ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 1,20,000 మంది చిన్నారులు హెచ్‌ఐవి బారిన పడుతున్నారు. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే ఈ వైరస్‌ను అదుపులో ఉంచడం తప్ప, పూర్తిగా నిర్మూలించడం ఇప్పటివరకు సాధ్యం కాలేదు. అయితే, తాజాగా ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనం ఈ రంగంలో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది. హెచ్‌ఐవి వైరస్‌ను ఎదుర్కొనేందుకు శక్తివంతమైన ‘త్రీ పార్ట్’ చికిత్సా విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది చిన్నారుల శరీరంలో హెచ్‌ఐవిని శాశ్వతంగా తుడిచిపెట్టే అవకాశం ఉందని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.
కోతులలో అద్భుత ఫలితాలు
పరిశోధకులు తమ ప్రయోగం కోసం 55 మంది శిశు రీసస్ మకాక్ కోతులను ఎంచుకున్నారు. వాటికి హెచ్‌ఐవిని పోలిన ఎస్‌హెచ్ఐవి వైరస్‌ను సోకేలా చేశారు. వైరస్ సోకిన తర్వాత, చికిత్సలో భాగంగా ఆ వైరస్‌ను నిరోధించే మూడు వేర్వేరు పద్ధతులను అనుసరించారు. ఈ మూడు రకాల చికిత్సలను కలిపి అందించినప్పుడు, ఎనిమిది కోతులలో వైరస్ పూర్తిగా మాయమైంది. చికిత్సను నిలిపివేసిన తర్వాత కూడా వైరస్ తిరిగి రాకపోవడం గమనార్హం.
మూడు అంచెల చికిత్సా విధానం
ఈ ప్రయోగంలో భాగంగా యాంటీరెట్రోవైరల్ థెరపీ, రెండు బ్రాడ్లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్, లెరోన్‌లిమాబ్ అనే ప్రయోగాత్మక మోనోక్లోనల్ యాంటీబాడీని ఉపయోగించారు. వైరస్ సోకిన 72 గంటల వ్యవధిలోనే ఈ మూడు రకాల చికిత్సలను ప్రారంభించడం ద్వారా, వైరస్ శరీరంలో శాశ్వత స్థావరాన్ని ఏర్పరచుకోకుండా శాస్త్రవేత్తలు అడ్డుకున్నారు.
వైరస్ తిరగబెట్టే అవకాశం లేదు
సాధారణంగా హెచ్‌ఐవి చికిత్సను నిలిపివేస్తే వైరస్ మళ్లీ యాక్టివ్ అవుతుంది. అయితే ఈ అధ్యయనంలో భాగంగా, చికిత్సను ఆపివేసిన ఆరు నెలల తర్వాత కూడా కోతుల రక్తంలో వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. అంతేకాకుండా, మరింత స్పష్టత కోసం కోతుల సీడీ8 టీకణాలను తొలగించినా కూడా, వైరస్ మళ్లీ కనిపించకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.
మానవులపై పనిచేస్తుందా?
ఈ ఫలితాలు చాలా ప్రాముఖ్యత కలిగినవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మానవ శరీర నిర్మాణం, ప్రైమేట్స్ (కోతులు) నిర్మాణంతో అనేక పోలికలు కలిగి ఉన్నందున, ఇదే ఫలితాలు మనుషులలో కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, శిశువులలో వైరస్ సోకిన సమయాన్ని ఖచ్చితంగా గుర్తించడం, తక్షణమే చికిత్సను ప్రారంభించడంపైనే దీని విజయం ఆధారపడి ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం
మెక్సికో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జగదీష్ ఖుబ్చందాని మాట్లాడుతూ ‘ఇది ఒక మల్టీప్రాంగ్డ్ (బహుళ కోణాల్లో పనిచేసే) విధానం, ఇది శాస్త్రీయంగా చాలా అర్థవంతంగా ఉంది’ అని పేర్కొన్నారు. అలాగే, డాక్టర్ జగ్‌మోహన్ బాత్రా మాట్లాడుతూ, ఒకే రకమైన థెరపీ వైరస్‌ను అదుపు చేయగలదు కానీ, పూర్తిగా తొలగించలేదు. కాబట్టి మూడు రకాల చికిత్సల కలయిక వైరస్ శాశ్వత స్థావరాలను ఏర్పరచకుండా అడ్డుకోవడంలో ఖచ్చితంగా సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తు దిశగా అడుగులు
ఈ పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, పుట్టిన పిల్లల్లో హెచ్‌ఐవిని నిర్మూలించే దిశగా ఇది ఒక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా ప్రసవ సమయంలో హెచ్‌ఐవి ముప్పు ఎక్కువగా ఉన్న శిశువులకు ఈ పద్ధతి భవిష్యత్తులో వరంగా మారవచ్చు. భవిష్యత్తులో మనుషులపై జరగబోయే మరిన్ని క్లినికల్ ట్రయల్స్ ఈ చికిత్స ప్రభావాన్ని నిర్ధారించనున్నాయి.
ఇది కూడా చదవండి: ప్రమాదంలో ‘జెన్ జీ’: పార్టీలు, విహారయాత్రలకు భారీగా అప్పులు?


