ఏడడుగుల బంధం.. ఎన్నో అడుగుల దూరం | Andhra Pradesh Divorce Rate and Marital Separation Statistics 2026 | Sakshi
Sakshi News home page

ఏడడుగుల బంధం.. ఎన్నో అడుగుల దూరం

Nov 12 2026 9:59 AM | Updated on Nov 12 2026 10:02 AM

Andhra Pradesh Divorce Rate and Marital Separation Statistics 2026

పెళ్లి బంధానికి పెరుగుతున్న దూరం   

పెళ్లయినా విడిగా జీవిస్తున్నవారే మూడు రెట్లు అధికం 

ఏపీలో 2.36 శాతం మహిళల్లో వైవాహిక బంధాల విచ్ఛిన్నం.. జాతీయ సగటు 1.50 శాతం 

మూడేళ్లలో ఫ్యామిలీ కోర్టుల్లో 21,305 కేసులు  

సెలబ్రిటీల జీవితాల్లోనూ విడాకుల ప్రభావం 

పేరు, ప్రఖ్యాతులు, రూ.కోట్ల ఆస్తులున్నా నిలవని బంధాలు  

సాక్షి, అమరావతి: వివాహ బంధం.. ఒకప్పుడు జీవితాంతం కొనసాగాల్సిన అనుబంధంగా భావించేవారు. కుటుంబ గౌరవం, పిల్లల భవిష్యత్, సామాజిక కట్టుబాట్లు, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎన్నో సమస్యలను భరిస్తూ దాంపత్య జీవితాన్ని కొనసాగించేవారు. కానీ.. కాలంతోపాటు ఆలోచనా విధానాలూ మారుతున్నాయి. ఆత్మగౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన, సమానత్వానికి ప్రాధాన్యం పెరుగుతోంది. పరస్పర అవగాహన లేని బంధంలో కొనసాగడం కంటే విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి కొందరు వస్తున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పరిణామం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ వైవాహిక బంధాల విచ్ఛిన్నానికి సంబంధించిన గణాంకాలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడిస్తున్నాయి. 

ఏపీలో విడాకులు 0.54 శాతం 
ముంబైలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌) పరిశోధకులు హరిహర్‌ సాహూ తదితరులు రూపొందించిన ‘మారిటల్‌ డిసల్యూషన్‌ ఇన్‌ ఇండియా: ప్యాటరన్స్‌ అండ్‌ కొరిలేట్స్‌’ పేరిట దేశవ్యాప్తంగా 5,11,604 మంది, ఏపీకి సంబంధించి 21,585 మంది మహిళలపై అధ్యయనం జరిపింది. ఏపీలో 15–49 ఏళ్ల వయసున్న.. గతంలో వివాహమైన మహిళల్లో 2.36 శాతం మంది వైవాహిక బంధాల విచ్ఛిన్నాన్ని ఎదుర్కొన్నారు. వీరిలో చట్టబద్ధంగా విడాకులు పొందినవారు 0.54 శాతం కాగా.. విడిగా జీవిస్తున్న వారు 1.82 శాతం. అంటే విడాకులు తీసుకున్న వారికంటే విడిగా ఉంటున్న వారిసంఖ్య మూడు రెట్లకు పైగా ఉంది. జాతీయ స్థాయిలో ఈ రెండు కేటగిరీల ఉమ్మడి వాటా 1.50 శాతం కాగా.. దక్షిణాది సగటు 2.30 శాతంగా నమోదైంది. తమిళనాడులో 2.46 శాతం, తెలంగాణలో 2.49 శాతం, కేరళలో 2.14 శాతం, కర్ణాటకలో 2.05 శాతంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో వైవాహిక బంధాల విచ్ఛిన్నం అధికంగా నమోదైంది. మిజోరంలో 9.25 శాతం, మేఘాలయలో 6.74 శాతంగా ఉంది. పేద కుటుంబాల్లో ఈ వాటా 1.7 శాతం ఉండగా, అత్యంత సంపన్న కుటుంబాల్లో 1 శాతంగా నమోదైంది.  

పదేళ్లలో తగ్గిన భాగస్వామి లేని జనాభా 
కేంద్ర ప్రభుత్వ నమూనా నమోదు వ్యవస్థ (ఎస్‌ఆర్‌ఎస్‌) 2024 నివేదిక ప్రకారం.. దేశ జనాభాలో వితంతువులు, విడాకులు పొందినవారు, విడిగా జీవిస్తున్నవారి ఉమ్మడి వాటా 2014లో 4.1 శాతం ఉండగా.. 2024లో 3.5 శాతానికి తగ్గింది. అయితే, మహిళల్లో ఈ వాటా 5.4 శాతం కాగా, పురుషుల్లో 1.6 శాతమే. ఏపీలో ఇదే వాటా 2014లో 5.2 శాతం ఉండగా, 2024లో 5 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో కుటుంబ వివాదాల తీవ్రతకు ఫ్యామిలీ కోర్టుల గణాంకాలు మరో కోణాన్ని చూపుతున్నాయి. రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలో 15 ఫ్యామిలీ కోర్టులు పనిచేస్తున్నాయి. వీటిలో ఏటా 10 వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి.  

