కూటమి నుంచి బయట కొచ్చేస్తాం
పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నుంచి జనసేన ఇక్కడ బయటకొచ్చి పట్టణంలోని 48 వార్డుల్లో పోటీ చేసి గెలుస్తామని టీడీపీ నాయకులకు బుధవారం జరిగిన జనసేన పార్టీ సమావేశంలో నాయకులు బహిరంగ హెచ్చరికలు చేశారు. దీంతో కొంత కాలంగా ప్రచ్చన్న యుద్ధంలా సాగుతున్న కూటమి రభస నేరుగా రోడ్డు మీదకు వచ్చి బహిరంగ సవాళ్ల స్థాయికి చేరింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ వలవల బాబ్జీలు క్షమాపణలు చెప్పాలని, లేదంటే జనసేన బలం ఏంటో చూపిస్తామని పరోక్ష హెచ్చరికలు చేశారు.
వెంకట్రామన్నగూడెం టీడీపీ ఎంపీటీసీ పరిమి రవికుమార్ ఓడిపోతే ఎమ్మెల్యేది బాధ్యతా అని ప్రశ్నించారు. టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బాబ్జీకి కేడర్‌ను నడిపే దమ్ముందా.. కేడర్‌ను కూర్చోపెట్టి రవి విజయం గురించి చర్చించారా.. రవికి మద్దతుగా ప్రచారానికి వెళ్లారా.. ఆయన కూడా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారా అని మండిపడ్డారు. ముళ్లపూడి బాపిరాజుకు తాడేపల్లిగూడెంతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. పరిమి ఓటమికి ఏఆర్ఓ స్థాయిలో దళిత తహసీల్దార్ కారణమంటూ టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని.. పార్టీల కతీతంగా దళితులంతా ఏకమై టీడీపీ నాయకులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఫ్రెండ్లీ కాంటెస్టు అని టీడీపీ నేత బాబ్జీ చెబుతున్నారు.. అదేం కాదు కూటమి నుంచి బయటకు వచ్చి పట్టణంలో మొత్తం వార్డుల్లో జనసేన పోటీ చేసి సత్తా చూపిస్తుందని అల్టిమేటం ఇచ్చారు. ఎంపీటీసీ ఫలితాల తర్వాత కూటమిలో సెగలు ఎగసిపడుతున్నాయి. నాయకులు మిడిసిపడుతున్నారు. మొత్తం మీద బీజేపీ మినహా టీడీపీ, జనసేన బాహాబాహీ అనే స్థాయికి చేరుకోవడం తాడేపల్లి గూడెం నియో జకవర్గంలో హాట్ టాపిక్‌గా ఉంది.


