కాగ్ నివేదిక నేపథ్యంలో రైల్వే మంత్రి ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలోనూ రక్షిత మంచినీటిని అందుబాటులో ఉంచేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పలు రైళ్ల స్టేషన్లలో అందుబాటులో ఉన్న మంచినీటి కూలర్లలో అత్యంత ప్రమాదకర ఇ–కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) శనివారం ప్రకటించింది.
ఆడిటింగ్ జరిగిన 512 రైల్వే స్టేషన్లలో నీటి నాణ్యత అధ్వానంగా ఉండటం, వాష్‌రూంలలో అపరిశుభ్రత తాండవిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం మంత్రి వైష్ణవ్ ఉన్నతాధికారులతోసమీక్ష జరిపారు. నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయడం, వాటర్ ట్యాంకులను కొత్తవి ఏర్పాటు చేయడం, నీటి నాణ్యతపై క్రమం తప్పకుండా పరీక్షలు చేపట్టడం వంటి చర్యలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.


