సాక్షి,న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ నిర్ధారణపై శుక్రవారం (నవంబర్ 06న) సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ ఏడాది మార్చి 11న ఇచ్చిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్. మాహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన సంచలన తీర్పుపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన వివరణ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పిచ్చింది. ఈ తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా ఉద్యోగులు, అభ్యర్థుల్లో నెలకొన్న తీవ్ర గందరగోళానికి తెరపడింది.
మార్చి 11న ఇచ్చిన తీర్పు వల్ల గతంలో ఎప్పుడో పూర్తయిన నియామకాలు, ఎంపికలు, పదోన్నతులు, సీనియారిటీ జాబితాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సుప్రీంకోర్టు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్. మాహదేవన్ ధర్మాసనం స్పష్టం చేసింది. పాత నియామకాలను తిరగరాయడానికి ఈ తీర్పును కారణంగా చూపరాదని తేల్చిచెప్పింది. దీంతో ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వేలాది మంది ఉద్యోగులకు పూర్తి రక్షణ లభించినట్టయింది. అలాగే వివిధ కోర్టులు, ట్రిబ్యునళ్లలో పెండింగ్‌లో ఉన్న ఇలాంటి కేసులను సంబంధిత న్యాయస్థానాలు వాటి మెరిట్స్ ఆధారంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొంది.
సివిల్ సర్వీసెస్ - 2025 అభ్యర్థులకు కొత్త రూల్స్
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష-2025 ద్వారా ఎంపికైన 958 మంది అభ్యర్థులకు సర్వీసులు (ఐఏఎస్,ఐపీఎస్ మొదలైనవి) కేటాయించే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని కోర్టు గుర్తుచేసింది. ఈ కేటాయింపు ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నందున, వీరికి మాత్రం తాజా మార్గదర్శకాల ప్రకారమే (క్రీమీ లేయర్ నిర్ణయానికి జీతంతో పాటు హోదాను కూడా పరిగణలోకి తీసుకునే విధానం) ఓబీసీ క్రీమీ లేయర్ నిబంధన వర్తిస్తుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
క్రీమీ లేయర్ లెక్కించే విధానంపై స్పష్టత
ఇకపై క్రీమీ లేయర్‌ను నిర్ణయించేటప్పుడు కేవలం తల్లిదండ్రుల జీతాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడానికి వీల్లేదని కోర్టు పునరుద్ఘాటించింది. జీతంతో పాటు వారు పనిచేసిన ఉద్యోగ హోదా, పోస్ట్ కేటగిరీ కూడా కీలకమని స్పష్టం చేసింది. 1993 నాటి కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ మెమోరాండం ప్రకారమే ఇది అమలవ్వాలని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ
ప్రభుత్వ ఉద్యోగాలతో సమానమైన హోదాలను పీఎస్‌యూలు, బ్యాంకులు, ప్రైవేటు సంస్థల్లో గుర్తించేందుకు రెండేళ్ల గడువు కావాలని కేంద్రం కోరినప్పటికీ, దానికి నిర్దిష్ట గడువు పెట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు, చట్టాల రూపకల్పన పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, చట్టసభల పరిధిలోని అంశాలని స్పష్టం చేస్తూ, ఓబీసీ క్రీమీ లేయర్‌పై కొత్త పాలసీని రూపొందించుకునే పూర్తి స్వేచ్ఛ కేంద్రానికి ఉందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే
కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు అనుసరిస్తున్న నిబంధనల వల్ల తమకు ఓబీసీ ‘నాన్-క్రీమీ లేయర్’ సర్టిఫికెట్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు మద్రాస్ కోర్టును ఆశ్రయించారు. సివిల్ సర్వీసెస్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఓబీసీ రిజర్వేషన్లు పొందేందుకు అభ్యర్థులు అర్హులారా కాదా అని తేల్చేటప్పుడు.. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, తల్లిదండ్రుల జీతం ఒక నిర్దిష్ట పరిమితిని దాటితే వారిని క్రీమీ లేయర్ కిందకు చేర్చి రిజర్వేషన్లకు అనర్హులుగా ప్రకటిస్తున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలు,ప్రైవేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలను, ప్రభుత్వంలోని గ్రూప్-ఎ, గ్రూప్-బి అధికారులతో సమానంగా అంచనా వేసే విషయంలో అధికారులు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని, కేవలం జీతం ఆధారంగానే తమను క్రీమీ లేయర్‌లోకి నెట్టి రిజర్వేషన్లు నిరాకరిస్తున్నారని అభ్యర్థులు వాదించారు. ఈ విధానం అన్యాయమని, ఇది ప్రాథమిక నిబంధనలకు విరుద్ధమని మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల ద్వారా సివిల్ సర్వీసెస్, ఇతర కేంద్ర సేవల కేటాయింపునకు సంబంధించి రిజర్వేషన్ ప్రయోజనాలు కోల్పోయిన కొందరు అభ్యర్థులు (ఉదాహరణకు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రోహిత్ నాథన్ (ఐపీఎస్)కేసు తదితరులు) సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, చెన్నై బెంచ్‌ను ఆశ్రయించారు. అక్కడ ప్రతికూల తీర్పు రావడంతో.. ఆ అభ్యర్థుల తరఫున,కేంద్ర ప్రభుత్వం దీనిపై పరస్పరం మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. హైకోర్టు ఆ పిటిషన్లను విచారించి, జీతాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం చెల్లదని అభ్యర్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఆ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్పష్టత నిచ్చింది.
ఇదీ చదవండి: తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సుప్రీంకోర్టు అల్టిమేటం


