breaking news
Safe drinking water facility
-
అన్ని స్టేషన్లలోనూ రక్షిత మంచినీరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలోనూ రక్షిత మంచినీటిని అందుబాటులో ఉంచేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పలు రైళ్ల స్టేషన్లలో అందుబాటులో ఉన్న మంచినీటి కూలర్లలో అత్యంత ప్రమాదకర ఇ–కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) శనివారం ప్రకటించింది. ఆడిటింగ్ జరిగిన 512 రైల్వే స్టేషన్లలో నీటి నాణ్యత అధ్వానంగా ఉండటం, వాష్రూంలలో అపరిశుభ్రత తాండవిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం మంత్రి వైష్ణవ్ ఉన్నతాధికారులతోసమీక్ష జరిపారు. నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయడం, వాటర్ ట్యాంకులను కొత్తవి ఏర్పాటు చేయడం, నీటి నాణ్యతపై క్రమం తప్పకుండా పరీక్షలు చేపట్టడం వంటి చర్యలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. -
కునారిల్లుతున్న పాఠశాలలు
* సదుపాయాల లేమితో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి * 24 శాతం పాఠశాలల్లో ఒకే తరగతి గది * రక్షిత తాగునీటి సౌకర్యం లేని పాఠశాలలు 36 శాతం * బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లూ అంతంతే * 42 శాతం పాఠశాలల్లో అసలు మరుగుదొడ్లే లేవు.. * ఆటస్థలాలు లేనివి 53 శాతం.. ప్రహరీలు లేనివి 73 శాతం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు అసౌకర్యాలకు నిలయంగా మారిపోయాయని కాగ్ పేర్కొంది. చాలా పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు, బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, రక్షిత మంచినీరు, ఆటంకాలు లేనిదారులు లేవని స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, ప్రకాశం, విజయనగరం, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎంపిక చేసిన 154 పాఠశాలల్లో జరిపిన నమూనా తనిఖీల్లో ఈ లోపాలు వెలుగుచూశాయని వెల్లడించింది. ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలకు భవనాలు, ఇతర మౌలిక సౌకర్యాలను, విద్యార్థులకు ప్రాథమిక సదుపాయాలను కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కాగ్ స్పష్టం చేసింది. 24 శాతం ఒకే తరగతి గది.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక గది, ప్రధానోపాధ్యాయుడి గది, సామాను గది ఉండాల్సి ఉండగా.. ఉమ్మడి రాష్ట్రంలోని 24 శాతం పాఠశాలల్లో ఒకే తరగతి గది ఉంది. రాష్ట్రంలోని 96 శాతం పాఠశాలలకు సొంత భవనాలున్నాయని... కానీ 24,302 పాఠశాలల్లో ఒకే తరగతి గది ఉండగా, 20,858 పాఠశాలల్లో రెండు, 11,560 పాఠశాలల్లో మూడు, 24,302 పాఠశాలల్లో మూడు కంటే ఎక్కువగా తరగతి గదులున్నాయి. ఉమ్మడి మరుగుదొడ్లూ లేవు.. ఉమ్మడి రాష్ట్రంలోని 32 శాతం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, 63 శాతం పాఠశాలల్లో బాలురకు మరుగుదొడ్లు లేవు. అసలు 42 శాతం పాఠశాలల్లోనైతే కనీసం ఉమ్మడి మరుగుదొడ్లు కూడా లేవు. నమూనా తనిఖీలు జరిపిన 154 పాఠశాలల్లో 87 చోట్ల మరుగుదొడ్లు ఉన్నా అవి ఉపయోగకరంగా లేవని కాగ్ తెలిపింది. రక్షిత మంచి నీటికీ దిక్కులేదు.. ఉమ్మడి రాష్ట్రంలోని 36 శాతం పాఠశాలల్లో రక్షిత మంచినీటి సౌకర్యం లేదు. 22,223 ప్రాథమిక, 2,577 ప్రాథమికోన్నత, 2,499 ఉన్నత పాఠశాలల్లో రక్షిత మంచినీరు అందుబాటులో లేదు. అదే విధంగా 53 శాతం పాఠశాలల్లో ఆట స్థలాలు లేవు. 73 శాతం పాఠశాలలకు ప్రహరీలు లేవు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల విషయానికి వస్తే.. జడ్చర్ల పాఠశాల భవనం 2010 ఆగస్టులో, భూత్పూర్ భవనం 2011 మేలో పూర్తయినా విద్యుదీకరణ పనులు ఆలస్యంగా జరగడంతో వాటిని 2011 చివరిలో పాఠశాల అధికారులకు అప్పగించారు. దీంతో తీవ్ర జాప్యం జరిగింది. తేలని ‘పరీక్షల’ లెక్కలు.. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాల కోసం 2008-13 మధ్య కాలంలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్)ల ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి లెక్కలు తేలలేదని కాగ్ తెలిపింది. ఐదేళ్ల కాలంలో ఏపీ టెట్, డీఎస్సీ, డైట్సెట్, ఎల్పీసెట్ల పరీక్ష ఫీజుల రూపేణా రూ. 89.48 కోట్లురాగా... పరీక్షల నిర్వహణ కోసం రూ. 35.86 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో అడ్వాన్సులుగా చెల్లించిన రూ. 11.02 కోట్లకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ సమర్పించకపోవడంతో వాటి వినియోగానికి సంబంధించి లెక్కలు తేలలేదు. పరీక్షల తర్వాత మిగిలిన రూ.53.42 కోట్లను ట్రెజరీలో జమ చేయకుండా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తన పేరుతో ఖాతాల్లో ఉంచుకున్నారని కాగ్ వెల్లడించింది.


