‘మమ్మల్ని ఏపీలో కలిపేయండి’.. కర్ణాటక ఎమ్మెల్యే వ్యాఖ్యల దుమారం | Karnataka Congress MLA says merge constituency with Andhra Comments | Sakshi
Sakshi News home page

‘మమ్మల్ని ఏపీలో కలిపేయండి’.. కర్ణాటక ఎమ్మెల్యే వ్యాఖ్యల దుమారం

Aug 17 2026 7:14 AM | Updated on Aug 17 2026 7:14 AM

Karnataka Congress MLA says merge constituency with Andhra Comments

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.వై. గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. తన నియోజకవర్గమైన మోళకల్మూరుకు ప్రభుత్వాలు వరుసగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఈ ప్రాంతాన్ని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కలిపేయడం లేదా చల్లకెరె తాలూకాలో విలీనం చేయడం మంచిదని వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మోళకల్మూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గోపాలకృష్ణ..‘మోళకల్మూరు ఎవరికీ కనిపించడం లేదు. ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యం లభిస్తున్నా ఈ పట్టణం ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా తిరిగి ఎన్నిక కావడం లేదు. ఈ పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపినా లేదా చల్లకెరె తాలూకాలో చేర్చినా బాగుంటుంది. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది’ అంటూ ఆవేదనతో కామెంట్స్‌ చేశారు. కాగా, మోళకల్మూరు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో ఆయన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

ఖండించిన ఎమ్మెల్యే..
అయితే తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన కొద్ది గంటల్లోనే గోపాలకృష్ణ వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. మోళకల్మూరు తాలూకాకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని, ముఖ్యంగా సాగునీటి సౌకర్యాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మాత్రమే తాను కోరినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని తాను డిమాండ్ చేసినట్లు వచ్చిన ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేదని స్పష్టం చేశారు.

పదవి దక్కకపోవడంపై అసంతృప్తి
గోపాలకృష్ణ తాజా వ్యాఖ్యలకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంపై ఆయన ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ, సీనియర్ నేతలను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము తీవ్రంగా బాధపడుతున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 1997 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గోపాలకృష్ణ, 2018 నుంచి 2023 వరకు బీజేపీలో ఉన్నారు. అనంతరం తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటానని ఆయన గతంలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement