breaking news
E coli
-
మధుమేహానికి బ్యాక్టీరియాతో చెక్?
మన పేవుల్లో ఉండే కోటానుకోట్ల బ్యాక్టీరియా రకాల్లో ఈ–కోలీ ఒకటి. తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు సాయపడుతుంది. కొన్ని రకాలతో ఆరోగ్య సమస్యలూ వస్తాయి. అలాంటి బ్యాక్టీరియాతో టైప్–2 మధుమేహానికి చికిత్స కూడా అందించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు! ప్రీ క్లినికల్ ట్రయల్స్ దాటుకుని జంతు ప్రయోగాల దశకు చేరిన ఈ ఆసక్తికర పరిశోధన వివరాలు.. భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధాని అంటూంటారు. కనీసం పది కోట్ల మంది ఈ జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువ. రోజూ మందులేసుకోవడం, అవి చాలకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్లు... వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఎవరికైనా భరించలేని వేదనే. అందుకే మధుమేహానికి మెరుగైన చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా చైనాలోని ఈస్ట్ చైనా నార్మల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి ఒక వినూత్నమైన పరిష్కారాన్ని సూచించారు. గ్లూకోజును పసిగట్టే జన్యు రిసెప్టర్లను ఈ–కోలీ బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టారు. చక్కెర నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువైతే చాలు... ఈ బ్యాక్టీరియా జీఎల్పీ–1 హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇంకోలా చెప్పాలంటే.. ఈ బ్యాక్టీరియా కారణంగా ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు వాడే ఒజెంపిక్తోపాటు సెమాగ్లూటైడ్ వంటి మందులు శరీరంలోనే తయారై విడుదలవుతాయన్నమాట. ఇదీ సమస్య... శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఇన్సులిన్ విడుదల చేయమని కాలేయానికి సందేశాలు వెళతాయి. ఈ ఇన్సులిన్ కాస్తా గ్లూకోజును మన కణాల తలుపులు తెరిచి గ్లూకోజు లోపలికి చొచ్చుకెళ్లేందుకు సాయపడతాయి. తగినంత గ్లూకోజు కణాల్లోకి చేరిన తరువాత ఇన్సులిన్ విడుదల కూడా తగ్గిపోతుంది. దీంతో కాలేయం అవసరాలకు తగ్గట్టు మళ్లీ చక్కెర తయారు చేసి రక్తంలోకి వదులుతూంటుంది. అయితే మధుమేహం ఉన్నవారిలో ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. కణాలు ఇన్సులిన్‌కు స్పందించడం మానేస్తాయి. ఫలితంగా చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది. సెమాగ్లూటైడ్ వంటి మందులు ఇన్సులిన్ స్థాయిలను పెంచి గ్లూకోజు ఖర్చయ్యేందుకు సాయపడతాయి. ఈస్ట్ చైనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ–కోలీ బ్యాక్టీరియానే రక్తంలోని గ్లూకోజు స్థాయిలను బట్టి జీఎల్పీ–1 హార్మోన్ విడుదల చేసేలా చేశారు. అవసరమైనప్పుడు మాత్రమే ఇన్సులిన్ విడుదల అవుతూండటం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండే అవకాశాలు తక్కువ. మధుమేహం ఉన్న కొన్ని రకాల కోతులు, ఎలుకలపై ఇప్పటికే తాము ఈ బ్యాక్టీరియాను ప్రయోగించామని, మంచి ఫలితాలే వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. హానికర ప్రభావాలు కూడా లేనట్లు స్పష్టమైనట్లు చెప్పారు. మానవ ప్రయోగాలు కూడా నిర్వహించి సత్ఫలితాలు సాధిస్తే ఈ బ్యాక్టీరియా చికిత్స టైప్–2 మధుమేహ బాధితులకు వరం కాగలదనడంలో సందేహం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అన్ని స్టేషన్లలోనూ రక్షిత మంచినీరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలోనూ రక్షిత మంచినీటిని అందుబాటులో ఉంచేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పలు రైళ్ల స్టేషన్లలో అందుబాటులో ఉన్న మంచినీటి కూలర్లలో అత్యంత ప్రమాదకర ఇ–కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) శనివారం ప్రకటించింది. ఆడిటింగ్ జరిగిన 512 రైల్వే స్టేషన్లలో నీటి నాణ్యత అధ్వానంగా ఉండటం, వాష్‌రూంలలో అపరిశుభ్రత తాండవిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం మంత్రి వైష్ణవ్ ఉన్నతాధికారులతోసమీక్ష జరిపారు. నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయడం, వాటర్ ట్యాంకులను కొత్తవి ఏర్పాటు చేయడం, నీటి నాణ్యతపై క్రమం తప్పకుండా పరీక్షలు చేపట్టడం వంటి చర్యలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. -
ఐదు బ్యాక్టీరియాలకు.. భారత్‌లో 6.8 లక్షల మంది బలి
న్యూఢిల్లీ: ఈ.కోలి. ఎస్ నిమోనియా, కె.నిమోనియా, ఎస్.ఏరియస్, ఎ.మౌమనీ. ఈ ఐదు రకాల బ్యాక్టీరియాలు 2019లో భారత్‌లో ఏకంగా 6.8 లక్షల మంది ఉసురు తీశాయని లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ‘‘2019లో ప్రపంచం మొత్తమ్మీద సంభవించిన మరణాలకు గుండె సంబంధిత వ్యాధుల తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లే రెండో అతి పెద్ద కారణంగా నిలిచాయి. ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వీటి ఫలితమే. 33 రకాల సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు 77 లక్షల మరణాలకు కారణమయ్యాయి. వీటిలోనూ కేవలం ఐదు బ్యాక్టీరియాల వల్ల సగానికి పైగా మరణాలు సంభవించాయి’’ అని అధ్యయనం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా బ్యాక్టీరియాలను అదుపు చేయడం తక్షణావసరమని హెచ్చరించింది. ‘‘పటిష్టమైన ఆరోగ్య, వ్యాధి నిర్ధారణ వ్యవస్థల నిర్మాణం, మెరుగైన అదుపు చర్యలు, యాంటీబయాటిక్‌ల వాడకాన్ని గరిష్ట స్థాయికి పెంచడం వంటి చర్యలు చేపట్టాలి’’ అని వాషింగ్టన్ వర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ డైరెక్టర్, అధ్యయన కర్త క్రిస్టోఫర్ ముర్రే సూచించారు. చాలా ఇన్ఫెక్షన్లు తదితరాలకు మనకిప్పటిదాకా కారణాలు తెలియకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పలు గణాంకాలతో పాటు 3.43 కోట్ల మంది వైద్య రికార్డులను పరిశీలించారు. ‘‘2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 1.37 కోట్ల ఇన్ఫెక్షన్ సంబంధిత మరణాల్లో సగానికి పైగా బ్యాక్టీరియానే కారణం. 77 లక్షల బ్యాక్టీరియా సంబంధిత మరణాల్లో మూడొంతులకు పైగా శ్వాస, రక్త, ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లే. బ్యాక్టీరియాల్లో ఒక్క ఎస్.ఏరియస్ రకమే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 1.1 కోట్ల మరణాలకు కారణమైంది. వయసుపరంగా కూడా 15 ఏళ్ల పై బడ్డ వారిలో అత్యధికంగా 9.4 లక్షల మందిని ఇది బలి తీసుకుంది’’ అని పరిశోధకులు తేల్చారు. సహారా ఆఫ్రికా ప్రాంతంలో అత్యధికంగా ప్రతి లక్ష మంది జనాభాకు 230 మంది బ్యాక్టీరియాకు బలైనట్టు వివరించారు. అదే పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా వంటి సంపన్న ప్రాంతాల్లో ఈ సంఖ్య అత్యల్పంగా ప్రతి లక్ష మందికి 52గా ఉందని చెప్పారు. ఇదీ చదవండి: Bruce Lee Death Reason: ఓవర్‌గా వాటర్ తాగితే.. బ్రూస్లీలా మరణం ఖాయమంటున్న పరిశోధకులు! -
చెంచా చక్కెరతో 80 గంటల విద్యుత్!
బీజింగ్: ఒక చెంచాడు చక్కెరతో ఏకధాటిగా 80గంటలపాటు విద్యుత్‌ను అందించే అత్యధిక సామర్థ్యమున్న సూక్ష్మజీవి కణ వ్యవస్థను చైనా విద్యార్థులు అభివృద్ధిచేశారు. ఇందుకోసం ఈ కోలి, షెవానెల్లా, బి సబ్టిలిస్ అనే మూడు సూక్ష్మజీవుల కలయిక వ్యవస్థను తయారుచేశారు. ఈ సెల్.. లిథియం బ్యాటరీ ఇచ్చే 520ఎంవీ విద్యుత్‌ను అందిస్తోందని తెలిపారు. కాలుష్యాన్ని విడుదలచేయని బ్యాటరీ తయారీకి కావాల్సిన వ్యవస్థను కనుగొన్నందుకు వీరు ఈ ఏడాదికి ఇంటర్నేషనల్ జనటికల్లీ ఇంజనీర్డ్ మెషీన్(ఐజెమ్) పోటీలో గోల్డ్ మెడల్‌ను గెలుపొందారు. చైనాలోని తియాంజిన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 19 కళాశాల, హైస్కూల్ విద్యార్థుల బృందం ఈ కణవ్యవస్థను అభివృద్ధిచేశారు.


