సాక్షి, హైదరాబాద్: సొంతింటి యజమానులపై రాష్ట్ర ప్రభుత్వం ‘22–ఏ’ పిడుగు వేసింది. ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చింది. గ్రేటర్ వ్యాప్తంగా లక్షలాది అపార్ట్‌మెంట్లు, స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లను అకస్మాత్తుగా ‘22–ఏ’లో చేరాయి. దీంతో పిల్లల పెళ్లిళ్లు, విదేశీ చదువులు, వైద్యం, ఇతర ఆర్థిక అవసరాల కోసం ప్రాపర్టీలను విక్రయించుకోలేని నిస్సహాయ స్థితిలో యజమానులు కొట్టుమిట్టాడుతున్నారు. తమ ప్రాపర్టీని ‘22–ఏ’ నుంచి తొలగించండి అంటూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా..
ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఇంటికి ఉన్నట్టుండి ’నిషేధిత’ ముద్ర పడటంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దరఖాస్తులు పట్టుకుని కలెక్టరేట్లు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగలేక, అధికారుల నుంచి సరైన సమాధానం రాక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచి్చబౌలి, షేక్‌పేట, అమీర్‌పేట, ఖైరతాబాద్, పంజగుట్ట, శ్రీనగర్‌కాలనీ, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్, బహుదూర్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ వంటి ప్రాంతాల్లోని ఆస్తులు, భూములు ఎక్కువ నిషేధిత జాబితాలో ఉన్నాయి.
54 శాతానికి మించి ఇక్కడే..
రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులు, భూముల్లో దాదాపు 54 శాతం కన్నా ఎక్కువ కేవలం మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో లక్ష కంటే ఎక్కువ ఇళ్లు, ఖాళీ ప్లాట్లు, బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లను రెవెన్యూ రికార్డుల్లో 22–ఏ జాబితాలో ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ రూ. లక్ష కోట్ల పైమాటేనని పరిశ్రమ వర్గాల అంచనా. బ్యాంక్‌లు వీటిపై ఇప్పటికే ఇంటి రుణాలు, మార్ట్‌గేజ్ రుణాలు మంజూరు చేశాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బ్యాంకింగ్ రంగంలో కూడా ఆందోళన మొదలైంది.
అసలు సమస్య ఇదీ..
రిజిస్ట్రేషన్ల చట్టం–1908 లోని ‘సెక్షన్ 22–ఏ’ అనేది క్రయ విక్రయాలకు అర్హత లేని నిషేధిత భూములు/ఆస్తుల జాబితా. ప్రధానంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, సీలింగ్ మిగులు భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు ఈ సెక్షన్ కింద ఉంటాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల నవీకరణ ప్రక్రియలో భాగంగా ఆస్తులను 22–ఏ జాబితాలో చేర్చడంతో సమస్యగా పరిణమించింది.



