వ్యవస్థ ఎలా పనిచేస్తోందో మేమే స్వయంగా పరిశీలిస్తాం
రెండు వారాల్లో నందన్ నిలేకని కమిటీ నివేదిక సమరి్పంచండి
సిఫార్సులు కాగితాలకే పరిమితం కాకూడదు
సగం మంది సిబ్బంది శాశ్వత ప్రాతిపదికన ఉండాల్సిందే
పరీక్షల సంస్కరణలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సంస్కరణలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నీట్’సహా పలు పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రధాన కార్యాలయాన్ని తామే స్వయంగా తనిఖీ చేస్తామని తేల్చిచెప్పింది. పోటీ పరీక్షల సమగ్రతను పరిరక్షించేందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పురోగతి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైపవర్డ్ కమిటీతో సమన్వయం చేసుకుంటున్న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ(డీఓపీటీ) జాయింట్ సెక్రెటరీ కమిటీ పురోగతిపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఆఫీసుకు వచ్చి చూస్తాం..
ఎన్‌టీఏలో కార్యాలయాన్ని సందర్శిస్తామని జస్టిస్ పీఎస్ నరసింహ తెలిపారు. ‘ఒకరోజు నేను, నా సోదర న్యాయమూర్తి జస్టిస్ అరాధేతో కలిసి ఎన్‌టీఏ ఆఫీసును సందర్శిస్తాం. వ్యవస్థ సరిగ్గా పని చేస్తోందా? లేదా? మానవ వనరులు సరిపడా ఉన్నాయా? లేదా? అన్నది మేమే స్వయంగా పరిశీలిస్తాం’’అని స్పష్టం చేశారు. ఢిల్లీలోని మింటో రోడ్‌లో ఉన్న ఎన్‌టీఏ కార్యాలయానికి వెళ్లి, ఆ వ్యవస్థ వాస్తవంగా ఎలా పనిచేస్తోందో పరిశీలించి, సిబ్బంది, ఇతర ఏర్పాట్లను అంచనా వేయనున్నట్లు తెలిపారు.
సగం సిబ్బంది శాశ్వతంగా ఉండాలి
ఎన్‌టీఏలో కనీసం సగం మంది (50 శాతం) సిబ్బంది శాశ్వత ప్రాతిపదికన ఉండాలని, అందరినీ ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకురాకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇతర సంస్థలతో ఎన్‌టీఏకు ఉన్న సంబంధాలు, అవి పరస్పరం ఎలా సహకరించుకుంటున్నాయి, డేటా నిర్వహణ విధానం తదితర అంశాలను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ‘‘శాశ్వత వ్యవస్థ, శాశ్వత సిబ్బంది, శాశ్వత విభాగాలు ఉండాలి. డిçప్యుటేషన్ చాలా తక్కువగా ఉండాలి. అప్పుడే ఎన్‌టీఏకు ఒక శాశ్వత నిర్మాణం ఏర్పడుతుంది’’అని వెల్లడించింది.
కాగితాలకే పరిమితం కాకూడదు
నందన్ నిలేకని కమిటీ విస్తృత సంప్రదింపులు జరిపిందని, సెపె్టంబర్ నెలాఖరు నాటికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కమిటీ సిఫార్సులు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని, క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావాలని సూచించింది. ‘‘గతంలో రాధాకృష్ణన్ కమిటీ వేశాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది కేవలం ఒక కమిటీ నివేదిక మాత్రమే. అది మరింత ముందుకు సాగాలి. నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. సిఫార్సుల అమలు అత్యంత కీలకం’’అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, సిఫార్సులను తప్పకుండా అమలు చేస్తుందని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
కొత్త సంస్థను ఏర్పాటు చేయాలన్న పిటిషనర్లు
నీట్–యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఫైమా), యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్, ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్, సామాజిక కార్యకర్త అనుభవ్ గార్గ్ తదితరులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్‌టీఏ స్థానంలో పార్లమెంటరీ జవాబుదారీతనం ఉన్న నూతన స్వతంత్ర చట్టబద్ధమైన పరీక్షా సంస్థను ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు.
ప్రశ్నపత్రాల డిజిటల్ లాకింగ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానానికి మారడం, అవకతవకలను గుర్తించేందుకు పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాల ప్రచురణ వంటి డిమాండ్లను కోర్టు ముందుంచారు. సీబీటీ విధానంలోకి ఎలా మారాలో సూచిస్తూ ఫైమా తరపు న్యాయవాది తన్వీ దూబే ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ దాఖలైన తర్వాత విచారణను కొనసాగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదేపదే జరుగుతున్న పేపర్ లీక్‌లను నివారించడానికి వ్యవస్థను సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.


