సాక్షి, విజయవాడ: మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి సర్కార్.. పంచాయతీ ఎన్నికల్లోనూ కుట్రలకు తెరలేపింది. అడ్డగోలుగా నామినేషన్ కేంద్రాలను టీడీపీ నేతలు మార్పిస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి పట్టున్న గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమాలు చేయడానికి పచ్చ ముఠా బరితెగిస్తోంది.
రానున్న గ్రామ పంచాయతీల ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అధికారులు ఇష్టారాజ్యంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుండటంపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటానికి దిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లను ఆయా గ్రామాల హెడ్ క్వార్టర్లలోనే స్వీకరించడం ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తోంది. కానీ ఎలాంటి తగిన కారణాలు చూపకుండా, నామినేషన్ కేంద్రాలను ఇష్టమొచ్చిన చోటుకు మారుస్తూ ఎంపీడీవోలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీంతో అభ్యర్థులు, ప్రతిపాదకులు దూర ప్రాంతాల నుంచి ఎంపీడీవోలు నిర్ణయించిన చోటుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఎక్కడ ఉండాలన్న దాన్ని నిర్ణయించే అధికారం ఎంపీడీవోలకు లేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈ అధికారం రిటరి్నంగ్ అధికారికి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీడీవోల ఏకపక్ష నిర్ణయాలను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి విచారణ జరిపారు.
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను నిర్ణయించే అధికారం ఎంపీడీవోలకు లేదన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలో రిటరి్నంగ్ అధికారులకు నిర్ధేశిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన హ్యాండ్ బుక్‌లోని మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఫాం1 నోటీసు జారీ చేసే సమయంలోనే నామినేషన్ కేంద్రాలను ప్రకటించాలని రిటరి్నంగ్ అధికారులకు స్పష్టం చేశారు.
అంతకు ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వీఆర్‌రెడ్డి కొవ్వూరి, సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను, ఆయా గ్రామాల స్థానిక కార్యాలయాల నుంచి మార్చి, రాయచోటి మండల కేంద్రానికి కేంద్రీకరిస్తూ ఎంపీడీవో ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చారని వీఆర్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదే రీతిలో పెండ్లిమర్రి మండలం, మచనూరు గ్రామం నుంచి నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మొయిలకల్వ గ్రామానికి మార్చారని రామలక్ష్మణరెడ్డి వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, నామినేషన్ల స్వీకరణ కేంద్రాల నిర్ణయం విషయంలో రిటరి్నంగ్ అధికారులు తమకు ఇచ్చిన హ్యాండ్‌బుక్ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: సజావుగా జరిగితే ప్రభంజనమే


