న్యూఢిల్లీ: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతోపాటు పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించే యూజీసీ–నెట్ పరీక్షలో తప్పులు దొర్లడంతో మూడు సబ్జెక్టులకు సంబంధించిన రీ–ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ఆదివారం ప్రకటించింది.
ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నాపత్రాల్లో పలు తప్పులు దొర్లాయని, ఒకే ప్రశ్నలు వేర్వేరు నంబర్లతో పదే పదే అడిగారని ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఎన్‌టీఏ ఆ మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష చేపడామని వెల్లడించింది.
సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 10వ తేదీ దాకా రీ–ఎగ్జామ్‌లు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9న ఉదయం 9 గంటలకు ఇంగ్లిష్, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరు గంటలదాకా కామర్స్ పరీక్ష చేపట్టనున్నారు. పదో తేదీ ఉదయం 9 గంటలకు సోషియాలజీ పరీక్ష చేపడతారు. ఈ పరీక్షలకు అదనంగా ఎలాంటి చార్జీలు వసూలుచేయట్లేమని స్పష్టంచేసింది. 87 సబ్జెక్టుల్లో 84 సబ్జెక్టులకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ ‘కీ’లను వెల్లడించిన వేళ ఈ పరిణామం సంభవించడం గమనార్హం.