సెలబ్రిటీల జీవితాల్లోనూ విడాకుల తుపాను 
పేరు, ప్రఖ్యాతులు, రూ.కోట్ల విలువైన ఆస్తులు ఉన్నా వైవాహిక బంధాలకు భరోసా ఉండటం లేదు. సినీరంగం నుంచి క్రీడా రంగం వరకు పలువురు ప్రముఖులు విడాకుల బాటపట్టారు. బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్, సుసానే ఖాన్‌ 2014లో విడాకులు తీసుకున్నారు. అమీర్‌ఖాన్, రీనా దత్తా 2002లో విడిపోయారు. అనంతరం కిరణ్‌రావుతో అమీర్‌ఖాన్‌ వైవాహిక బంధానికి 2021లో ముగింపు పలికారు. సైఫ్‌ అలీఖాన్‌–అమృతా సింగ్, ఫర్హాన్‌ అఖ్తర్‌–అధునా భబానీ, కరిష్మా కపూర్‌–సంజయ్‌ కపూర్‌ జంటలు కూడా విడాకులు తీసుకున్నాయి. 

హాలీవుడ్‌ నటులు బ్రాడ్‌ పిట్, ఏంజెలీనా జోలీ విడాకుల ప్రక్రియను 2024లో ముగించారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, అన్నా లెజినోవా తమ బంధానికి ముగింపు పలికారు. క్రీడా రంగంలోనూ ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్, అయేషా ముఖర్జీకి 2023లో విడాకులు మంజూరయ్యాయి. యుజ్వేంద్ర చాహల్‌–ధనశ్రీ వర్మ 2025లో విడాకులు తీసుకున్నారు. టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ విడిపోయారు. హార్దిక్‌ పాండ్యా–నటాషా స్టాంకోవిక్‌ 2024లో విడిపోతున్నట్టు ప్రకటించారు. 

మహిళలపై ఆర్థిక, మానసిక ప్రభావం 
2025లో ‘మ్యారేజ్‌ అండ్‌ ఫ్యామిలీ రివ్యూ’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన 22 అధ్యయనాలను సమీక్షించింది. గృహహింస, వరకట్న వేధింపులు, పితృస్వామ్య ధోరణులు, భార్యాభర్తల మధ్య సంభాషణ లోపించడం వంటి అంశాలను వైవాహిక సమస్యలకు సంబంధించిన ముఖ్యాంశాలుగా గుర్తించింది. విడాకుల అనంతరం మహిళలు మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల సంరక్షణ, సామాజిక వివక్ష, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. సెలబ్రిటీల విషయంలోనూ పిల్లల భవిష్యత్, ఆస్తుల పంపకం, కుటుంబ బాధ్యతల విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన ధోరణులు 
ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) 2024 నివేదిక ప్రకారం.. 2022లో వెయ్యి మంది జనాభాకు విడాకుల సంఖ్య చిలీలో 3.6 కాగా, కొలంబియాలో 0.6గా నమోదైంది. 1990–2022 మధ్య 13 దేశాల్లో విడాకుల శాతం పెరగ్గా, 16 దేశాల్లో తగ్గింది. యూరోస్టాట్‌ 2026 గణాంకాల ప్రకారం.. ఐరోపా సమాఖ్యలో 2024లో వెయ్యి మందికి 1.6 విడాకులు నమోదయ్యాయి. పేరు, డబ్బు, హోదా ఉన్నంత మాత్రాన దాంపత్య జీవితం సాఫీగా సాగదని ప్రముఖుల జీవితాలు చెబుతున్నాయి. పరస్పర గౌరవం, నమ్మకం, సమయం కేటాయించడం, సమస్యలను చర్చించుకోవడం వైవాహిక బంధానికి కీలకం. అవసరమైనప్పుడు కౌన్సెలింగ్‌ ద్వారా విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. వివాహ బంధం నిలవాలంటే సర్దుకుపోవడం ఒక్కరి బాధ్యత కాదు.. ఇద్దరి బాధ్యత కావాలి.  

ఇదీ చదవండి: ఎమ్మెల్యే టికెట్‌ చేజారింది.. జెడ్పీ పీఠమైనా దక్కేనా?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement