రష్యా పంజా.. మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు డ్యామేజ్‌ | Russian Missile Hits Lakshmi Mittal Steel Plant in Zelensky Hometown | Sakshi
Sakshi News home page

రష్యా పంజా.. మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు డ్యామేజ్‌

Aug 17 2026 8:29 AM | Updated on Aug 17 2026 8:36 AM

Russian Missile Hits Lakshmi Mittal Steel Plant in Zelensky Hometown

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మరో కీలక మలుపు తీసుకుంది. తాజా డ్రోన్ల దాడితో ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధం భీకరంగా మారింది. ఈ క్రమంలో.. క్రివీ రిహ్‌ స్టీల్‌ ప్రాంతంలో  భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్‌ మిట్టల్‌ ప్లాంట్‌పై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 14 మంది కార్మికులు గాయపడ్డారు. ఇది ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ స్వస్థలం కూడా!. 

రష్యా క్షిపణి దాడి కారణంగా..  మిట్టల్‌ ప్లాంట్‌లోని కీలక ఉత్పత్తి విభాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విద్యుత్‌ వ్యవస్థలు, బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కార్యకలాపాలకు సంబంధించిన సదుపాయాలు ప్రభావితమయ్యాయి. దీంతో ఉత్పత్తి ప్రక్రియలను పాక్షికంగా నిలిపివేయాల్సి వచ్చింది. నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు అధికారులు, నిపుణులు పరిశీలనలు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ఇటు దాడి వల్ల జరిగిన ఆర్థిక నష్టంపై అధికారిక అంచనా ఇంకా వెలువడలేదు. అయితే భారీ పరిశ్రమ అయిన ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల మరమ్మతుల ఖర్చుతో పాటు ఉక్కు ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. నష్టం స్థాయిని పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

90 ఏళ్ల చరిత్ర.. వెన్నెముక
లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్‌ మిట్టల్‌ క్రివీ రిహ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సాధారణ పరిశ్రమ కాదు. దాదాపు 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భారీ ఉక్కు కర్మాగారం నిర్మాణం 1931లో అప్పటి సోవియట్‌ యూనియన్‌ హయాంలో ప్రారంభమైంది. 1934 ఆగస్టులో ఇక్కడ తొలి ఉక్కు ఉత్పత్తి జరిగింది. అప్పట్లో క్రివొరిజ్‌స్టల్‌ (Kryvorizhstal) పేరుతో కొనసాగిన ఈ ప్లాంట్‌.. ఉక్రెయిన్‌ పారిశ్రామిక రంగంలో కీలకమైన సంస్థగా ఎదిగింది.

2005లో లక్ష్మీ మిట్టల్‌ నేతృత్వంలోని మిట్టల్‌ స్టీల్‌ సంస్థ ప్రైవేటీకరణ వేలంలో ఈ ప్లాంట్‌ను సుమారు 4.8 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆర్సెలర్‌తో విలీనం కావడంతో ఇది ఆర్సెలర్‌ మిట్టల్‌ క్రివీ రిహ్‌గా మారింది. స్వాధీనం అనంతరం ఆధునీకరణ, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, పర్యావరణ ప్రమాణాల మెరుగుదల కోసం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇనుప ఖనిజం నుంచి ఉక్కు తయారీ వరకు మొత్తం ప్రక్రియ ఒకేచోట జరిగే ఈ ప్లాంట్‌.. ఉక్రెయిన్‌ ఉక్కు పరిశ్రమకు వెన్నెముకలాంటి సంస్థల్లో ఒకటిగా నిలిచింది.

ఇలాంటి వ్యూహాత్మక పరిశ్రమపై రష్యా క్షిపణి దాడి జరగడం.. కేవలం ఓ కంపెనీకి జరిగిన నష్టంగానే కాకుండా, యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడికి మరో ఉదాహరణగా మారింది.

డ్రోన్‌ దాడులకు ప్రతీకారమే..
ఉక్రెయిన్‌ రష్యాలోని పలు ప్రాంతాలపై భారీ డ్రోన్‌ దాడులు చేసిన తర్వాతే ఈ క్షిపణి దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. ఉక్రెయిన్‌ దాడుల్లో రష్యాలో మరణాలు సంభవించగా.. దీనికి ప్రతీకార చర్యల్లో భాగంగానే మాస్కో ఈ దాడులు చేపట్టింది. అయితే.. తాము ఉక్రెయిన్‌లో సైనిక, పారిశ్రామిక లక్ష్యాలనే టార్గెట్‌ చేస్తున్నామని రష్యా ఖుల్లాగా ప్రకటించుకుంటోంది. క్రివీ రిహ్‌లోని మెటలర్జికల్‌ ప్లాంట్‌ కూడా తమ లక్ష్యాల్లో భాగమని పేర్కొంది. అయితే జెలెన్‌స్కీ స్వస్థలాన్ని టార్గెట్‌ చేసి మరీ దాడులు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.  

యుద్ధంలో కొత్త దశ
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఇరు దేశాలు సరిహద్దులు దాటి దూర ప్రాంతాలపై దాడులను పెంచుతున్నాయి. సైనిక స్థావరాలతో పాటు విద్యుత్‌ కేంద్రాలు, ఇంధన వనరులు, పారిశ్రామిక సంస్థలు కూడా లక్ష్యాలుగా మారుతున్నాయి. జెలెన్‌స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్‌పై గతంలోనూ రష్యా దాడులు చేసింది. తాజాగా మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌పై జరిగిన దాడి.. ఉక్రెయిన్‌ ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థపై యుద్ధ ప్రభావాన్ని మరోసారి స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement