తమిళుల కాల్చివేతపై భగ్గుమన్న విజయ్‌ సర్కార్‌ | Chamarajanagar Incident: Vijay Govt Demand Justice After Three Tamils Killed | Sakshi
Sakshi News home page

తమిళుల కాల్చివేతపై భగ్గుమన్న విజయ్‌ సర్కార్‌

Aug 17 2026 7:19 AM | Updated on Aug 17 2026 7:24 AM

Chamarajanagar Incident: Vijay Govt Demand Justice After Three Tamils Killed

సాక్షి, చెన్నై: కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. వేటగాళ్లనే అనుమానంతో అటవీ శాఖ అధికారులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అయితే ఆ ముగ్గురు తమిళులు కావడంతో ఇరు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంది. వాళ్లు వేటగాళ్లు కాదని.. రైతులు అని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఘటనను తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌.. కర్ణాటక అటవీ శాఖ వివరణపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. 

కావేరీ వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఆగస్టు 15 తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఆంటోనీ సామి, జాన్‌ రోజ్‌ పీటర్‌, కుమార్‌ అనే ముగ్గురు తమిళులు మృతి చెందారు. వీరు చామరాజనగర్‌ జిల్లా హనూర్‌ తాలూకాలోని గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తీవ్రంగా స్పందించారు. తమిళులపై జరిగిన ఈ ఘటనను ఖండించిన ఆయన.. కర్ణాటక అటవీ శాఖ చెబుతున్న వివరణ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర, ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్‌, డీకే  శివకుమార్‌ సర్కార్‌ను కోరారు. బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం అవసరమైన సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. పూర్తి నిజాలు బయటకు రావాలని.. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పారదర్శక విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

స్టాలిన్‌ ఆగ్రహం
ఈ ఘటనపై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు తమిళ రైతుల కాల్చివేత ఘటన దిగ్భ్రాంతికరమని పేర్కొన్న ఆయన.. దీనిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. "ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరగకూడదు. కాల్పులకు బాధ్యులైన వారిపై హత్య కేసు నమోదు చేసి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి" అని స్టాలిన్‌ అన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఈ ఘటనపై స్పందించడంలో ఆలస్యం చేయకుండా కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు: కర్ణాటక అధికారులు
మరోవైపు కర్ణాటక అటవీ అధికారులు మాత్రం ముగ్గురు వ్యక్తులు అడవిలోకి వన్యప్రాణుల వేట కోసం వచ్చారని తెలిపారు. అటవీ సిబ్బందిని ఎదుర్కొన్న సమయంలో వారు కాల్పులు జరపడంతో.. ఆత్మరక్షణలో భాగంగా ఎదురుకాల్పులు జరిపామని వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, వేటకు ఉపయోగించిన వస్తువులు, అడవి జంతువుల మాంసంతో ఉన్న సంచులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

‘వేట ఆరోపణల్లో నిజం లేదు’.. ప్రతిపక్షాల ఆగ్రహం
అయితే తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు కర్ణాటక అధికారుల వాదనలను ప్రశ్నిస్తున్నాయి. ముగ్గురు వ్యక్తులు నిజంగానే వేటకు పాల్పడ్డారా? కాల్పులు అనివార్యమా? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పీఎంకే నేత అన్బుమణి రామదాస్‌ ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందించాలని కోరారు. సీపీఎం, సీపీఐ నేతలు కూడా కాల్పుల్లో పాల్గొన్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, కేసును హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

విచారణకు ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వం
ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మేజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని చెప్పారు. కాల్పులు ఆత్మరక్షణలో భాగమా? లేదంటే ఉద్దేశపూర్వక చర్యా? అనేది విచారణలో తేలనుంది.

కావేరీ జలాలు.. మేకెదాటు విషయంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఇవాళ సుప్రీం కోర్టులో తమిళనాడు వేసిన పిటిషన్‌(నీటి విడుదల కోసం..) విచారణ కూడా జరగనుంది. ఈ  నేపథ్యంలో.. ఇప్పుడు ముగ్గురు తమిళుల మృతితో ఇటు రాజకీయంగానూ ఘర్షణలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement