగా వైద్య రంగంలో ఒక వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారనే లెక్కను మాత్రమే పరిశీలిస్తుంటారు. అయితే, ఈ విధానం వల్ల ఎంతో కీలకమైన సమాచారం వెలుగులోకి రాకుండా పోతోందని పరిశోధకులు స్పష్టం చేశారు. మనం శ్వాస పీల్చుకునే లోతు, విడిచిపెట్టే వేగం, శ్వాసల మధ్య ఉండే కొన్ని మిల్లీసెకన్ల విరామం.. ఇలా ప్రతి మార్పూ ఒక ప్రత్యేక తరంగంలా ఏర్పడుతుంది. శ్వాస తరంగాల్లోని ఈ సూక్ష్మ తేడాలు మెదడు కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు.
పరిశోధన సాగిందిలా..
ఔషధాలకు లొంగని మూర్ఛ వ్యాధి (ఎపిలెప్సీ) చికిత్స కోసం నిరంతర పర్యవేక్షణలో ఉన్న 16 మంది రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వారి మెదడు భాగాల్లో అమర్చిన అధునాతన ఎలక్ట్రోడ్ల ద్వారా న్యూరల్ యాక్టివిటీ వివరాలను సేకరించారు. అదే సమయంలో వారు ముక్కు ద్వారా పీల్చుకునే గాలి ప్రవాహం, ఛాతీ, పొట్ట కదలికలను సెన్సర్ల సాయంతో రికార్డు చేశారు. ఈ డేటాను సరిపోల్చగా, శ్వాస రూపం మారిన ప్రతిసారీ మెదడులోని సంకేతాలు కూడా దానికి తగినట్లుగా రూపాంతరం చెందుతున్నట్లు స్పష్టమైంది.
జ్ఞాపకశక్తి, భావోద్వేగాలతో ప్రత్యక్ష లింకు
మెదడులో ఆలోచన, ప్రవర్తన, భావోద్వేగాలు, జ్ఞాపకశక్తిని నియంత్రించే కేంద్రాలపై ఈ శ్వాస తీరు నేరుగా ప్రభావం చూపుతోందని పరిశోధకుల బృందం నాయకురాలు డా. ఈనా కోసిక్–రోస్ తెలిపారు. శ్వాస తీసుకునే సమయంలో మెదడు సమాచారాన్ని గ్రహించే విధానం, శ్వాస వదిలే సమయంలో స్పందించే తీరు భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలను నియంత్రించటానికి ప్రాణాయామం లేదా శ్వాస నియంత్రణ పద్ధతులు ఎందుకు అద్భుతంగా పనిచేస్తాయనే దానికి ఈ ఫలితాలు శాస్త్రీయ ఆధారాన్ని చూపుతున్నాయి.
ఆకస్మిక మరణాలకు అడ్డుకట్ట
ఈ పరిశోధన ఫలితాలు ప్రాణాంతక సమస్యలను ముందస్తుగా గుర్తించేందుకు దోహదపడతాయని శాస్త్రవేత్త డా. బ్రాడ్లీ వాయిటెక్ పేర్కొన్నారు. మూర్ఛ వ్యాధిగ్రస్తుల్లో ఆకస్మిక మరణాలు, పసిపిల్లల్లో నిద్రలోనే శ్వాస ఆగి చనిపోయే సడెన్ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్ వంటి ప్రమాదాలను విశ్లేషించేందుకు ఇది ఉపయోగపడుతుంది. శ్వాస ఆగిపోవటానికి ముందు మెదడు సంకేతాల్లో చోటుచేసుకునే మార్పులను విశ్లేషించి ప్రాణాలను కాపాడే వైద్య పరికరాల రూపకల్పనకు ఈ ఆవిష్కరణ మార్గం సుగమం చేయనుంది.
– సాక్షి, స్పెషల్ డెస్క్


