జైల్లో కూడా అప్పిరెడ్డిని కూటమి సర్కార్‌ వేధిస్తోంది: వైఎస్సార్‌సీపీ | Ysrcp Leaders Meet Mlc Lella Appi Reddy In Guntur Jail | Sakshi
Sakshi News home page

జైల్లో కూడా అప్పిరెడ్డిని కూటమి సర్కార్‌ వేధిస్తోంది: వైఎస్సార్‌సీపీ

Nov 12 2026 12:53 PM | Updated on Nov 12 2026 1:13 PM

Ysrcp Leaders Meet Mlc Lella Appi Reddy In Guntur Jail

సాక్షి, గుంటూరు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైల్లో పెట్టారని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(గురువారం) లేళ్ల అప్పిరెడ్డితో వైఎస్సార్‌సీపీ నేతలు ములాఖత్‌ అయ్యారు. గుంటూరు జైల్లో ఆయన్ని పరామర్శించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పరిషత్‌ ఎన్నికల సమయంలో లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసు పెట్టారని.. అన్యాయమైన కేసులో అప్పిరెడ్డిని చంద్రబాబు సర్కార్‌ ఇరికించిందని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి తప్పుడు సెక్షన్లు పెట్టారు. పోలింగ్‌ బూత్‌ నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌ను తీసుకొస్తున్న బ్యాలెట్‌ బాక్స్‌ను మార్గ మధ్యలో అధికారులు ఎందుకు దించారు?. వెంగళాయపాలెంలో ఓటమి భయంతో కూటమి కుట్రలు చేసింది. రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నికలు జరగలేదు. కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. 2029లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం  తథ్యం. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిన అధికారులకు రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇస్తాం’’ అని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు.

అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడతారా?: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్సుల్లో నల్లపాడు వద్ద ఒక బాక్స్ దించేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి పోలింగ్ సిబ్బందిని ప్రశ్నించారు. ఆ తర్వాత అప్పిరెడ్డి అక్కడకు చేరుకున్నారు. నిరసన చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అప్పిరెడ్డి పై లాఠీ ఛార్జ్‌ చేశారు. అప్పిరెడ్డి పై రేప్, మర్డర్ కేసు తప్ప అన్ని సెక్షన్ల కింద కేసు పెట్టారు.

బ్యాలెట్ బాక్సులు పక్కదారి పట్టిస్తున్నవారి పై కేసులు పెడతారా?. అక్రమాలను ప్రశ్నించిన వారి పై కేసులు పెడతారా?. ఈ ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. చిన్న గొడవ అని చెప్పి అనేక రకాల కేసులు పెట్టారు. రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోకతప్పదు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా 2029లో వైఎస్సార్‌సీపీ గెలుపును ఆపలేరు. వైఎస్‌ జగన్‌ సీఎం అవ్వడం ఖాయం

కక్ష పూరితంగా అక్రమ కేసు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
ఈ ప్రభుత్వం అప్పిరెడ్డిని కేసుల్లో ఇరికిద్దామని రెండున్నరేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు కక్ష పూరితంగా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారు. బ్యాలెట్ బాక్సులకు భద్రత కల్పించలేని పోలీసులపై కేసులు పెట్టాలి. బ్యాలెట్ బాక్సులు పక్కదారి పట్టించిన ఎన్నికల సిబ్బంది పై కేసులు పెట్టాలి. కానీ అక్రమాన్ని ప్రశ్నించిన అప్పిరెడ్డి పై కేసు పెట్టారు. ప్రజా వ్యతిరేకత వచ్చిందని కూటమి నేతలకు అర్థమైపోయింది. అందుకే నామినేషన్ల వేసిన దగ్గర్నుంచి చేయని దుర్మార్గాలు లేవు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. 2029లో వైఎస్ జగన్‌ సీఎం అవుతారు. అక్రమాలు, అన్యాయాలు చేసిన అధికారులకు చట్ట ప్రకారం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ప్రతీ ఒక్కరికీ బుద్ధి చెప్పడం ఖాయం.

ఇప్పటివరకూ ఒక్కరైనా  సమాధానం చెప్పారా?: అంబటి రాంబాబు
ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారు. అప్పిరెడ్డికి రక్షణ కల్పించలేనని జైలు సూపరింటెండెంట్ లెటర్ రాశారు. రక్షణ కల్పించలేకపోతే మీరెందుకు గుడ్డి గుర్రం పళ్లు తోముతారా? బ్యాలెట్ బాక్సు ఎందుకు బస్సులో నుంచి కిందకు దించారు?. బ్యాలెట్ బాక్సు వెంట పోలీసులు ఎందుకు లేరు. ఇప్పటివరకూ ఒక్కరైనా  సమాధానం చెప్పారా?. పట్టాభిపురం సిబ్బంది గంగా వెంకటేశ్వర్లుపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నా. బ్యాలెట్ బాక్సు పగలగొట్టి రిగ్గింగ్ కు పాల్పడిన టీడీపీ వారిపై కేసులు లేవు. తన సామాజిక వర్గానికి చెందిన కొమ్మినేని కోటేశ్వరరావుకు మేలు చేయాలని సీఐ ప్రయత్నించారు.

ఖాకీ బట్టలేసుకున్న పోలీసులకు కులపిచ్చేంటి?. కోయ ప్రవీణ్, చెరుకూరి శ్రీధర్, గంగా వెంకటేశ్వర్లు, వంశీ కులపిచ్చితో కొట్టుకుచస్తున్నారు. 2029లో కచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. మా రియాక్షన్‌ను మీరు తట్టుకోలేరు. అప్పిరెడ్డికి జైల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. రెండు బారికేడ్ల అవతల అప్పిరెడ్డిని చూపించారు. గుంటూరు జైల్లో చాలా ప్రత్యేకమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. చట్టం ప్రకారం ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి కల్పించవలసిన సౌకర్యాలు కూడా కల్పించలేదు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల్లోనూ పచ్చ కుట్రలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement