ఈ–కోలీతో చైనా శాస్త్రవేత్తల ప్రయోగాలు
మానవ ప్రయోగాల తర్వాతే అందుబాటులోకి
మన పేవుల్లో ఉండే కోటానుకోట్ల బ్యాక్టీరియా రకాల్లో ఈ–కోలీ ఒకటి. తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు సాయపడుతుంది. కొన్ని రకాలతో ఆరోగ్య సమస్యలూ వస్తాయి. అలాంటి బ్యాక్టీరియాతో టైప్–2 మధుమేహానికి చికిత్స కూడా అందించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు! ప్రీ క్లినికల్ ట్రయల్స్ దాటుకుని జంతు ప్రయోగాల దశకు చేరిన ఈ ఆసక్తికర పరిశోధన వివరాలు.. భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధాని అంటూంటారు.
కనీసం పది కోట్ల మంది ఈ జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువ. రోజూ మందులేసుకోవడం, అవి చాలకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్లు... వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లు ఎవరికైనా భరించలేని వేదనే. అందుకే మధుమేహానికి మెరుగైన చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజాగా చైనాలోని ఈస్ట్ చైనా నార్మల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి ఒక వినూత్నమైన పరిష్కారాన్ని సూచించారు. గ్లూకోజును పసిగట్టే జన్యు రిసెప్టర్లను ఈ–కోలీ బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టారు. చక్కెర నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువైతే చాలు... ఈ బ్యాక్టీరియా జీఎల్‌పీ–1 హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇంకోలా చెప్పాలంటే.. ఈ బ్యాక్టీరియా కారణంగా ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు వాడే ఒజెంపిక్‌తోపాటు సెమాగ్లూటైడ్ వంటి మందులు శరీరంలోనే తయారై విడుదలవుతాయన్నమాట.
ఇదీ సమస్య...
శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఇన్సులిన్ విడుదల చేయమని కాలేయానికి సందేశాలు వెళతాయి. ఈ ఇన్సులిన్ కాస్తా గ్లూకోజును మన కణాల తలుపులు తెరిచి గ్లూకోజు లోపలికి చొచ్చుకెళ్లేందుకు సాయపడతాయి. తగినంత గ్లూకోజు కణాల్లోకి చేరిన తరువాత ఇన్సులిన్ విడుదల కూడా తగ్గిపోతుంది. దీంతో కాలేయం అవసరాలకు తగ్గట్టు మళ్లీ చక్కెర తయారు చేసి రక్తంలోకి వదులుతూంటుంది. అయితే మధుమేహం ఉన్నవారిలో ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు.
కణాలు ఇన్సులిన్‌కు స్పందించడం మానేస్తాయి. ఫలితంగా చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది. సెమాగ్లూటైడ్ వంటి మందులు ఇన్సులిన్ స్థాయిలను పెంచి గ్లూకోజు ఖర్చయ్యేందుకు సాయపడతాయి. ఈస్ట్ చైనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ–కోలీ బ్యాక్టీరియానే రక్తంలోని గ్లూకోజు స్థాయిలను బట్టి జీఎల్‌పీ–1 హార్మోన్ విడుదల చేసేలా చేశారు. అవసరమైనప్పుడు మాత్రమే ఇన్సులిన్ విడుదల అవుతూండటం వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు ఉండే అవకాశాలు తక్కువ.
మధుమేహం ఉన్న కొన్ని రకాల కోతులు, ఎలుకలపై ఇప్పటికే తాము ఈ బ్యాక్టీరియాను ప్రయోగించామని, మంచి ఫలితాలే వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. హానికర ప్రభావాలు కూడా లేనట్లు స్పష్టమైనట్లు చెప్పారు. మానవ ప్రయోగాలు కూడా నిర్వహించి సత్ఫలితాలు సాధిస్తే ఈ బ్యాక్టీరియా చికిత్స టైప్–2 మధుమేహ బాధితులకు వరం కాగలదనడంలో సందేహం లేదు.
– సాక్షి, నేషనల్ డెస్క్


