దేశంలో నిరుద్యోగితలో ఏపీ రెండోస్థానం
జాతీయస్థాయిని మించి ఏపీలో నిరుద్యోగిత
జాతీయస్థాయిలో 5.1 శాతం.. ఏపీలో 7.8 శాతం
మహిళల్లో 9.6 శాతం.. పురుషుల్లో 6.8 శాతం నిరుద్యోగులే
జూలై–సెప్టెంబర్ లేబర్ ఫోర్స్ సర్వే బులిటిన్ వెల్లడి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో మన రాష్ట్రం నిరుద్యోగితలో దేశంలోనే రెండోస్థానంలో ఉంది. నిరుద్యోగితలో మన రాష్ట్రం 7.8 శాతంతో కేరళం తరువాత స్థానంలో ఉంది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగిత గణాంకాలను లేబర్ ఫోర్స్ సర్వే బులెటిన్ వెల్లడించింది. దీన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలుశాఖ బుధవారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగిత జాతీయస్థాయిని మించి ఉందని ఆ బులెటిన్ తెలిపింది. జాతీయస్థాయిలో నిరుద్యోగిత 5.1 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 7.8 శాతం ఉందని పేర్కొంది.
ఆ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళల్లో నిరుద్యోగిత శాతం ఎక్కువగా ఉంది. నిరుద్యోగిత పురుషుల్లో 6.8 శాతం ఉండగా.. మహిళల్లో 9.6 శాతం ఉంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల్లోనే నిరుద్యోగిత ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 7.8 శాతం ఉన్న నిరుద్యోగిత పట్టణ ప్రాంతాల్లో 8.0 శాతం ఉంది. పురుషుల నిరుద్యోగిత పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉండగా.. మహిళల నిరుద్యోగిత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. నిరుద్యోగ పురుషులు గ్రామీణ ప్రాంతాల్లో 6.6 శాతం మంది ఉండగా పట్టణ ప్రాంతాల్లో 7.3 శాతం మంది ఉన్నారు.
నిరుద్యోగ మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో 9.7 శాతం మంది ఉండగా పట్టణ ప్రాంతాల్లో 9.5 శాతం మంది ఉన్నారు. 2024లో జరిగిన ఎన్నికల ముందు చంద్రబాబు నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లేదంటే అప్పటివరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 29 నెలలైనా ఆ హామీని అమలు చేయలేదు. ఉద్యోగాలు కల్పించకపోగా నిరుద్యోగభృతికి ఎగనామం పెట్టారు. దీంతో రాష్ట్రంలో యువతీ, యువకులకు ఉపాధి లభించక నిరుద్యోగిత పెరిగిపోతోంది.



