breaking news
Shehzad Poonawalla
-
పూనావాలా ‘అంకుల్’ నా జోలికి రావొద్దు.. రియా కౌంటర్
న్యూఢిల్లీ: నీట్ లీకేజీ ఆందోళనల్లో వర్షంలో పోలీస్ వ్యాన్‌ను అరచేతితో అడ్డుకుని రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన రియా అహిర్, ఇటీవల ‘బిగ్ బాస్ 20’షోలోకి అడుగుపెట్టలేకపోవడం చర్చాంశనీయంగా మారింది. షో నిర్వాహకులు రియా అహిర్, పంజాబీ నటి లవ్ గిల్ మధ్య నిర్వహించిన ఆడియన్స్ పోలింగ్‌లో లవ్ గిల్ విజయం సాధించడంతో రియా అవకాశాన్ని కోల్పోయారు.హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్‌ను చంపేసినట్లు.. ఒకవైపు పూనావాలా, రాహుల్ గాంధీల మధ్య రాజకీయం నడుస్తుంటే, ఈ గొడవలో బిగ్ బాస్ ఛాన్స్ మిస్సయ్యి రియా అహిర్ బలైపోయారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోందిఈ పరిణామంపై మాజీ బీజేపీ నేత, రాజకీయ విశ్లేషకుడు షెహజాద్ పూనావాలా స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆందోళనల ద్వారా రియా వైరల్ కావడం యాదృచ్ఛికం కాదని, దాని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ, రాజ్ థాకరే వంటి నేతల మద్దతుతో మోదీ వ్యతిరేక ఎజెండాను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకెళ్లాలని ఆమె ప్లాన్ చేశారు. అయితే, 99 ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్‌కు విజయం అందించలేని రాహుల్ గాంధీ మీకు ఆన్లైన్ మద్దతు ఎలా ఇవ్వగలరు?’ అని పూనావాలా ఎద్దేవా చేశారు.పూనావాలా విమర్శలపై రియా అహిర్ రెండు వీడియోల ద్వారా ఘాటుగా స్పందించారు. పూనావాలాను ‘అంకుల్’ అని సంబోధిస్తూ, తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. చిన్న వయసున్న అమ్మాయిలను టార్గెట్ చేయడం మాని, తన ఈడువారితో రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు వాడే పాత, డొల్ల స్క్రిప్ట్ లాంటివేనని ఎద్దేవా చేశారు.తాను భారత సైన్యాన్ని కానీ, ఏ ఇతర వ్యవస్థను కానీ ఎప్పుడూ అవమానించలేదని స్పష్టం చేశారు. బిగ్ బాస్ లాంటి ఎంటర్టైన్మెంట్ షోలలోకి రాజకీయాలు, మతాలను లాగడం సరైనది కాదని హితవు పలికారు. ప్రస్తుతం ఈ పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ వార్ నెట్టింట వైరల్ అవుతోంది.👉ఇదీ చదవండి : మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా? -
‘వాళ్లు బెస్ట్ సీఎంలా?’.. సీజేపీ చీఫ్‌పై పూనావాలా ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులుగా ఎంకే స్టాలిన్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్‌ల పేర్లను ప్రతిపాదించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై షెహజాద్ పూనావాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ సంస్థను ‘మోసగాళ్ల ముఠా’ (ఫ్రాడియాస్) అని అభివర్ణించిన ఆయన, దీప్కే పేర్కొన్న ముఖ్యమంత్రులను సంబంధిత రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని అన్నారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన పూనావాలా, సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విడుదల చేసిన ఒక వీడియోలో మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించిన నేతలంటేనే సీజేపీకి ఇష్టమని ఎద్దేవా చేశారు.‘ఈ ముగ్గురు నేతలను వారి రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారు. సీజేపీకి ఇలాంటి వారంటేనే ప్రీతి. ప్రజలు మరో నిర్ణయం తీసుకున్నందున ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నుంచి ‘జనతా’ అనే పదాన్ని తొలగించి, కేవలం ‘కాక్రోచ్ పార్టీ’ అని మాత్రమే పిలవాలి’ అని ఆయన పేర్కొన్నారు. తన వాదనకు మద్దతుగా స్టాలిన్ హయాంలో తమిళనాడు పబ్లిక్ డెట్ (ప్రజా రుణం) పెరగడం, విజయన్ పాలనలో కేరళలో నమోదైన కొవిడ్ మరణాలు, కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీలోని మద్యం దుకాణాల అంశాలను పూనావాలా ప్రస్తావించారు.ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న అభిజీత్ దీప్కే, దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులు ఎవరు అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలువురు నేతలు మంచి పనితీరు కనబరిచారని చెప్పారు. తమిళనాడు ఆర్థిక వ్యవస్థను స్టాలిన్ మెరుగుపరిచారని, కేరళ ఆరోగ్య రంగంలో విజయన్ చక్కటి సేవలందించారని, ఢిల్లీలో పాఠశాలలు, విద్యారంగ అభివృద్ధికి కేజ్రీవాల్ కృషి చేశారని దీప్కే పేర్కొన్నారు. కాగా గత మే నెలలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలవడంతో సీ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధికారాన్ని చేపట్టింది. ఈ ఎన్నికల్లో స్టాలిన్ తన సొంత స్థానంలోనూ ఓటమి చవిచూశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పదేళ్ల తర్వాత ఘనవిజయం సాధించగా, వీడీ సతీశన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించడంతో రేఖా గుప్తా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.ఇది కూడా చదవండి: తిరుగుబాటు టీఎంసీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ నోటీసులు -
ఆర్థిక ఇబ్బందులతోనే బీజేపీని వీడుతున్నా: షెహజాద్ పూనావాలా
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. మరోసారి తన రాజీనామాను ఉద్ఘాటించారు. ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. అదే సమయంలో.. పార్టీలో కొందరి వైఖరి కూడా తన నిర్ణయాన్ని బలపరచాయని తాజాగా పార్టీకి రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను పూనావాలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.తొలుత తన నిర్ణయాన్ని బీజేపీ నాయకత్వం గౌరవించి, రాజీనామా స్వీకరించకుండా పునరాలోచించాలని కోరిందని తెలిపారు. అయితే అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు క్రియాశీల సభ్యత్వం నుంచి తప్పుకోవాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో సమర్పించిన రాజీనామాను పార్టీ అంగీకరించకపోవడంతో.. మరోసారి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు లేఖ రాసి తనను బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. వీలైనంత త్వరగా ఆ పని చేయాలంటూ ఆయన కోరుతున్నారు.వ్యవస్థను వీడుతున్నా..తన నిర్ణయం వెనుక ప్రత్యేకమైన కారణాలేవీ లేవని పూనావాలా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని తెలిపారు.‘‘నేను బీజేపీ వ్యవస్థ నుంచి మాత్రమే బయటకు వస్తున్నాను.. సిద్ధాంతాల నుంచి కాదు’’ అని పేర్కొన్నారు. తాను ఎప్పటికీ మోదీ వీరాభిమానినేనని.. భవిష్యత్‌లోనూ సాధ్యమైనంత వరకు బీజేపీ ఆలోచనా విధానానికి మద్దతుగా ఉంటానని చెప్పారు.ఆ కొందరు ఎవరు?గత కొన్ని రోజులుగా జరిగిన కొన్ని పరిణామాలు తన నిర్ణయాన్ని మరింత బలపరిచాయని పూనావాలా లేఖలో పేర్కొనడం గమనార్హం. అయితే ఆ వ్యక్తులు ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. వారికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకత్వంతో తాను చర్చలు కూడా జరిపినట్లు ఆయన చెప్పినట్లు తెలిపారు.అలాగే భవిష్యత్తులో ఏ పార్టీలో చేరబోనని.. రాజకీయాలను వదిలి ప్రైవేటు రంగంలోకి వెళ్లనున్నట్లు చెప్పారు. ‘‘అత్యవసర ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని వివరించారు.కాంగ్రెస్ నుంచి బీజేపీకి..మహారాష్ట్రకు చెందిన 38 ఏళ్ల షెహజాద్ పూనావాలా న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే ప్రక్రియను బహిరంగంగా ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి 2021లో బీజేపీలో చేరారు.బీజేపీలో చేరిన తర్వాత ఆయన పార్టీకి చెందిన ప్రముఖ ముస్లిం ముఖంగా ఎదిగారు. టీవీ చర్చలు, మీడియా సమావేశాల్లో పార్టీ తరఫున తరచూ ప్రాతినిధ్యం వహించారు. హిందుత్వాన్ని బాగా ప్రచారం చేయడంతో.. అధినాయకత్వం ఆయన్ని చేరదీసింది. 2021లో బీజేపీ ఢిల్లీ ఐటీ, సోషల్ మీడియా విభాగం బాధ్యతలు కూడా నిర్వహించారు.ఆ తర్వాత.. టీవీ డిబేట్లో పార్టీ తరఫున ప్రతినిధిగా పాల్గొనేవారు. పార్టీలో తనకు లభించిన అవకాశాలను గుర్తుచేసుకుంటూ.. గత ఐదేళ్లుగా అందించిన వేదిక, గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే తాజాగా ఆయన తీసుకున్న రాజీనామా నిర్ణయం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీకి గుడ్‌బై.. మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?
