బీహార్‌: ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి | Stampede Tragedy At Bihar Ashokdham Temple Leaves 7 Dead, Over 12 Injured Amid Heavy Devotee Rush, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Bihar Temple Tragedy: ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

Aug 17 2026 8:20 AM | Updated on Aug 17 2026 11:55 AM

Tragedy at Bihars Ashokdham Temple Stampede Claims 7 Lives

లఖీసరాయ్: బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలోని ప్రముఖ అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సమయంలో తొక్కిసలాట  చోటుచేసుకుని, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొందరు భక్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

 


మీడియాకు అందిన సమాచారం ప్రకారం సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉన్న విద్యుత్ తీగ అకస్మాత్తుగా తెగిపడటంతో భక్తుల మధ్య ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. షార్ట్ సర్క్యూట్ సంభవించిందనే అనుమానంతో ప్రాణాలను కాపాడుకునేందుకు భక్తులు పరుగులు తీయడంతో అక్కడ తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.

 

ఈ హఠాత్పరిణామంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఆలయంలోని రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

శ్రావణ మాసం మూడో సోమవారం(ఉత్తరాదిన) కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అనూహ్యంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు లఖిసరాయ్ జిల్లా కలెక్టర్ శైలేంద్ర కుమార్ తెలిపారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నంలో బారికేడ్లు విరిగిపోవడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగిందని ఆయన వెల్లడించారు. ‘ఆలయంలో ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చింది. నేను స్వయంగా తెల్లవారుజామున 3 గంటల తర్వాత అక్కడే ఉన్నాను. రైల్వే స్టేషన్‌కు ఒకేసారి రెండు రైళ్లు రావడంతో, ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఉదయం 6:30 గంటల తర్వాత రద్దీ మరింత వేగంగా పెరిగింది. బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగింది. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు కింద పడిపోయిన వారిని బయటకు తీసి, బయట సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు’ అని తెలిపారు.

శ్రావణ మాసం మూడో సోమవారం కావడంతో అశోక్ ధామ్ ఆలయంలో జలాభిషేకం చేయడానికి ఉదయం పూట పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వీరిలో మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఆలయ యంత్రాంగం తరఫున ఏర్పాట్లు చేసినప్పటికీ, భక్తుల రద్దీ ఊహకందనట్లుగా పెరిగిపోయిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఘటన గురించి సమాచారం అందగానే జిల్లా అధికార యంత్రాంగం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చి భక్తులను బయటకు సురక్షితంగా పంపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement