బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. మరోసారి తన రాజీనామాను ఉద్ఘాటించారు. ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. అదే సమయంలో.. పార్టీలో కొందరి వైఖరి కూడా తన నిర్ణయాన్ని బలపరచాయని తాజాగా పార్టీకి రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను పూనావాలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
తొలుత తన నిర్ణయాన్ని బీజేపీ నాయకత్వం గౌరవించి, రాజీనామా స్వీకరించకుండా పునరాలోచించాలని కోరిందని తెలిపారు. అయితే అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు క్రియాశీల సభ్యత్వం నుంచి తప్పుకోవాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో సమర్పించిన రాజీనామాను పార్టీ అంగీకరించకపోవడంతో.. మరోసారి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు లేఖ రాసి తనను బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. వీలైనంత త్వరగా ఆ పని చేయాలంటూ ఆయన కోరుతున్నారు.
వ్యవస్థను వీడుతున్నా..
తన నిర్ణయం వెనుక ప్రత్యేకమైన కారణాలేవీ లేవని పూనావాలా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని తెలిపారు.
‘‘నేను బీజేపీ వ్యవస్థ నుంచి మాత్రమే బయటకు వస్తున్నాను.. సిద్ధాంతాల నుంచి కాదు’’ అని పేర్కొన్నారు. తాను ఎప్పటికీ మోదీ వీరాభిమానినేనని.. భవిష్యత్‌లోనూ సాధ్యమైనంత వరకు బీజేపీ ఆలోచనా విధానానికి మద్దతుగా ఉంటానని చెప్పారు.
ఆ కొందరు ఎవరు?
గత కొన్ని రోజులుగా జరిగిన కొన్ని పరిణామాలు తన నిర్ణయాన్ని మరింత బలపరిచాయని పూనావాలా లేఖలో పేర్కొనడం గమనార్హం. అయితే ఆ వ్యక్తులు ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. వారికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకత్వంతో తాను చర్చలు కూడా జరిపినట్లు ఆయన చెప్పినట్లు తెలిపారు.
అలాగే భవిష్యత్తులో ఏ పార్టీలో చేరబోనని.. రాజకీయాలను వదిలి ప్రైవేటు రంగంలోకి వెళ్లనున్నట్లు చెప్పారు. ‘‘అత్యవసర ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని వివరించారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీకి..
మహారాష్ట్రకు చెందిన 38 ఏళ్ల షెహజాద్ పూనావాలా న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే ప్రక్రియను బహిరంగంగా ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి 2021లో బీజేపీలో చేరారు.
బీజేపీలో చేరిన తర్వాత ఆయన పార్టీకి చెందిన ప్రముఖ ముస్లిం ముఖంగా ఎదిగారు. టీవీ చర్చలు, మీడియా సమావేశాల్లో పార్టీ తరఫున తరచూ ప్రాతినిధ్యం వహించారు. హిందుత్వాన్ని బాగా ప్రచారం చేయడంతో.. అధినాయకత్వం ఆయన్ని చేరదీసింది. 2021లో బీజేపీ ఢిల్లీ ఐటీ, సోషల్ మీడియా విభాగం బాధ్యతలు కూడా నిర్వహించారు.
ఆ తర్వాత.. టీవీ డిబేట్‌లో పార్టీ తరఫున ప్రతినిధిగా పాల్గొనేవారు. పార్టీలో తనకు లభించిన అవకాశాలను గుర్తుచేసుకుంటూ.. గత ఐదేళ్లుగా అందించిన వేదిక, గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే తాజాగా ఆయన తీసుకున్న రాజీనామా నిర్ణయం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