షెహజాద్ పూనావాలా.. బీజేపీకి పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ వెనుక మరిన్ని కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిరసనలు, అలాగే పార్టీ వైఖరి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.షెహజాద్ పూనావాలా రాజీనామా వార్తలకు ముందు ఆయన తన ఎక్స్ (X) ఖాతా బయోలో కీలక మార్పులు చేశారు. తన ప్రొఫైల్ నుంచి బీజేపీ ప్రస్తావనను తొలగించారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని మాత్రం కొనసాగించారు. తన ఎక్స్ బయోలో మోదీకి తాను “లైఫ్ లాంగ్ ఫాలోవర్” అంటూ పేర్కొన్నారు. దీంతో పార్టీకి దూరమైనా.. మోదీ పట్ల తన గౌరవం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.జెన్‌జీ నిరసనల ఎఫెక్ట్‌తోనేనా?షెహజాద్ పూనావాలా నిష్క్రమణపై మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఇటీవల నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నేతృత్వంలో జరిగిన జెన్‌జీ నిరసనలు, వాటి చుట్టూ ఏర్పడిన రాజకీయ వాతావరణం తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పూనావాలా రాజీనామాకు జెన్‌జీ నిరసనలే కారణమని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నాయి. దీంతో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఎవరీ షెహజాద్ పూనావాలా?1987 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన షెహజాద్ పూనావాలా న్యాయ విద్యను అభ్యసించారు. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్టుగా పనిచేశారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి సర్ఫరాజ్ పూనావాలా, తల్లి యాస్మిన్ పూనావాలా. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ అనుకూల వాదిగా పేరున్న తహసీన్ పూనావాలా ఆయన సోదరుడు. విద్యార్థి రాజకీయాలు, పబ్లిక్ డిబేట్లలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తన న్యాయ నేపథ్యంతో వాదనలను బలంగా వినిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు.కాంగ్రెస్‌లో పంచాయితీతో.. షెహజాద్ పూనావాలా తొలుత కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు దూరమయ్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులై.. దేశవ్యాప్తంగా టీవీ డిబేట్లలో బీజేపీ వాణిని బలంగా వినిపించారు.బీజేపీకి బలమైన వాయిస్.. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో షెహజాద్ పూనావాలా పలు కీలక అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచాయి.ఆస్తులు ఎంత, ఆదాయ వనరులు ఏంటంటే..షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ఎలాంటి లోక్‌సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల అఫిడవిట్ రూపంలో ఆయన ఆస్తులపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 70 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.65 కోట్ల వరకు) ఉండొచ్చని అంచనా. ఆదాయ వనరుల్లో న్యాయవాద వృత్తి, టీవీ చర్చలు, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ ఈవెంట్లలో ప్రసంగాలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల బరిలోకి ఎందుకు రాలేదు?రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల టికెట్ కూడా లభించలేదు. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రత్యేక కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వాయిస్‌గా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లు, రాజకీయ విశ్లేషణలు, పార్టీ విధానాలపై వివరణ ఇవ్వడం వంటి బాధ్యతల్లోనే ఎక్కువగా కనిపించారు.కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే సంస్థాగత బాధ్యతలకు, మీడియా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఉన్న నేతలను ఆ పాత్రల్లోనే కొనసాగిస్తాయి. పూనావాలా విషయంలోనూ అదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా తదుపరి రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. మోదీపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా బయో స్పష్టం చేస్తోంది. అయితే ఆయన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? జెన్‌జీ నిరసనల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందా? లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది.


